శృతి హాసన్ కెరీర్ ఆరంభం నుండే సొంతంగా గుర్తింపు దక్కించుకునేందుకు ప్రత్యేక బ్రాండ్ ఉండేలా ప్రయత్నించింది. నటిగానే కాకుండా శృతిహాసన్ సంగీత దర్శకురాలిగా గాయనిగా కూడా ప్రతిభను కనబర్చుతూ వచ్చింది. ఇండియాతో పాటు పలు ప్రపంచ దేశాల్లో కూడా సంగీత కచేరీలను కూడా ఇచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లండన్ ట్రవ్ బడూర్ ప్రాంగణంలో సంగీత కచేరి చేయాలని శృతి హాసన్ చాలా కలలు కంటూ వచ్చింది. ఎట్టకేలకు తన కలను సాకారం చేసుకుంది. తాజాగా లండన్ లోని ట్రవ్ బడూర్ లో సంగీత కచేరి చేసినందుకు చాలా ఆనందంగా ఉందని ఇప్పటి వరకు 100కు పైగా కచేరీలు చేసిన శృతి హాసన్ ఈ కచేరి చాలా సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రముఖ సంగీత దర్శకులు గాయకులైన బాబ్ డిలన్ ఎల్టన్ జాన్ అదేలి ఎడ్ షీరన్ వంటి వారు ట్రవ్ బడూర్ ప్రాంగణంలో సంగీత కచేరి చేశారు. గత ఏడాది అమెరికాలోని న్యూయార్క్ లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ది ఇండియన్ డే పేరేడే కార్యక్రమంలో సంగీత కచేరీ చేసి అందరిని అలరించింది. ఒక వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు ఇలా వరుసగా సంగీత కచేరీలు ఇస్తూ మల్టీ ట్యాలెంటెడ్ గా గుర్తింపు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈమె హిందీలో రెండు సినిమాల్లో నటిస్తుంది. తమిళంలో త్వరలో ఒక చిత్రాన్ని చేయబోతుంది. తెలుగులో మాత్రం మంచి ఆఫర్ వస్తే చేసేందుకు ఎదురు చూస్తోంది.