అవార్డులు అనేవి నటీనటుల్లో ప్రతిభను గుర్తించేవి కొన్ని వుంటాయి. కొన్ని తమ ప్రయోజనాలకోసం కొందరు ఇస్తుంటారు. ఇవి సాధారణంగా సాంస్‌కృతిక సంస్థలు ఇలా ఇస్తుంటాయి. ఇప్పుడు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు కూడా అదేకోవలో కేంద్ర ప్రభుత్వం చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అవార్డు వచ్చిందని పలువురు పలురకాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లే తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కూడా \\ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ప్రశంసలు
సౌత్ ఇండియా సూపర్ స్టార్ హీరో శ్రీ రజినీకాంత్ గారికి 2020 సంవత్సరానికి భారత ప్రభుత్వం "దాదాసాహెబ్ ఫాల్కే" అవార్డు ని ప్రకటించింది. ఆయనకు ప్రభుత్వం ఈ అవార్డు ద్వారా ఇచ్చిన గౌరవానికి, ఆయన ఇండియా, జపాన్, సింగపూర్, మలేసియా వంటి ఎన్నో దేశాలకు సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నందుకు మేము సంతోషం వ్యక్తపరుస్తున్నాం. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరియు ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున, మా సూపర్ స్టార్ శ్రీ రజినీకాంత్ గారికి మా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.
విమర్శలు
కాగా, ఈ అవార్డులు పారదర్శికంగా లేవని తెలుగు సినీరంగం విభేదిస్తుంది. కేంద్రప్రభుత్వం జాతీయ అవార్డుల ప్రకటించిన తదుపరి ఈ ఫాల్కే అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. జాతీయ అవార్డులలో కూడా కంగనారనౌత్‌కు ఇవ్వడం కూడా మొదట ఆశ్చర్యానికి గురిచేసింది బాలీవుడ్‌కు. ఇదే విషయాన్ని కొందరు ప్రశ్నించారు. అంతకుముందు కంగనారనౌత్ కేంద్రప్రభుత్వం రైతులు చేస్తున్న పోరాటంపై ఉక్కుపాదం మోపినప్పుడు ఆమె తగువిధంగా స్పందించింది. అనంతరం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి చేయడంతోపాటు ఓ రాజకీయపార్టీవారు కూడా బెదిరింపులకు దిగారు. ఫైనల్‌గా ఆమెకు కళ్ళముందు నిజమైన సినిమా కనిపించింది. దాంతో కేంద్రప్రభుత్వం తీరును ప్రశంసిస్తూ రైతులలో అరాచకవాదులు వున్నట్లు స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆ పార్టీ తీర్థం కూడా తీసుకుంది.
రాజకీయ కారణాలు
ఇక రజనీకాంత్ విషయానికి వస్తే, జయలలిత తర్వాత తమిళనాడు అనాథ అయిపోయింది. ఉన్న ఆపదర్మ ప్రభుత్వంకానీ అంతకుముందుకానీ ప్రజలకు చేయాల్సిన న్యాయం సరిగ్గా చేయలేకపోయారని అందుకే రాజకీయ పార్టీ పెడతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత దానికి గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. పార్టీ పెడతున్నట్లు ప్రకటించారు. అంతా సజావుగా జరుగుతుంది అనేటైంలో తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. అదే టైంలో షూటింగ్‌లలో బిజీగా వుండడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఇలా రెండు సార్లు జరగడంతో ఇక తాను రాజకీయాలకు దూరంగా వుంటాననీ, తన కుటుంబీకులు తన ఆరోగ్యం చూసుకోమంటున్నారని రజనీకాంత్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అనంతరం రజనీ చేత బలవంతంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తమిళనాడులో కేంద్రప్రభుత్వం పాగా వేయాలనేది ఎయిమ్. అందుకు అడ్డువచ్చిన వారికి ఏదోవిధంగా నచ్చచెబుతూ వారిని దూరంగా వుండేలా చేసింది.
సరిగ్గా ఇదే పాలసీ జైలు నుంచి విడుదలైన శశికళపైన కూడా పడింది. సో.. మొత్తంగా చూసుకుంటే, రజనీని గౌరవంగా తప్పించి అందుకు ఫలితంగా అవార్డు ఇచ్చారనేది దక్షిణాదిలో వాడిగా వినిపిస్తున్న వాస్తవం. తెలుగులో సూపర్‌స్టార్ కృష్ణగారికి ఈ అవార్డు వస్తుందని ఎంతగానో అనుకున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఆయన చలనచిత్రరంగంలో పలు ప్రయోగాలు చేశారు. హిందీలో సినిమాలు నిర్మించారు. స్టూడియోలు నెలకొల్పారు. ఎందరికో పని కల్పించారు. అలాంటి వారికి కూడా అవార్డు దక్కలేదు. అలా ఒకప్పుడు ఎన్.టి.ఆర్.కు, దాసరికి, రాఘవేంద్రరావుకు, విజయనిర్మల ఇలా ఎందరికో అవార్డు అందరి దాక్షలాగే మిగిలాయి. తమిళ ఎన్నికల వేళ రజనీకి దాదా ప్రకటించి, అవార్డ్ కు ఓటుకు ముడిపెట్టారనే విమర్శలు ఘాటుగా వినిపిస్తున్నాయి.
- కామన్‌మేన్.