విశిష్ట దర్శకుడు, ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వదర్శనం’. ‘వెండి’ తెర చెప్పిన ‘బంగారు’ దర్శకుని కథ అన్నది ట్యాగ్‌లైన్. కె.విశ్వనాథ్ లీడ్ రోల్లో పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు జనార్థన మహర్షి దర్శకుడు. 'దేవస్థానం' తర్వాత కె. విశ్వనాథ్, జనార్థన మహర్షి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇది. ‘విశ్వదర్శనం’ రిలీజ్‌కు ముందే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సెలెక్ట్ అయింది. ‘సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్, 2019’లో డాక్యుమెంటరీ విభాగంలో (పనోరమ సెక్షన్) ఈ చిత్రం ఎంపికైంది. ‘‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మా సినిమా ఎంపిక అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఒక గొప్ప దర్శకుని జీవితం ఆధారంగా ఈ సినిమాని ఎంతో నిజాయితీగా తీశాం. టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడం, ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు ఈ ‘విశ్వదర్శనం’ మంచి అనుభూతికి గురి చేస్తుంది. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు జనార్థన మహర్షి అన్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్‌కు పది లక్షల వ్యూస్ సంపాదించిందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది .