సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్
నిర్మాత: మహేష్ కోనేరు
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: కె.వి.గుహన్
నటీనటులు: కళ్యాణ్ రామ్, నివేథా థామస్, షాలిని పాండే, ప్రభాస్ శీను,రాజీవ్ కనకాల, నాజర్, హరితేజ తదితరులు
విడుదల : 1- 03- 2019
రేటింగ్ : 2. 75 / 5
సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ .. ప్రయోగాత్మక చిత్రాలవైపు మొగ్గు చూపించే నందమూరి కళ్యాణ్ రామ్ మధ్య మధ్యలో కమర్షియల్ మాస్ సినిమాలు చేస్తున్నా కూడా ఎక్కువగా భిన్నమైన సినిమాలే చేస్తాడు .. తాజాగా అయన 118 అంటూ ఓ థ్రిల్లర్ సినిమాతో మన ముందుకొచ్చాడు. సినిమాటోగ్రాఫర్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కె.వి.గుహన్ దర్శకుడిగా మారుతూ రూపొందించిన ఈ చిత్రంలో .. 118 అంటే ఏమిటన్న ఆసక్తి ఇప్పటికి నెలకొంది .. మరి అదేమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..
కథ:
గౌతమ్ (కళ్యాణ్ రామ్) ఒ టీవీ ఛానెల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. తనకు ఆసక్తి కలిగించే ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ నేపథ్యంలో ఓ రిసార్ట్ లో రాత్రి నిద్రపోతాడు .. అప్పుడు అతనికి ఓ కల వస్తుంది .. ఆ కలలో ఓ అమ్మాయిని దారుణంగా చంపేస్తారు కొన్ని రోజుల తర్వాత ఆ రిసార్టుకు వెళ్తే మళ్లీ అదే కల అతడిని వెంటాడుతుంది. దీంతో అది మామూలు కల కాదని భావిస్తాడు గౌతమ్ .. అసలు ఎందుకు ఆ కల వెంటాడుతుంది .. పైగా కలలో కనిపించిన సంఘటనలు నిజంగా జరగడంతో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ గౌతమ్ కలలోకి వచ్చిన అమ్మాయి ఎవరు.. ఆమె ఎందుకు మాయమైంది ? దాని వెనుకున్న రహస్యాన్ని గౌతమ్ ఎలా బయటపెట్టాడు .. దానివల్ల అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి అన్నది మిగతా కథ ..
నటీనటుల ప్రతిభ :
హీరో కళ్యాణ్ రామ్ తన పాత్రకు తగ్గట్లుగా చక్కగా చేసాడు. ఎక్కడా ఓవర్ హీరోయిజం చూపించలేదు. కథతో పాత్రను నడిపించడం ఆకట్టుకుంటుంది.అలాగే అతడి న్యూ లుక్ బాగుంది. ఇన్వెస్టిగేటివ్ గా అతను పడే తపన బాగా చూపించాడు. ఇక హీరోయిన్ నివేథా థామస్ కనిపించేది తక్కువ టైమే అయినప్పటికీ కథను మలుపుతిప్పే పాత్ర లో జీవించేసింది. తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. షాలిని పాండే పాత్ర మాములుగా ఉంది .. హీరోకి జోడిగా ఒకటి రెండు సీన్స్ లలో కనిపించింది. ప్రభాస్ శీను.. రాజీవ్ కనకాల.. హరితేజ తదితరులు పాత్రలకు తగ్గట్లు చేశారు. డాక్టర్ పాత్రలో నాజర్ జస్ట్ ఓకే.
టెక్నీకల్ హైలెట్స్ :
సాంకేతికత పరంగా ఈ సినిమా బాగుందని చెప్పొచ్చు. థిల్లర్ సినిమాకు ముఖ్యమైంది నేపధ్య సంగీతం. శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. పాటలు యావరేజ్ గా ఉన్నాయి. దర్శకుడు గుహనే అందించిన ఛాయాగ్రహణం టాప్ క్లాస్ అనిపిస్తుంది. సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో సినిమాటోగ్రఫీ ఒకటి. తన కథకు తగ్గ కెమెరా పనితనంతో ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఇక దర్శకుడిగానూ గుహన్ పనితనం చూపించాడు. కొత్త కాన్సెప్ట్ ఎంచుకుని దాన్ని చాలా వరకు ఆసక్తికరంగా చెప్పాడు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. కాకపోతే ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేసే థ్రిల్ మూమెంట్స్ ను అతను స్క్రిప్టులో దుపరచలేకపోయాడు.
థ్రిల్లర్ సినిమాలకు అత్యంత కీలకమైన విషయం.. తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి రేకెత్తించడం.. ఈ విషయంలో ‘118’ చాలా వరకు ఓకే కానీ చాలా అనుమానాలు ప్రేక్షకులకు రైజ్ అవుతాయి. ల్యూసిడ్ డ్రీమింగ్ అనే కొత్త కాన్సెప్ట్ ను పరిచయం చేశాడు. ఇందులో చనిపోయిన వ్యక్తి ఆత్మ మరొకరిలోకి ప్రవేశించి ప్రతీకారాన్ని తీర్చుకోవడం హార్రర్ సినిమాల్లో మనం చూస్తుంటాం. కానీ ఇందులో మాత్రం అన్యాయానికి గురైన వ్యక్తికి సంబంధించిన ఉదంతం హీరో కలలోకి రావడం.. ఆ కలను వెంటాడుతూ హీరో ప్రయాణం సాగించడం.. దీనికి సైంటిఫిక్ రీజనింగ్ ఇవ్వడం.. ఇదంతా ప్రేక్షకులకు జీర్ణం కానీ అంశాలు.
విశ్లేషణ :
చివరగా .. దర్శకుడు చెప్పాలనుకున్న కథను చక్కగా చెప్పే ప్రయత్నం చేసినా కూడా అక్కడక్కడా కావాలని కథను సాగించడం కోసం కొన్ని సన్నివేశాలను వదిలేసాడు అనిపిస్తుంది. వృథాగా అనిపించే సన్నివేశం ఒక్కటి కూడా లేదు .. హీరోయిన్ తో ఒక రొమాంటిక్ లేదా కమెడియన్ తో డ్రైవ్ చేసిన .. అది ఏదో ఒక విషయాన్ని చెప్పడానికే ప్రయత్నించాడు దర్శకుడు. సినిమా మొదలైన పది నిమిషాల్లో .. కథలోకి తీసుకెళతారు .. హీరో తనకు వచ్చిన కథ తాలూకు మర్మాన్ని కనుగొనే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. ప్రథమార్ధం శరవేగంగా సాగిపోతుంది. ద్వితీయార్ధం మీద క్యూరియాసిటీ పెంచుతుంది. నిజానికి ఒక సంఘటన తాలూకు విషయాన్నీ తెలుసుకోవడం కోసం అతను చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే వారిని పట్టుకుని విషయం తెలుసుకునే అవకాశం ఉన్నా .. హీరో మాత్రం వాటిని వదిలేసి .. ఇంకేదో వెతకాలని ఎక్కువ క్యూరియాసిటీ చూపించడం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది. మొదట్నుంచి ఒక కొత్త తరహా సినిమా చూస్తున్న ఫీలింగ్ ను ఫ్లాష్ బ్యాక్ చెడగొట్టేస్తుంది. ఇక్కడ దర్శకుడు కొత్తగా ఏమీ అనిపించలేదు. నివేథా థామస్ మంచి పెర్ఫామెన్స్ ఇవ్వడం వల్ల ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం ఎమోషనల్ టచ్ కనిపించింది కానీ.. ఆ ఎపిసోడ్ మొత్తం రొటీన్ గా ఉండటంతో నిరాశ తప్పదు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ‘ల్యూసిడ్ డ్రీమింగ్’ అనే కాన్సెప్ట్ కూడా అంత ప్రభావవంతంగా ఏమీ అనిపించదు. డాక్టర్ గా నాజర్ పాత్రను కొంచెం సిల్లీగా తీర్చిదిద్దడం వల్ల ‘ల్యూసిడ్ డ్రీమింగ్’కు సంబంధించిన సన్నివేశాల్లోనూ సీరియస్నెస్ కొరవడింది. ఒక థ్రిల్లర్ మూవీ నుంచి ఆశించే ముగింపు కూడా ఇందులో మిస్సయింది.