26 Dec,2017

ఒక మనిషి గురించి చెప్పాలంటే అతని గురించి తెలియాలి. ఆ మనిషి విజయం గురించి చెప్పాలంటే.. దాని కోసం ఆ మనిషి పడిన కష్టం గురించి తెలియాలి. ఆ విజయం సాధించడం కోసం అతను పడిన తపన గురించి తెలియాలి. కష్టానికి మరోపేరుగా, విజయానికి మారుపేరుగా మారిన ఆ వ్యక్తి.. రాజు. 20 సంవత్సరాల క్రితం ఇదే రోజు(25-12-1997).. అప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్‌గా అపజయాలే తప్ప విజయాలు ఎరుగని రాజుకి.. తనమీద నమ్మకాన్ని, సినిమా మీద ఇష్టాన్ని వదులుకోని రాజుకి మొట్టమొదటి విజయం ‘పెళ్లిపందిరి’ రూపంలో దక్కింది. రాజుకి ప్రతీక్షణం అండగా, తోడుగా నిలిచిన శిరీష్, లక్ష్మణ్, కుటుంబ సభ్యులు, ఎంతోమంది స్నేహితుల నమ్మకం నిజమైంది. అపజయం వచ్చినప్పుడే ఆగని వ్యక్తి.. విజయం వచ్చాక ఆగుతాడా?

విజయ పరంపరకు ప్రస్థానం మొదలైంది. 1999లో శ్రీ వేంకటేశ్వర ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ ముగ్గురి కలయికలో ప్రారంభమైంది. వరుసగా ఒకే ఒక్కడు, నువ్వువస్తావని, సఖిలాంటి సినిమాలు పంపిణీ చేసి.. సూపర్ హిట్‌లు సాధించి రాజు కాస్తా.. నైజాం రాజుగా మారిపోయాడు. ఎవరో నిర్మించిన సినిమా పంపిణీ చేసి విజయం అందుకోవడం కాదు, మనమే సినిమాని నిర్మించి విజయాన్ని అందుకోవాలనే ఆలోచనతో 2002లో ప్రాణం పోసుకున్నదే శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్.

ఆదితో సంచలన విజయం అందించిన వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందించిన దిల్ చిత్రం 2003లో విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతే.. ఆ రోజు నుంచి నైజాం రాజు కాస్తా.. దిల్ రాజుగా మారిపోయాడు. డిస్ట్రిబ్యూటర్‌గా సాధించిన అనుభవం, సినిమాల మీద ఉన్న ఇష్టంతో ప్రారంభమైన ఎస్.వి.సి ఆరోజు నుంచి విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. దిల్ రాజు తర్వాత కొత్త దర్శకుడితో తీసిన ఆర్య, హ్యాట్రిక్ హిట్ కోసం మరో కొత్త దర్శకుడితో తీసిన భద్ర వరుసగా సంచలన విజయాలు సాధించి.. నిర్మాతగా కూడా దిల్ రాజు హ్యాట్రిక్ అందుకున్నాడు. సాధించినదానితో సంతృప్తిని చెంది.. అదే విజయమనుకుంటే పొరపాటోయ్.. అన్న కవి మాటలు బాగా నచ్చాయేమో. దిల్ రాజు తర్వాత తీసిన సినిమా బొమ్మరిల్లు. అది ఎంత సంచలన విషయం సాధించిందో.. 12 ఏళ్ల తర్వాత కూడా బొమ్మరిల్లు సినిమా గురించి మాట్లడని ఇళ్లు లేదు అన్నంతగా మారిపోయిందనేది అందరికీ తెలుసు.

ఆ తర్వాత మున్నా, పరుగు, కొత్తబంగారులోకం, ఆకాశమంత అంటూ ఒకటా రెండా.. 2007 నుంచి 2016 వరకు 18 సినిమాలు. విజయాలతో పాటు అప్పుడప్పుడు పరాజయాలు పలకరించినా.. వాటిని స్పీడ్ బ్రేకర్లుగా మాత్రమే చూసి, ఎక్కడ తప్పు జరిగిందో చెక్ చేసుకుని, మళ్లీ విజయాలను అందుకుంటూనే ఉన్నాడు. సంవత్సరానికి ఒక్కసినిమాని నిర్మించి సక్సెస్ చేయడం కష్టమైన ఈ రోజుల్లో భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఈనాటి వరకు వారికి సాధ్యం కానీ చరిత్రని 2017లో సృష్టించిన ఘనత ఎస్.వి.సీ. ది. వరుసగా 6 సినిమాలు. కొన్ని విజయాలు. కొన్ని ఘన విజయాలు.

జనవరిలో శతమానం భవతి అంటూ వచ్చి.. 27 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి నేషనల్ అవార్డు తీసుకువచ్చిన ఘనత రాజు అండ్ టీమ్‌ది. శతమానం భవతి, నేను లోకల్ తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం శ్రమిస్తున్న రోజుల్లో.. తనతో కష్టంలో, సుఖంలో జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన సహధర్మచారిణి అనిత.. తనని వదిలి వెళ్లిపోతే, ఆ దు:ఖాన్ని, బాధని మనసులోనే దాచుకుని.. తాను కృంగిపోయినట్టు కనబడినా, తాను మానసికంగా పడుతున్న బాధను చూసినా, తనని నమ్ముకున్న వందలాది మంది ఎక్కడ నిరాశకు గురవుతారో.. వాళ్ల భవిష్యత్ ఏమవుతుందో అని ఆలోచించాడేమో. ఒక్క రోజు షూటింగ్‌కి ఆటంకం కలగడం కానీ, తర్వాత సినిమాని పోస్ట్‌పోన్ చేయడం కానీ చేయని నిజమైన సినీ కళామతల్లి ముద్దుబిడ్డ దిల్ రాజు. అందరికీ గుర్తుండే ఉంటుంది. తన తండ్రి దూరమయ్యాడని తెలిసినా క్రికెట్ గ్రౌండ్‌లో ఉండి దేశం కోసం సెంచరీ కొట్టిన సచిన్ గురించి. అలాగే తనలోని బాధను తనలోనే దాచుకుని, తను ప్రేమించే సినిమా కోసం ఇక్కడే ఉండి డీజే, ఫిదా, రాజా ది గ్రేట్, ఎమ్.సి.ఏ. తో వరుసగా ఆరు హిట్‌లతో ఆరు సిక్స్‌లు కొట్టాడు దిల్ రాజు.

ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తనకి మొదటి సక్సెస్‌ని ఇచ్చిన పెళ్లిపందిరి చిత్రమే తన విజయాలకు పునాది అని భావించి.. పెళ్లిపందిరి సినిమా టీమ్‌తో పాటు.. ఈ సంవత్సరం మరిచిపోలేని సినిమాలను అందించిన ఆరు చిత్రాల టీమ్‌లని ఈ వేడుకకి పిలిచి అందరితో ఆనందాన్ని పంచుకునేలా చేసిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి.. మొత్తం ఎస్.వి.సీ టీమ్‌కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.. ఈ విజయపరంపర ఇలాగే కొనసాగాలని, మరిన్ని మంచి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించాలని.. మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Recent News