తెలుగు సినిమా దిక్సూచిగా ఎల్వి ప్రసాద్ ని పేర్కొంటారు. ఎందుకంటే అయన తెలుగు సినిమా తోలి నాళ్లలో ఎన్నో గొప్ప ప్రయత్నాలు చేసారు. ఏలూరు సమీపంలోని సోమవరప్పాడులో 1908వ సంవత్సరం జనవరి 17న జన్మించిన ఆయన 1994 జూన్ 22న కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు అక్కినేని లక్ష్మీవరప్రసాద్. తొలితరం నటుడిగా ఓ ప్రత్యేకస్థానాన్ని పొంది..ఆ తర్వాత తన అభిరుచికి అనుగుణంగా దర్శక, నిర్మాత గా మారారు. ఆయన 111వ జయంతి సందర్భంగా ఆయన జయంతి ఉత్సవాలు గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ తనయుడు రమేష్ ప్రసాద్, దర్శకుడు వై వి ఎస్ చౌదరి, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎల్వి ప్రసాద్ సినిమా పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన నటనపై ఆసక్తితో సినీరంగంలోకి ప్రవేశించారు. మొదట ముంబాయికి చేరి వీనస్ ఫిల్మ్ కంపెనీలో సహాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే నిశ్శబ్ద చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. 1931లో భారతదేశం మొదటి టాకీ చిత్రం ఆలం అరాలో నటించారు. ఆ తరువాత మొదటి తమిళ టాకీ కాళిదాస్‌లో చిన్న పాత్ర పోషించారు. తొలి తెలుగు టాకీ భక్తప్రహ్లాదలో కూడా ఆయన నటించారు. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ భాషలలో కొన్ని చిత్రాలలో నటించిన ఆయన దర్శకుడిగా మారారు. 1940వ దశకంలో గృహప్రవేశం, పల్నాటియుద్ధం, ద్రోహి, మనదేశం చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 1950 దశకంలో సంసారం, షావుకారు, మిస్సమ్మచిత్రాలను తెరకెక్కించారు. మనదేశం చిత్రం ద్వారా నటరత్న ఎన్.టి.రామారావు, నటుడు ఎస్.వి.రంగారావును పరిచయం చేశారు. ఘంటసాలను కూడా సంగీత దర్శకుడిగా పరిచయమైంది మనదేశం ద్వారానే. తాను సంపాదించిన సంపాదన అంతా సినీరంగంలోనే పెట్టుబడులు పెట్టి…సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించారు. సినిమా రంగానికోసం స్టూడియోస్, లాబ్స్ దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసారు. అలాగే హైదరాబాద్ లో ఎల్వి ప్రసాద్ కంటి హాస్పత్రిని నెలకొల్పి ఎందరికి చూపునిచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ఆయన స్థాపించిన ఎల్వీ.ప్రసాద్ సంస్థలు నేటికీ దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.