అన్ని కళల కంటే సాహిత్యం గొప్పది. సాహిత్యం కంటే నాటకం గొప్పది. నాటకం కంటే సినిమా గొప్పది. ఏ సినిమా కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించలేదు. సినిమాల వల్ల సమాజం చెడిపోతుందంటే నేను ఒప్పుకోను. పాట జనరంజకంగా ఉంటే సరిపోతుంది. కానీ పాట దాని స్థాయిని దాటి ప్రేక్షకుణ్ని ఆలోచింపజేసేలా ఉండాలి అప్పుడే ఆ పాటకు సార్థకత లభిస్తుంది అని అంటున్నారు ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో పాత్రికేయులతో తన అనుభవాలు పంచుకున్నారు .. ఆ విశేషాలు అయన మాటల్లో ..
ఇది వరకు పురస్కారాల్ని ప్రభుత్వాలు సిఫార్సు చేసేవి. ఇప్పుడు వ్యక్తులు అభ్యర్థిస్తున్నారు.అలా చేయడం నాకు ఇష్టం లేదు. నాకు పద్మశ్రీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. దాంతోపాటు వేలాదిమంది నాకు ఈ అవార్డు ఎందుకు ఇవ్వాలో తెలుపుతూ కేంద్రానికి తమ అభ్యర్థనను పంపారు. వాళ్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లకి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. సినిమా రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. సినిమా పరిశ్రమ అనేది గొప్ప వ్యాపారం. సినిమా తీస్తున్నందుకు నిర్మాతలందరూ గర్వించాలి. ఇంత గౌరవప్రదమైన వ్యాపారం ఏదీ లేదు. అలా అనుకొని నిర్మిస్తేనే మరిన్ని గొప్ప చిత్రాలను తెలుగు పరిశ్రమ అందిస్తుంది. అన్ని కళల కంటే సాహిత్యం గొప్పది. సాహిత్యం కంటే నాటకం గొప్పది. నాటకం కంటే సినిమా గొప్పది. ఏ సినిమా కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించలేదు. ఒక హత్యైనా, అత్యాచారానికి సంబంధించిన సీన్ అయినా కారణం లేకుండా చూపించడం లేదు. సినిమాల వల్ల సమాజం చెడిపోతుందంటే నేను ఒప్పుకోను. పాట అనేది జనరంజకంగా ఉంటే సరిపోతుంది. కానీ పాట దాని స్థాయిని దాటి ప్రేక్షకుణ్ని ఆలోచింపజేసేలా ఉండాలి అనుకుంటాను. అప్పుడే ఆ పాటకు సార్థకత లభిస్తుంది. స్త్రీ పాత్రని కించపరిచేలా, యువతరాన్ని కిర్రెక్కించేలా పాటలు రాయమంటే నేను రాయను. వ్యక్తి, ప్రదేశం గురించి వర్ణించమంటే వర్ణించను. పాట అంటే భావోద్వేగభరితంగా ఉండాలి. మానవుడి భావోద్వేగాలను గమనించుకుంటూ నాలో వాటి పట్ల నాకు కలిగిన అనుభూతులను వ్యక్తపరిచే విధానమే పాటగా భావిస్తాను. వాటినే రాస్తాను. పాట అంటే పదాల కూర్పు కాదు. పదాల మధ్య ఉన్న నిశ్శబ్దానికి ఇచ్చే గొంతుకే పాట. రచయిత అనేవాడు స్పేస్ తీసుకోవాలి. పాటలో పదాలు కథకు, సందర్భానికి న్యాయం చేస్తూనే మరో విశిష్ట లక్షణాన్ని సంతరించుకోవాలి. అలాంటి పాటలు రాయడానికే ఇష్టపడతాను.
చిత్ర పరిశ్రమలో 33 ఏళ్లుగా అందరూ నన్ను అభిమానిస్తున్నారు. నేను అన్నింటికంటే వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. సిరిసంపదల కంటే మనుషుల హృదయంలో స్థానం సంపాదించడమే గొప్పగా భావిస్తాను. ఇంతమంది ప్రేక్షకుల హృదయాల్లో స్తానం సంపాదించడం కంటే గొప్ప అవార్డు ఏముంటుంది అంటూ ముగించారు.