రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఆరోసారి వీళ్ళిద్దరూ కలిసి పని చేయబోతున్నారు. గతంలో పూరీ జగన్నాథ్, మణిశర్మ కలిసి పని చేసిన ఐదు సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ ఇద్దరూ చివరగా టెంపర్ సినిమాకు కలిసి పనిచేశారు. ఆ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు మణిశర్మ. టెంపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రామ్ హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు మణిశర్మ. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇదే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర రెగ్యులర్ షూటింగ్ జనవరి చివర్లో మొదలు కానుంది. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థలపై దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.