అదుగో రివ్యూ

14 Nov,2018

సంగీతం: ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం: సుధాకర్ రెడ్డి
నిర్మాత: సురేష్ బాబు
రచన-దర్శకత్వం: రవిబాబు
నటీనటులు: అభిషేక్ వర్మ-నభా నటేష్-రవిబాబు తదితరులు
విడుదల : 7-11-2018
రేటింగ్ : 2 / 5


రవిబాబు భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు. అందులో కొన్ని ఆకట్టుకున్నా ఎక్కువ శాతం ప్రేక్షకులకు నచ్చని సినిమాలే ఉన్నాయి. అయినా ఇవేవి పట్టని రవిబాబు మాత్రం కొత్త ప్రయోగాలకు ఎప్పుడు సిద్దమే అంటున్నాడు.  ఇప్పటికే పలు జీవులతో ( ఈగ, దోమ, ఏనుగు, మేక, ఆవు, పాము తదితరాలు .. ) సినిమాలు తీశారు కాబట్టి తాను కూడా ఏదైనా జంతువు తో సినిమా చేయాలనీ అనుకున్నాడు. అందుకే ఎవరు ఊహించని జంతువూ .. పందిని తీసుకుని అదుగో అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ పందిపిల్ల చేసిన అల్లరి తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ:

బంటి ( పంది పిల్ల) అనుకోకుండా తన యజమాని నుండి బయటకు పారిపోయే ప్రయత్నంలో ఇద్దరు రౌడీలు ఎత్తుకుపోతారు. ఆ తరువాత వాళ్ళు దాన్ని కొరియర్ ద్వారా తమ బాస్ కు పంపిస్తారు .. కానీ అది రాంగ్ అడ్రస్ లో హీరో ( అభిషేక్ వర్మ ) దగ్గరకు చేరుతుంది. అది పంది పిల్ల అని తెలియక దాన్ని తన ప్రేయసి (నాబా నటేష్ ) కి బహుమతిగా ఇస్తాడా కుర్రాడు. ఈ లోపు ఈ పంది పిల్ల కోసం రౌడీ గ్యాంగులు.. మాఫియా వాళ్లు వెంట పడటం మొదలుపెడతారు. ఈ పంది పిల్ల కోసం అంతమంది ఎందుకు వెంట పడుతున్నారు.. వీళ్ల నుంచి అదెలా తప్పించుకుని.. తన యజమాని దగ్గరికి చేరింది అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

తన సినిమాలో ఎదో పాత్రలో కనిపించే రవిబాబు ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ శక్తిగా బాగానే చేశాడు. అక్కడక్కడా నవ్వించాడు. కొత్త హీరో అభిషేక్ వర్మ అసలు హీరోగా ఎలా ఎంపిక చేసారా అన్న అనుమానాలు కలుగుతాయి. ఏమాత్రం హీరోయిజం లేని కుర్రాడు. రవిబాబు హీరోల తరహాలోనే అతనూ కనిపించాడు. ‘నన్ను దోచుకుందువటే’ భామ నభా నటేష్ ఆకట్టుకుంది. మిగతా నటీనటులంతా అలా అలా నటించేసారు .. వారి గురించి పెద్దగా చెప్పుకునే అవసరం లేదు. ఇక పంది పిల్ల గురించి చెప్పాలంటే.. సినిమాలో అది ఎక్కడ ఒరిజినల్ గా కనిపించిందో.. ఎక్కడ యానిమేషనో అర్థం కాదు. కాస్త గ్రాఫిక్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నారు.

టెక్నీకల్ అంశాలు :

ప్రశాంత్ విహారి సంగీతం పర్వాలేదు. హీరో హీరోయిన్ల మీద వచ్చే పాట బాగుంది. నేపథ్య సంగీతం యావరేజ్ . రవిబాబు అభిరుచికి తగ్గ ఔట్ పుట్ ఇచ్చాడు. సుధాకర్ రెడ్డి ఛాయాగ్రహణమూ అంతే. ఇది రవిబాబు సినిమా అని తెలిసేలా కెమెరా వర్క్ సాగింది. నిర్మాణ విలువలు బ్యాడ్ . ఈ సినిమా ఎక్కువగా గ్రాఫిక్స్.. వీఎఫెక్స్ ముడిపడింది. ఈ సినిమా స్థాయికి ఓకే కానీ.. గత కొన్నేళ్లలో అద్భుతమైన ఎఫెక్ట్స్ చూసిన ప్రేక్షకులకు ఇందులోని పనితనం అంత గొప్పగా అనిపించదు. ఇక దర్శకుడు రవిబాబు పంది పిల్లతో సినిమా తీయాలన్న ఆలోచన వరకు అభినందనీయుడు. కానీ కథాకథనాల విషయంలో అతను పూర్తిగా నిరాశ పరిచాడు.

చివరగా :

రవిబాబు కథలన్నీ కొంచెం విపరీత స్థాయిలోనే ఉంటాయి. వినోదం పండించడానికి అతను కొంచెం ఎక్స్ ట్రీమ్ ఆలోచనలే చేస్తుంటాడు. ఐతే రవిబాబు విపరీత ఆలోచనలు నవ్విస్తాయి. కొన్నిసార్లు చాలా ఎబ్బెట్టుగా తయారవుతాయి. ‘అదుగో’ రెండో కోవకు చెందిన సినిమా. రవిబాబు లాంటి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న దర్శకుడు ఒక పంది పిల్లను పెట్టి హీరోగా తీస్తున్నాడంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ ఏర్పడింది. దీని ప్రోమోలు చూస్తే పంది పిల్ల విన్యాసాలు కడుపుబ్బ నవ్వించేసేలా కనిపించాయి. కానీ బలవంతంగా కితకితలు పెట్టుకుంటే తప్ప నవ్వులు పండని విధంగా తయారైంది ఇందులోని కామెడీ. కథలోని కీలకమైన మలుపులకు అసలు లాజిక్ అనేది ఉండదు. కథలోని మలుపులు సహేతుకంగా అనిపించాలని ఆశిస్తున్నారు ఇప్పటి ప్రేక్షకులు. కానీ రవిబాబు ఎక్కడా లాజిక్ అన్నదే పట్టించుకోకుండా.. ఎలా పడితే అలా కథను నడిపించేశాడు. కామెడీ కోసం ఉద్దేశించిన చాలా సీన్లు ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించకపోవడంతో చాలా చోట్ల ప్రేక్షకుల సహనానికి పరీక్ష ఎదురవుతుంది. అల్లరి.. నచ్చావులే సమయంలో రవిబాబు కామెడీ కొత్తగా అనిపించేది. కానీ ఇప్పుడు కూడా అతను అదే తరహా కామెడీ ట్రై చేశాడు. కానీ అది బెడిసికొట్టింది. కొన్ని సీన్లయితే మరీ భరించలేనట్లుగా తయారయ్యాయి. విలన్ మీదికి పంది పిల్ల మల విసర్జన చేయడం.. విలన్ తన అసిస్టెంట్ మీద పాన్ ఊయడం లాంటి సీన్లను రిపీట్ చేయడం చూస్తే కామెడీ కోసం రవిబాబు ఇంత దిగజారడా అనిపిస్తుంది. ఇలా వెగటు పుట్టించే సన్నివేశాలు సినిమాలో కోకొల్లలు. ఇక సినిమాకు హీరో అయిన పంది పిల్ల అంత సహజంగా లేకపోవడం వల్ల కూడా సినిమా అంతా కొంచెం కృత్రిమంగా తయారైంది. కేవలం పంది పిల్ల చుట్టూనే కథ నడిపితే సరిపోదని.. ఒక అబ్బాయి-అమ్మాయి మధ్య ప్రేమకథను కూడా చూపించారు. కానీ అది కూడా ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. ఉన్నంతలో పంది పిల్ల.. దాన్ని పెంచుకునే కుర్రాడి మధ్య ఎమోషన్ పర్వాలేదనిపిస్తుంది. కానీ ఇది కూడా కొంత మేరకే. మొత్తంగా రవిబాబు చేసిన ఈ కొత్త ప్రయోగం వెగటు పుట్టించింది.

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY