వినయ విధేయ రామ రివ్యూ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రిషి పంజాబి - ఆర్థర్ విల్సన్
మాటలు: ఎం.రత్నం
నిర్మాత: డీవీవీ దానయ్య
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: బోయపాటి శ్రీను
నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వాని, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ, మహేష్ మంజ్రేకర్ తదితరులు
విడుదల : 11-01-2019
రేటింగ్ : 2. 5 / 5
రామ్ చరణ్ .. గత ఏడాది రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు .. మాస్ జనాలకు దగ్గరయ్యేందుకు ఈ సారి మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తో వినయ విధేయ రామ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భారీ బడ్జెట్ .. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలను రేకెత్తించింది .. మరి ఈ విధేయ రామ ఆ అంచనాలను నిలబెట్టుకున్నాడా లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..
కథ:
అనాథలైన నలుగురు చిన్న పిల్లలకు రైల్వే ట్రాక్ పక్కన దొరుకుతాడు రామ్ ( రామ్ చరణ్ ). ఆ తరువాత ఈ ఐదుగురూ ఒక పెద్ద మనిషి అండతో కష్టపడి పెరిగి పెద్దవాళ్లవుతారు. తనను చేరదీసిన అన్నలతో కలిసి హ్యాపీ ఫ్యామిలి ఏర్పడుతుంది. నలుగురు అన్నయ్యల కోసం ప్రాణం పెట్టేస్తాడు. వారి జోలికి ఎవరు వచ్చినా వదిలి పెట్టడు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన తన పెద్దన్నయ్య భువన్ కుమార్ ( ప్రశాంత్ )కు ఎదురయ్యే ప్రతి సమస్యకూ అతను పరిష్కారంగా నిలుస్తుంటాడు. ఎన్నికల అధికారి బీహార్ కు ట్రాన్స్ఫర్ అవుతాడు. బీహార్లో అందరిని శాశించి రౌడీ రాజ్యాన్ని నడిపిస్తున్న రాజా భాయ్ (వివేక్ ఒబెరాయ్)ని ఎదురించబోయి చిక్కుల్లో పడతాడు రామ్ అన్నయ్య. ఈ పరిస్థితుల్లో రామ్ ఏం చేశాడు.. రాజాను ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.
నటీనటుల ప్రతిభ :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కా మాస్ మసాలా మూవీ చేయలేదు అని ఫీలవుతున్న అభిమానుల కోరికని ‘వినయ విధేయ రామ’తో తీర్చేసాడు. చరణ్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే, రామ్.. రామ్ కొ ణి దె ల పాత్రలో అదరగొట్టేసాడు. గతంలో రామ్ చరణ్ మాస్ పాత్రలు చేసినప్పటికీ ఇంత పవర్ఫుల్ పాత్రలో కనిపించడం ఇదే మొదటిసారైతే, అంతకు మించి తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ‘రంగస్థలం’తో నటుడిగా గొప్ప పేరు సంపాదించి.. మరపురాని విజయాన్నందుకున్న రామ్ చరణ్.. దాని తర్వాత ఇలాంటి సినిమా చేయడం విచారకరమైన విషయం. చరణ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి యాక్సెప్టెన్స్ వస్తున్న సమయంలో ఇలాంటి సినిమా కచ్చితంగా అతడికి బ్రేక్ వేసేదే. యాక్షన్ సన్నివేశాల్లో.. డ్యాన్సుల్లో అతను ఎప్పట్లాగే రాణించాడు. హీరోయిన్ కియారా అద్వానీ కేవలం పాటలకు మాత్రమే పనికొచ్చింది. ఆమె అందంగా కనిపించింది. విలన్ వివేక్ ఒబెరాయ్ దర్శకుడు చెప్పినట్లు చేసుకుపోయాడు. అతడి పాత్ర ఏమీ ఆసక్తి రేకెత్తించదు. ప్రశాంత్.. స్నేహలకు కొంచెం ప్రాముఖ్యత ఇచ్చారు. సినిమాలో మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పుకునేది ఏమిలేదు .
టెక్నీకల్ అంశాలు :
దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో యావరేజ్ . నేపథ్య సంగీతంలోనూ ఏ ప్రత్యేకతా లేదు. దాదాపుగా సినిమా మొత్తం .. ఎవడు తరహా ఆర్ ఆర్ ఇచ్చేసాడు. రిషి పంజాబి.. ఆర్థర్ విల్సన్ అందించిన ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. కావాల్సినంత ఖర్చు పెట్టారు. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను.. మాస్ సినిమా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లో తీసినట్లు అనిపిస్తుంది. కథలో ఏ కొత్తదనం లేదు. కథనమూ అంతంతే. ఇంతకుముందులా యాక్షన్ ఘట్టాల్లో అతను ప్రేక్షకుల్లో భావోద్వేగాల్ని రగల్చలేకపోయాడు. ఎమోషన్ లేకుండా ఊరికే యాక్షన్ ఘట్టాలతో సినిమాను నింపేశాడు. దర్శకుడిగా పూర్తిగా విఫలమయ్యాడు.
ఈ మధ్య తెలుగు సినిమా చాలా మారిపోయింది. దర్శకులు.. హీరోలు కొత్తదనం వైపు అడుగులేస్తున్నారు. వినూత్నమైన సినిమాలకు ప్రేక్షకులూ పట్టం కడుతున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా ఒక ఫార్ములా ప్రకారం మాస్ మసాలా సినిమాలు తీసుకుంటూ సాగిపోతున్నాడు బోయపాటి శ్రీను. ఎంత ఫార్ములాను అనుసరించినా.. తన హీరోతో తెరపైన ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోయాడు.
విశ్లేషణ :
అలవాటైన కథకు ఆసక్తికర నేపథ్యం జోడిండంలో.. ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్టయ్యేలా చెప్పడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. రామ్ చరణ్ లాంటి పెద్ద మాస్ హీరో దొరికాడు కాబట్టి.. అతడిని ఎంత బలంగా చూపిద్దాం.. ఎలాంటి విన్యాసాలు చేయిద్దాం.. అన్నదే అతడి ఆలోచనగా మారినట్లుగా అనిపిస్తుంది. సినిమా అంతా హీరో చేసేది విధ్వంసమే. బీహార్ రాష్ట్రానికి సీఎం అయిన వ్యక్తి వందల మంది కమాండోలతో కలిసి.. తెలుగు రాష్ట్రంలో ఉన్న హీరో దగ్గరికి వచ్చి అంటాడు.. ‘‘మా రాష్ట్రానికి ఒకప్పుడు బుద్ధుడొచ్చాడు. తర్వాత నువ్వొచ్చి మా దగ్గర జరుగుతున్న అరాచకాల్ని ఆపావు’’ అని. ‘సింహాద్రి’ రోజుల్లో ఇలాంటి ఎలివేషన్లు బాగానే అనిపించి ఉండొచ్చు కానీ.. ఇలాంటివి చూసి చూసి విసుగెత్తిపోయి కొత్త కథలకు ఆసక్తిగా చూస్తున్నారు సినిమా జనాలు. ఇప్పుడు బోయపాటి మళ్లీ ఇలాంటి ఎలివేషన్లు ట్రై చేశాడు. హీరో ఉన్నట్లుండి ఊడిపడి మరెక్కడో ఉన్న అతడి రౌడీల్ని కొట్టుకొంటూ అదే ఆఫీసుకు తీసుకొచ్చి తన ప్రతాపం చూపించడం.. ఎక్కడో బీహార్లోని ఒక మారుమూల కొండ ప్రాంతం నుంచి తన అన్నయ్య కాపాడమంటూ ఫోన్ చేయగానే ఇంకెక్కడో ఎయిర్ పోర్టులో ఉన్న హీరో అద్దాలు పగలగొట్టుకుని కిందికి దూకేసి.. ఇంకొంచెం ముందుకొచ్చి ఫ్లైఓవర్ మీది నుంచి శరవేగంగా దూసుకెళ్తున్న ట్రైన్ మీదికి దూకేసి..బీహార్ కు వెళ్లడం .. అక్కడి నుంచి గుర్రమేసుకుని విలన్ డెన్లోకి ఎంట్రీ ఇచ్చి విలన్లను ఉతికారేయడం.. ఇలాంటి అరాచకాలు ఎన్నో ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్.. కామెడీ ట్రాక్.. లవ్ ట్రాక్స్ అన్ని ఉన్నా కూడా .. వినయ విధేయ రామ అనే టైటిల్ కాదు .. విద్వాంస రామ ఓకే .