మార్చి 8న స‌ర్వం తాళ‌మ‌యం

04 Mar,2019

జి.వి.ప్ర‌కాష్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి జంట‌గా న‌టించిన చిత్రం `స‌ర్వం తాళ‌మ‌యం`. రాజీవ్ మీన‌న్ తెరకెక్కించారు. మార్చి 8న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్రెస్‌మీట్ ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. రాజీవ్ మీన‌న్ మాట్లాడుతూ ``ఈ చిత్రంలో సంగీతం, మెరిట్‌, గెలుపు ఓట‌ముల గురించి ప్ర‌స్తావించాం. గురుశిష్యుల సంబంధం గురించి కూడా చెప్పాం. ఉమ‌యాళ్‌పురం శివ‌రామ‌న్‌గారి మీద డాక్యుమెంట‌రీ చేస్తున్న స‌మ‌యంలో నాకు ఈ ఆలోచ‌న వ‌చ్చింది. మృదంగం త‌యారుచేసేవాళ్ల‌కు వాయించ‌డం  చేత‌కాదు. ఒక‌వేళ వారేగ‌నుక మృదంగం నేర్చుకుంటే ప‌రిస్థితి ఏంట‌నే విష‌యం మీద ఈ సినిమా చేశాం. ఈ చిత్రం కోసం జి.వి.ప్ర‌కాష్ ఏడాది పాటు ఉమ‌యాళ్‌పురం శివ‌రామ‌న్‌గారి ద‌గ్గ‌ర శిష్య‌రికం చేశారు. ఈ చిత్రంలో సుమేష్ నారాయ‌ణ్‌, బాంబే జ‌య‌శ్రీతో పాటు చాలా మంది సంగీత విద్వాంసులు న‌టించారు. రెహ‌మాన్‌గారి సంగీతం చాలా ప్ల‌స్ అయింది. స్క్రిప్టు రాసుకునే స‌మ‌యంలోన నాకు ఓ బాణీ త‌ట్టింది. దాన్ని రెహ‌మాన్‌గారికి వినిపించాను. ఆయ‌న కూడా పెద్ద మ‌న‌సుతో ఆ ట్యూన్‌ను సినిమాలో ఉంచారు. రెహ‌మాన్ దిలీప్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచీ నాకు చాలా ఇష్టం. పాత ర‌ష్య‌న్ క్లాసిక్ సినిమాలు చూస్తుంటారు రెహ‌మాన్‌. అత‌ను దిలీప్‌గా ఉన్న‌ప్పుడు ఇళ‌య‌రాజాగారి ద‌గ్గ‌ర శిష్య‌రికం చేశారు. ఆ త‌ర్వాత రాజ్‌కోటిగారి ద‌గ్గ‌ర చేశారు. ఆ త‌ర్వాత ఒక‌సారి నేను బాయిల‌ర్ ఇండ‌స్ట్రీ మీద ఓ యాడ్ చేస్తే దానికి ఫ్యూజ‌న్ సంగీతాన్నిచ్చారు. అంత‌కుముందు ఒక‌సారి నాకు ప్లేట్ కింద‌ప‌డి విరిగే చ‌ప్పుడు తెర‌మీద కావాల‌నిపించింది. ఆరా తీస్తే `దిలీప్ చేస్తాడు` అని అన్నారు. అప్ప‌టి నుంచి ఏం విరిగినా రెహ‌మాన్ నాకు ఆ సౌండ్‌ని తెర‌మీద చూపించేవాడు. అలా ఒక‌సారి `విరిగే చ‌ప్పుళ్లే కాదు. మంచి సంగీతం కూడా చేస్తాను` అని అన్నాడు. ఆ త‌ర్వాత బాయిల‌ర్ ఇండ‌స్ట్రీ మీద చేశాం. ఆ త‌ర్వాత దాదాపు 150-200 జింగిల్స్ చేశాం. ఆ క్ర‌మంలోనే అత‌నికి `రోజా` వ‌చ్చింది. న‌న్ను `మెరుపుక‌ల‌లు` సినిమాకు ద‌ర్శ‌కుడిని చేసింది కూడా రెహ‌మానే. ఏవీయం సంస్థ వారు మంచి సినిమా చేయాల‌నుకున్నారు. దానికి రెహ‌మాన్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా పెట్టుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే రెహ‌మాన్ వాళ్ల‌కు అందుబాటులోకి వెళ్ల‌క‌పోవ‌డంతో న‌న్ను పిలిచి రెహ‌మాన్ గురించి అడిగారు. నేను రెహ‌మాన్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి `పెద్ద సంస్థనుంచి పిలుపు వ‌చ్చిన‌ప్పుడు వెళ్లి ఏదో ఒక‌టి చెప్పు` అని అన్నాను. ఆ రోజు అత‌నితో పాటు నేను కూడా ఏవీయం సంస్థ‌కు వెళ్లా. రెహ‌మాన్ వాళ్ల‌తో `ద‌ర్శ‌కుడిని డిసైడ్  చేశారా` అని అడిగారు. అందుకు వాళ్లు ఇప్ప‌టికి ప్ర‌భుదేవా మాత్ర‌మే ఓకే అయ్యారు. ఇంకా ఎవ‌రినీ డిసైడ్ చేయ‌లేదు` అని అన్నారు. `వేరే ఎవ‌రో ఎందుకు? మ‌న రాజీవ్‌ని చేసేయండి` అని రెహ‌మాన్ న‌న్ను సిఫార‌సు చేశారు. అలా నేను `మెరుపు క‌ల‌లు` చేశాను. దాని త‌ర్వాత `ప్రియురాలు పిలిచింది` పూర్త‌యింది. దాదాపు 19  ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు ఈ సినిమా చేశాను. ఇక‌పై వ‌రుస‌గా సినిమాలు చేస్తాను. సంగీతం ప్ర‌ధానంగా ఈ క‌థ‌ను చెప్పాల‌ని అనుకున్న‌ప్పుడు చాలా వ‌ర్క్ చేశాం. ద‌ళిత అంశాన్ని కూడా ట‌చ్ చేశాం. తెలుగులో ఈ నెల 8న విడుద‌ల చేస్తున్నాం. కె.విశ్వ‌నాథ్‌గారు సినిమాను చూసి క్లైమాక్స్ లో క‌ళ్ల‌నీళ్లు పెట్టుకుని నా నుదుటిమీద ముద్దుపెట్టుకున్న స‌న్నివేశాన్ని మ‌ర్చిపోలేను`` అని అన్నారు.
జి.వి.ప్ర‌కాష్ మాట్లాడుతూ ``మామావ‌య్య నా సినిమాకు సంగీతం చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. చాలా బాధ్య‌త‌గా ఈ సినిమాను చేశాను. చాలా ఇంపార్టెన్స్ ఉన్న సినిమా ఇది. సెటిల్ పెర్ఫార్మెన్స్ చేశాం. స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. ఏడాది పాటు మృదంగం నేర్చుకున్నా. ఈ సినిమా చేసిన త‌ర్వాత సంగీత ద‌ర్శ‌కుడిగానూ నాలో చాలా మార్పు వ‌చ్చింది`` అని అన్నారు.
నాయిక అప‌ర్ణ బాల‌ముర‌ళి మాట్లాడుతూ ``రాజీవ్ మీన‌న్‌గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రాగానే అదేదో ప్రాంక్ కాల్‌ అని అనుకున్నాను. కానీ నిజంగా చాలా హ్యాపీగా ప‌నిచేశాను. ఈ చిత్రంలో న‌ర్సుగా సారా అనే పాత్ర చేశాను. సినిమాలో సాఫ్ట్ గా మాట్లాడుతుంటాను. కానీ చాలా స్ట్రాంగ్ పాత్ర చేశాను`` అని అన్నారు. 
 

Recent News