Husharu review

18 Dec,2018

సంగీతం: రధన్
ఛాయాగ్రహణం: రాజు తోట
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్-రియాజ్
రచన-దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి
నటీనటులు: తేజస్ కంచెర్ల-అభినవ్ -దినేశ్ తేజ్-తేజ్ -రాహుల్ రామకృష్ణ-దక్ష నగార్కర్-ప్రియ వడ్లమాని-రమ్య- తదితరులు
విడుదల : 14-12-2018
రేటింగ్ : 2. 25 / 5
 
యూత్ ని ఆకట్టుకునే సినిమాలు తీయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.  తాజాగా హుషారు సినిమా కూడా కేవలం యూత్ ని టార్గెట్ చేసి తెరకెక్కించారు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హుషారు ఎలా ఉందొ తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.  
 
కథ:
 
చైతన్య (అభినవ్  ).. ఆర్య (తేజస్ కంచెర్ల).. ధ్రువ్ (దినేశ్ తేజ్).. బంటీ (తేజ్  ) స్కూల్ స్థాయి నుంచి స్నేహితులు.   ఆడుతూ పాడుతూ కాలేజీ జీవితాన్ని గడిపేస్తారు. చదువు మీద శ్రద్ధ పెట్టని వీళ్లంటే ఇంట్లో వాళ్లకే కాక ఊరందరికీ చిన్నచూపే. కానీ అదేం పట్టించుకోకుండా తమకు నచ్చినట్లు జీవితాన్ని గడిపేస్తుంటారీ కుర్రాళ్లు. అలాంటి సమయంలోనేచైతన్య.. క్యాన్సర్ బారిన పడతాడు. మిగతా వాళ్లనూ కష్టాలు చుట్టుముడతాయి. ఈ స్థితిలో సమస్యల నుంచి బయటపడటానికి ఈ నలుగురూ ఏం చేశారు. దానివల్ల ఎదురైనా సంఘటనలు ఏమిటి ? వీరి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అన్నది మిగతా సినిమా.  
 
బుద్ధిగా చదువుకుని క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగం తెచ్చుకుని  ఆ తర్వాత టైమ్ టు టైమ్ ఆఫీసుకెళ్లి.. ఒక క్రమపద్ధతిలో జీవితాన్ని గడిపేయడమే సక్సెస్ కాదు.. వయసు తగ్గ ఆటలన్నీ ఆడి.. అన్ని అల్లర్లూ చేసి.. ఒడుదొడుకులన్నీ చూసి.. చివరగా అభిరుచికి తగిన ఉపాధి చూసుకుని జీవితంలో స్థిరపడమనే సందేశాన్నిచ్చే సినిమా ‘హుషారు’. జీవితంలో అన్ని రుచులూ ఉండాలని చాటి చెబుతూ.. నలుగురు సగటు కుర్రాళ్ల జీవితంలోని అల్లరినంతా సినిమాలో చూపించారు. వాళ్లు చదువును నిర్లక్ష్యం చేస్తారు.. చీటికీ మాటికీ మందు కొడతారు.. అమ్మాయిల కోసం వెంపర్లాడతారు.. గొడవలు పడతారు.. అడల్ట్ వీడియోలు చూస్తారు.. బాధ్యత తెలియకుండా ప్రవర్తిస్తారు. మరీ ఇంత అల్లరేంటి.. ఇంత జులాయితనం ఏంటి అనిపిస్తారు. ఐతే ఇలాంటి ప్రవర్తనకు చింతించాల్సిందేమీ లేదని.. ఈ అల్లర్లు.. ఈ జులాయితనమే ఒక దశ దాటాక జీవితంలో గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని..  చెబుతుంది.   
 
నటీనటుల ప్రతిభ :
 
ప్రధాన పాత్రధారులందరూ బాగా చేశారు. అందరిలోకి తేజస్ చాలా హుషారుగా.. ఏ తడబాటూ లేకుండా నటించాడు. అభినవ్ పాత్రకు తగ్గట్లుగా సాఫ్ట్ గా కనిపించాడు. తేజ్.. దినేశ్.. ఇద్దరూ కామెడీ పండించడంలో కీలకంగా వ్యవహరించారు. నలుగురి నటనా సహజంగా అనిపిస్తుంది. రాహుల్ రామకృష్ణ గురించి చెప్పనవసరం లేదు. అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. స్క్రీన్ టైం తక్కువే కానీ.. అతడి కెరీర్లో ఇది గుర్తుంచుకోదగ్గ పాత్ర. హీరోయిన్లలో స్వాతి వడ్లమాని గ్లామర్ తో కిక్కెక్కించింది. దక్ష నగార్కర్ పర్వాలేదు. మిగతా  ఇద్దరమ్మాయిలు నామమాత్రంగా కనిపిస్తారు. మిగతా నటీనటులు జస్ట్  ఓకే.
 
టెక్నీకల్ హైలెట్స్ :
 
ఇక టెక్నీకల్  విషయాల గురించి చెప్పాలంటే .. రధాన్ సంగీతం సినిమాకు మెయిన్ హైలెట్ అని చెప్పాలి.  ఇప్పటికే పాపులర్ అయిన ఉండిపోరాదే పాట సినిమాలోనూ మంచి ఫీలింగ్ ఇస్తుంది. అదే కాక పిచ్చాక్. నాననాననా పాటలు కూడా బాగున్నాయి. పాటల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. రాజు తోట ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. ఇక దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి ఈ తరం పట్టణాల్లో ఉండే యూత్ ఆలోచనలపై.. వాళ్ల అభిరుచులపై మంచి అవగాహనే ఉంది. వారికి నచ్చే అంశాలతో సినిమా తీశాడు.  దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడని చెప్పలేం కానీ.. తనకున్న పరిమితుల్లో టార్గెటెడ్ ఆడియన్స్ కు నచ్చేలా వినోదాత్మకంగా  తీసాడు కానీ చాలా విషయాలు మాత్రం ప్రేక్షకులకు తలనొప్పులు పెడతాయి.  సినిమాలో సగం చర్చ బీర్ గురించే. ప్రతి రెండో సీన్లోనూ ఎవరో ఒకరి చేతిలో బీర్ కనిపిస్తుంది. అసలీ సినిమాలో ఓ కీలక ఎపిసోడే బీర్ చుట్టూ తిరుగుతుంది. మరి ఇలాంటి సీన్లు.. ఇలాంటి మాటలతో ఏం చెప్పదలుచుకున్నారు.. ఇలాంటివి కుటుంబ ప్రేక్షకులు భరించగలరా.. సొసైటీపై ఇలాంటి సినిమాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి.. లాంటి పెద్ద పెద్ద ప్రశ్నలేసి చర్చలేమీ పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉంటుందో చెప్పేసారు. 
 
విశ్లేషణ : 
 
ద్వితీయార్ధంలో కుర్రాళ్లు నలుగురూ సమస్యలతో సతమతం అవుతూ సాగుతున్నప్పటికీ.. సినిమా పూర్తి సీరియస్ టోన్లో సాగకపోవడం విశేషం. ఎక్కడా కామెడీకి.. అల్లరికి ఢోకా లేకుండా చూసుకున్నారు. ఈ నలుగురు కుర్రాళ్లలో విషయం అయిపోతుందన్న సమయంలో   రాహుల్ రామకృష్ణ రంగప్రవేశం చేసి తనదైన శైలిలో వినోదం పంచుతాడు. పిచ్చాక్ సాంగ్ మాత్రమే కాదు.. అతడి ప్రతి డైలాగ్ భలేగా పేలింది.  యూత్.. అడల్ట్స్ కు మాత్రమే అంటూ ఈ చిత్ర బృందం ఇచ్చిన వార్నింగ్  నిజంగానే మిగతా వర్గాల ప్రేక్షకులు సినిమా చూసి తట్టుకోలేరు.   చాలా వరకు అడల్ట్ కంటెంట్ తో నిండిన సినిమా. ప్రధానంగా యువతను.. అడల్ట్ కామెడీని ఎంజాయ్ చేసే ప్రేక్షకుల్ని టార్గెట్ చేసిన సినిమా.  అడల్ట్ కామెడీ విషయంలో హద్దులేమీ పెట్టుకోకపోవడం వల్ల ఆరంభం నుంచి కుర్రాళ్లకు కావాల్సినంత కిక్కు ఇస్తూ సాగుతుంది ‘హుషారు’. కథ ఒక తీరుగా నడవకపోయినప్పటికీ.. యూత్ ను టార్గెట్ చేసిన సీన్లు మాత్రం బాగానే పేలాయి.  సినిమా ఎంత లైట్ హార్టెట్ వేలో నడుస్తుందంటే.. ప్రధాన పాత్రధారుల్లో ఒకరు క్యాన్సర్ బారిన పడ్డా కూడా.. అతడి మీద ‘నా పేరు ముఖేష్’ తరహా యాడ్ ఒకటి రూపొందించి నవ్వించే ప్రయత్నం చేస్తుంది అతడి మిత్ర బృందం.  ఏం ఆశించి ప్రేక్షకులు వస్తారో అదే ఇచ్చారు. ఆ వర్గం ప్రేక్షకులకు వినోదానికి ఢోకా లేదు.  

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY