దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ, అగస్టా మంజు
నిర్మాత : రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి
సంగీతం : కళ్యాణి మాలిక్
కెమెరా : రామి
రచన : వర్మ , నరేంద్రా చారి
నటీనటులు : విజయ్ కుమార్, యజ్ఞ శెట్టి, శ్రీతేజ్ తదితరులు ..
విడుదల : 29-03-2019
రేటింగ్ : 2. 5 / 5
నందమూరి తారకరామారావు జీవిత కథతో మరో కోణంలో వివాదాస్పద కథతో సినిమా తీసే ప్రయత్నం చేసాడు సంచలనాలకు మారుపేరైన వర్మ. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎంటరైన తరువాత ఏమి జరిగింది ? అన్న ఆసక్తితో చంద్రబాబు వెన్నుపోటు అంశాన్ని ముఖ్యంగా తీసుకుని తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్నో వివాదాల మధ్య ఈ రోజు విడుదలైంది. మరి లక్ష్మిస్ ఎన్టీఆర్ లో ఎలాంటి విశేషాలు ఉన్నాయో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..
కథ :
మహా నటుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ 1983లో పార్టీ పెట్టిన కేవలం 9 నెలలకే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తరువాత 1989 జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో ఒకరమైన నైరాశ్యంలో ఒంటరిగానే ఉంటాడు ఎన్టీఆర్ ( విజయ్ కుమార్ ). అదే సమయంలో అయన అంటే ఆరాధించే లక్ష్మి పార్వతి ( యజ్ఞ శెట్టి ) అయన జీవిత కథ రాయాలన్న ఉద్దేశంతో అక్కడికి వస్తుంది. తన జీవిత కథ రాసేందుకు ఎన్టీఆర్ పర్మిషన్ ఇవ్వడంతో రోజు ఆయన వద్దకు వస్తూ వెళుతూ ఉంటుంది. ఈ క్రమంలో లక్ష్మి మనస్తత్వం బాగా నచ్చడంతో ఎన్టీఆర్ కు ఆమె బాగా దగ్గరవుతుంది. ఆమె రాకతో ఎన్టీఆర్ లో కొత్త ఉత్సాహం మొదలవుతుంది. ఇన్నాళ్లు నైరాశ్యంలో ఉన్న అయన మళ్ళీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో లక్ష్మి పార్వతి ఉండడాన్ని ఎన్టీఆర్ కొడుకులు కోడళ్ళు జీర్ణించుకోరు. ఆమెను ఇంట్లోనించి పెంపేయాలని ఎన్టీఆర్ తో చెబుతారు .. కానీ ఆమె నాతోనే ఉంటుంది. మీరే బయటకు వెళ్ళండి అంటూ వారిని వెళ్ళగొడతాడు. ఈ నేపధ్యలో లక్ష్మి పార్వతి - ఎన్టీఆర్ లపై రోజుకో న్యూస్ ప్రచారం జరుగుతుంది. అప్పటికే లక్ష్మి పార్వతికి పెళ్ళై ఓ కొడుకు కూడా ఉంటాడు. ఈ గాసిప్స్ పై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో ఎన్టీఆర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు. దాంతో ఎన్టీఆర్ ఇంట్లో ఈ విషయం పెద్ద రాద్ధాంతం గా మారుతుంది. ఎవరెన్ని చెప్పినా ఎన్టీఆర్ లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు. ఆ తరువాత పార్టీ ప్రచారంలో లక్ష్మి తో కలిసి పాల్గొన్న ఎన్టీఆర్ మళ్ళీ తన పార్టీకి పూర్వ వైభవం తెస్తాడు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుంది. ఇదంతా గమనిస్తున్న అయన అల్లుడు బాబు ( శ్రీతేజ్ ) లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ రాజకీయయ వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉందంటూ పార్టీలో నిరసనలు క్రియేట్ చేస్తాడు ..దాంతో పార్టీలో ముసలం ఏర్పడుతుంది. ఆ తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడా ? లక్ష్మి పార్వతిని తన వారసురాలిగా ప్రకటించాడా ? ఈ నేపథ్యంలో పార్టీ ఎంఎల్ ఏ లతో కలిసి బాబు వెన్నుపోటు పొడిచాడా ? అన్నది మిగతా కథ.
నటీనటుల ప్రతిభ :
నటీనటుల గురించి చెప్పాలంటే ఈ కథ మొత్తంగా ముగ్గురి చుట్టే తిరిగింది .. అందులో ఎన్టీఆర్ పాత్రలో విజయ్ కుమార్ పరవాలేదనిపించాడు. పోలికల విషయంలో అంతగా సూట్ కాకపోయినా ఉన్నంతలో బాగానే చేసాడు. ముఖ్యంగా అయన వాయిస్ ని మిమిక్రి చేయించడంతో కాస్త బెటర్ గా అనిపిస్తుంది. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ బాగా చేసాడు. చాలా సార్లు చంద్రబాబును గుర్తుకు తెచ్చేలా కనిపించి హైలెట్ గా నిలిచాడు. ఇక లక్ష్మి పార్వతి పాత్రలో .. యజ్ఞ శెట్టి నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఎన్టీఆర్ - చంద్రబాబు పాత్రలు అనుకరణలు గా అనిపిస్తాయి .. కానీ లక్ష్మి పార్వతి పాత్ర మాత్రం ఒరిజినల్ గా ఉండేలా ప్లాన్ చేసారు. ఇక మిగతా పాత్రల్లో చేసిన వాళ్ళు వారి వారి పాత్రలో జస్ట్ ఓకే అనిపించారు.
టెక్నీకల్ హైలెట్స్ :
జనరల్ గా వర్మ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతోంది .. ఈ సినిమాలో అదే కనిపించింది. కళ్యాణి మాలిక్ అందించిన పాటలు .. నేపధ్య సంగీతం ఆకట్టుకునే ఉంది . ముఖ్యంగా ప్రముఖ గాయకుడూ బాలు పాడిన నువ్వే నా సర్వస్వం సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. రామి ఫోటోగ్రఫి పరవాలేదు. వర్మ సినిమాల విషయంలో పాటించే క్వాలిటీ ఈ సినిమాలో లేదు. కొన్ని చోట్ల బి గ్రేడ్ సినిమాను తలపించేలా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకోవాల్సింది .. రెండో భాగం బాగా సాగదీసినట్టుగా అనిపించింది. ఇక దర్శక ద్వయం రామ్ గోపాల్ వర్మ , అగస్త్య లు ఏమాత్రం ప్రత్యేకత చూపించలేదు. వర్మ గత సినిమాలతో పోలిస్తే కాస్త బెటర్ కానీ వర్మ రేంజ్ లో తీసే సినిమా మాత్రం కాదనిపిస్తుంది. ఇక కథ మొత్తం ఒకే కోణంలో చూపించడం .. కావాలని కొన్ని కల్పిత సన్నివేశాలు జోడించడం లాంటివి బోర్ కొట్టిస్తాయి. అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ బాగానే పలికించాయి.
చివరిగా :
లక్ష్మి పార్వతితో పెళ్లి ... చంద్రబాబు వెన్నుపోటు లాంటి అంశాలు తీసుకుని తీసిన ఈ సినిమా అంత ఆసక్తికరంగా సాగాదు. కేవలం లక్ష్మి పార్వతి కోణంలోనే చూపించే ప్రయత్నం చేసారు దర్శకులు. ఇదివరకే వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కథా నాయకుడు, మహా నాయకుడు సినిమాల్లో నిజాలు చూపించలేదనే విమర్శలు వినిపించాయి .. కానీ లక్ష్మి పార్వతి సినిమాలో చంద్రబాబు వెన్నుపోటును ప్రధాన అంశంగా తీసుకుని కథ అల్లేసుకుని చేసిన ఈ కథలో పెద్దగా కొత్తదనం ఏమి లేదు .. మొదటి నుండి ప్రేక్షకుల్లో ఈ సినిమా పై ఉన్న ఆస్కాక్తిని నీరుగార్చే ప్రయత్నం చేసారు. కేవలం లక్ష్మి పార్వతి కోణంలో కథను రాసుకోవడం. పైగా ఈ కథ విషయంలో లక్ష్మి పార్వతిని కలవలేదని, ఆమెకు ఈ కథతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన వర్మ మాటలకు ఈ సినిమాకు ఎక్కడ సంబంధం లేదు .. ఎందుకంటే కేవలం లక్ష్మి పార్వతి కోణంలోనే సినిమా సాగడం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించదు.