`వీరం`, `వేదాళం`, `వివేకం` వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల తర్వాత హీరో అజిత్, డైరెక్టర్ శివ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ డ్రామా `విశ్వాసం`. ఇటీవల తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అక్కడ సెన్సేషనల్ విజయాన్ని దక్కించుకుంది. అజిత్ సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ అసోషియేషన్‌తో ఎన్.ఎన్.ఆర్ ఫిలింస్ పతాకంపై ఆర్.నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇందులో టాలీవుడ్‌కి చెందిన విలక్షణ నటుడు జగపతిబాబు పవర్ఫుల్ పాత్రలో నటించారు. అనువాద కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ..ఎన్.ఎన్.ఆర్ ఫిలింస్ అధినేత ఆర్.నాగేశ్వరరావు మాట్లాడుతూ - ``హీరో అజిత్ సినిమాలకు తమిళనాడులోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలంటే అక్కడ పండుగ వాతావరణమే. అజిత్, శివ కాంబినేషన్లో మూడు వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. వీరి కలయికలో వచ్చిన నాలుగో బ్లాక్ బస్టర్ విశ్వాసం. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. ఎందరో నిర్మాతలు ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడ్డారు. ఫ్యాన్సీ ఆఫర్‌తో తెలుగు హక్కులను దక్కించుకున్నాను. అవకాశం ఇచ్చిన సత్యజ్యోతి ఫిలింస్ వారికి నా ధన్యవాదాలు. సత్యజ్యోతి ఫిలింస్ వారి అసోసియేషన్‌తో తెలుగులో ఈ చిత్రాన్ని మార్చి 1 విడుదల చేయబోతున్నాం. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా సెన్సేషనల్ సక్సెస్ అవుతుంది`` అన్నారు.