వేర్ ఈజ్ ఈ ద వెంకటలక్ష్మీ రివ్యూ 

16 Mar,2019

సంగీతం: హరి గౌర
ఛాయాగ్రహణం   :       వెంకట్ శాఖమూరి
కథ - స్క్రీన్ ప్లే - మాటలు   :      తటవర్తి కిరణ్
నిర్మాతలు       :         శ్రీధర్ రెడ్డి - ఆనంద్ రెడ్డి-ఆర్కే రెడ్డి
దర్శకత్వం       :         వై.కిషోర్ కుమార్
నటీనటులు   :     రాయ్ లక్ష్మీ, ప్రవీణ్, మధునందన్, రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ తదితరులు
విడుదల    :    15-03-2019
రేటింగ్     :   2. 5 / 5

గ్లామర్ గర్ల్ గా సౌత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న లక్ష్మి రాయ్ స్టార్స్ హీరోలతో ఐటెం సాంగ్స్ తో చిందేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా ఆమె లీడ్ పాత్రలో వెర్ ఈజ్ వెంకటలక్ష్మి గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  కమెడియన్లు ప్రవీణ్-మధునందన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు కొత్త దర్శకుడు కిషోర్ కుమార్ తెరకెక్కించాడు. హార్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ శుక్రవారం వచ్చిన వెంకటలక్ష్మి గురించి తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..  


కథ:

చంటి గాడు  (ప్రవీణ్) - పండు గాడు  (మధునందన్) ఈ ఇద్దరు తమ గ్రామంలో ఉన్న వాళ్లందరికీ పెద్ద తలనొప్పిలా తయారవుతారు. వాళ్ల వల్ల ఆ ఊర్లో ఇబ్బంది పడని వాళ్లంటూ ఉండరు. అలాంటి ఊరికి వెంకటలక్ష్మీ అనే టీచర్ వస్తుంది. చంటి.. పండు ఆమె మాయలో పడతారు. వెంకటలక్ష్మీని ఇంప్రెస్ చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ చివరికి చూస్తే ఆమె మనిషి కాదు దయ్యం అని తెలుస్తుంది. అది తెలుసుకునేలోగా చంటి-పండు ఆమె ఉచ్చులో పడతారు. తన నుంచి బయటపడాలంటే ఒక పని చేసి పెట్టాలని వెంకటలక్ష్మీ వాళ్లను బెదిరిస్తుంది. ఇంతకీ ఆమె చెప్పిన పనేంటి.. వీళ్లా పని చేసి వెంకటలక్ష్మీ నుంచి బయటపడ్డారా లేదా అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

ఈ సినిమాలో వెంకటలక్ష్మి పాత్రలో  రాయ్ లక్ష్మీ తన అందంతో ఆకట్టుకుంది. కానీ ఆమె లుక్ ఇంతకు ముందు ఉన్నంతగా గ్లామర్ గా లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇక నటన పరంగా ఆమెనుండి  ఆశించడానికేమీ లేదు. ముక్యంగా సెకండ్ హాఫ్ లో  ఆమె పాత్ర తేలిపోవడంతో కథ కంచికి చేరుతుంది. ఇక కమెడియన్స్  ప్రవీణ్ మధునందన్ తమ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ల టాలెంటుని పెద్దగా ఉపయోగించుకోలేదని చెప్పాలి. హీరోగా రామ్ కార్తీక్ గురించి పెద్దగా  చెప్పడానికేమీ లేదు. అతడికి జోడీగా నటించిన పూజిత మాత్రం ఆకట్టుకుంది. ఆమెలోని గ్లామర్ యాంగిల్ కొత్తగా అనిపిస్తుంది. నటన కూడా బాగుంది. ఇక మిగతా పాత్రలు చేసిన వాళ్ళు కాస్త ఓవర్ యాక్షన్ చేశారనిపిస్తుంది. ఈ సినిమాలో  మొదటగా దయ్యాన్ని చాలా భయానకంగా చూపిస్తారు. తర్వాతేమో.. దయ్యంతో పాత్రలు చాలా మామూలుగా మాట్లాడేస్తుంటాయి. అప్పుడప్పడూ అది దయ్యం అని మనకు గుర్తు చేస్తున్నట్లుగా భయం నటిస్తుంటారు తప్పితే పాత్రల్లో ఏ రకమైన ఫీలింగ్ ఉండదు.  ప్రతి సన్నివేశాన్నీ చాలా సిల్లీగా డీల్ చేశారు. కథాకథనాలు ఎక్కడా కూడా పద్ధతిగా సాగక.. క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ కూడా సరిగా లేదు.  

టెక్నీకల్ హైలెట్స్ :

టెక్నీకల్ విషయాల గురించి చర్చిస్తే .. . హరి గౌర సంగీతం యావరేజ్. ప్రథమార్ధంలో రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకోదు. వెంకట్ ఛాయాగ్రహణం గురించి పెద్దగా మాట్లాడుకోవలసింది ఏమి లేదు.  నిర్మాణ విలువలు ఒకే .  తటవర్తి కిరణ్ అందించిన కథ బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లేలో ఏ విశేషం లేదు. దర్శకుడు కిషోర్ కుమార్ దాన్ని తెరపై ప్రెజెంట్ చేయడంలో ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు. అతడి అనుభవ లేమి చాలాచోట్ల కనిపించింది.  కొన్ని ఐడియాలు వినడానికి బాగుంటాయి. కానీ ఎగ్జైటింగ్ గా అనిపించే ఐడియాను రెండున్నర గంటల సినిమాగా మలచాలంటే ఎంతో పనితనం ఉండాలి. ఆ ఐడియాను బేస్ చేసుకుని బిగువైన కథాకథనాలు అల్లడం.. తెరపై ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడం అంత సులువైన విషయం కాదు. ఐడియాను మాత్రమే నమ్ముకుని   మొక్కుబడిగా వ్యవహారం లాగించేస్తే  అది అచ్చంగా ఈ సినిమాలాగే ఉంటుంది.   

విశ్లేషణ : 

దర్శకుడు కిషోర్ కుమార్ తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ప్లో మిస్ అయింది. ఏ సీన్ కి ఆ సీన్ బాగుందినిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. దీనికి తోడు కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. సెకెండ్ హాఫ్ లో ట్విస్ట్ లు బాగానే పెట్టారు గాని, అవి ఆశించిన స్థాయిలో థ్రిల్ చెయ్యవు. గ్లామర్ గర్ల్ గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న లక్ష్మీరాయ్ గ్లామర్ ని, అలాగే హీరోయిన్ పూజితలను గ్లామరస్ గా చూపించి ఓ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. దీంతో పాటుగా డబుల్ మీనింగ్ డైలాగులు.. వల్గారిటీ కామెడీతో ఆ తరహా వినోదాన్ని ఆశించేవాళ్లను కొంత మెప్పించే ప్రయత్నం చేశారు. అంతకుమించి ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. ద్వితీయార్ధం అంతటా ప్రతి సీన్ సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు.  పైగా చాలా సన్నివేశాల్లో లాజిక్స్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా సినిమా తీశారా అనిపిస్తోంది. వీటికి తోడు ఇంట్రస్ట్ గా సాగని స్క్రీన్ ప్లే, సినిమా పై ఉన్న ఆసక్తిని నీరుగారిస్తోంది. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రేక్షకుడికి ఆసక్తి రేకెత్తించకుండా సాగుతూ.. బోర్ కొట్టిస్తోంది. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకరచయితలు మాత్రం కథ కథనాలను మాత్రం లాజిక్స్ లేకుండా.. మరీ సినిమాటిక్ గా రాసుకున్నాడు. 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY