సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: జేకే
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన - దర్శకత్వం: హను రాఘవపూడి
నటీనటులు: శర్వానంద్ - సాయి పల్లవి - వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - కల్పిక - మురళీ శర్మ - సంపత్ - ప్రియా రామన్ తదితరులు
విడుదల : 21-12-2018
రేటింగ్ : 2. 5 / 5
శర్వానంద్-సాయి పల్లవి లాంటి చక్కటి జంట.. హను రాఘవపూడి లాంటి అభిరుచి ఉన్న దర్శకుడు.. ఈ కాంబినేషన్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ‘పడి పడి లేచె మనసు’. ఈ రోజే మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.
కథ:
కోల్ కతాలో చదువు పూర్తి చేసి స్నేహితులతో కలిసి సరదాగా గడిపేస్తున్న సూర్య (శర్వానంద్).. అనుకోకుండా మెడికో అయిన వైశాలి (సాయిపల్లవి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమె వెంట పడి పడి.. చివరికి ఆమెను కూడా ప్రేమలోకి దించుతాడు. ఐతే తన తల్లిదండ్రుల జీవితంలో జరిగిన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని అతను వైశాలితో పెళ్లికి నిరాకరిస్తాడు. ఒకరినొకరు విడిచి ఉండిపోలేనంత ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోవాలని అంటాడు. దానికి వైశాలి, సూర్య కు ఒక కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ ఏంటి ? సూర్య.. వైశాలి తర్వాత కలిశారా.. అన్నది మిగతా కథ ...
నటీనటుల ప్రతిభ :
నటీనటుల గురించి చెప్పాలంటే .. శర్వానంద్.. సాయిపల్లవిల గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు. ఇద్దరు మంచి నటులు. ఇద్దరూ పోటీ పడి నటించారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనడానికి లేదు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ సినిమాకు పెద్ద బలం. ఎమోషనల్ సీన్లలో ఎవరికి వారే సాటి అనిపించారు. సినిమాలో ఎలాగూ కొన్ని చోట్ల మాత్రం సాయిపల్లవి డామినేట్ చేసింది. ఇంటర్వెల్ బాంగ్ లో సాయిపల్లవి హావభావాలు కట్టి పడేస్తాయి. శర్వా కొన్ని సీన్లలో తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఐతే మిగతా నటీనటులెవరినీ దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. ప్రియదర్శి మాత్రం కనిపించినంతసేపు నవ్వించాడు. మరళీ శర్మ.. సంపత్ లాంటి నటుల పాత్రలు నామమాత్రంగా అనిపిస్తాయి. ప్రియా రామన్ పాత్రలోనూ ఏ విశేషం లేదు. వెన్నెల కిషోర్ పాత్రకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. కల్పిక.. అజయ్ ల నటన పర్వాలేదు.
టెక్నీకల్ హైలెట్స్ :
టెక్నికల్ పరంగా సినిమా బాగా వర్కవుట్ అయింది. విశాల్ చంద్రశేఖర్ మంచి సంగీతం అందించాడు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం బాగుంది. జేకే ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రతి సన్నివేశం ఆహ్లాదంగా అనిపించేలా కెమెరాతో మ్యాజిక్ చేశాడు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ లేదు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది. హను రాఘవపూడి మంచి అభిరుచి ఉన్న దర్శకుడు. భిన్నమైన కథలు ప్రయత్నిస్తాడు. ప్రేమ సన్నివేశాల్ని పండించడంలో అతడి శైలే వేరు. కానీ ఒక పూర్తి కథను బిగితో చెప్పమంటే మాత్రం చేతులెత్తేస్తాడు. చక్కగా కథను మొదలుపెట్టి.. ఒక దశలో పతాక స్థాయికి తీసుకెళ్లి అమాంతం వదిలేసాడు. ఒక కథను అందంగా మొదలుపెట్టి.. అంతే అందంగా నడిపించి.. ప్రేక్షకులకు ఒక మంచి ఫీలింగ్ కలిగించి.. అక్కడి నుంచి కింద పడేశాడు. ప్రథమార్ధంలో పెద్దగా కథ లేకపోయినా.. ప్రేమ వ్యవహారం రొటీనే అయినా.. ప్రేమ సన్నివేశాల్ని పండించడంలో హను అభిరుచి.. ట్రీట్ మెంట్ లో ఉండే ఫ్రెష్ నెస్.. శర్వానంద్-సాయిపల్లవిల పెర్ఫామెన్స్.. వాళ్ల మధ్య కెమిస్ట్రీ అన్నీ చక్కగా కుదిరాయి. కొన్ని సన్నివేశాలు అసంబద్ధంగా ఉన్నప్పటికీ శర్వా-పల్లవి జోడీ వాటిని కప్పి పుచ్చుతుంది. భిన్నంగా అనిపించే కోల్ కతా నేపథ్యం.. విజువల్స్.. సంగీతం కూడా తోడై ప్రథమార్ధం సంతృప్తి పరుస్తుంది.
విశ్లేషణ :
ఎప్పట్లాగే ప్రేమ సన్నివేశాల్ని అందంగా తీర్చిదిద్దడంలో హను బలం కనిపిస్తుంది. అతడి అభిరుచిని చాలా సీన్లలో గమనించవచ్చు. సినిమా అంతటా డైలాగులు బాగున్నాయి. ద్వితీయార్ధంలో దర్శకుడిగా అతడి ముద్రేమీ కనిపించదు. స్క్రీన్ ప్లేనే చాలా గందరగోళంగా తయారైంది. తొలి గంటలో కథేమీ లేకపోయినా.. లీడ్ పెయిర్.. టెక్నీషియన్ల అండతో హను సునాయాసంగా సమయాన్ని లాగించేశాడు. ఐతే ప్రేమకథ అన్నాక ప్రథమార్ధం వరకు రొమాంటిక్.. ఫన్నీ సీన్స్ తో బండి లాగించేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ విషయంలో చాలామంది దర్శకులు విజయవంతం అవుతారు. ద్వితీయార్ధం గురించి చెప్పుకోవడానికేమీ లేదు. అర్థ రహితంగా అనిపించే హీరో హీరోయిన్ల ప్రవర్తనతో ప్రేక్షకులకు ‘మతి’ తప్పుతుంది. ‘ప్రేమమ్’లో సాయిపల్లవిని చూసి ఇన్ స్పైర్ అయ్యాడో ఏమో తెలియదు కానీ.. హీరోయిన్ గతం మరిచిపోవడం మీద ఒక డ్రామా నడిపించాడు హను. అతకని సన్నివేశాల్లో వాళ్లిద్దరూ మనసు పెట్టి నటిస్తుంటే చూడ్డానికి జాలేస్తుంది తప్ప పాత్రలతో మాత్రం ఎమోషనల్ కనెక్ట్ కనిపించదు. చివర్లో ట్విస్ట్ రివీల్ చేసి అప్పటిదాకా నడిచిన వ్యవహారాన్ని జస్టిఫై చేయడానికి ఏదో ట్రై చేశారు కానీ.. అదేమంత కన్విన్సింగ్ గా లేదు.