సోనమ్ కపూర్.. నేహ ధూపియా.. దీపిక పదుకొనె.. ప్రియాంక చోప్రాల వివాహాలతో ఈ ఏడాది బాలీవుడ్ సందడిగా సాగింది. ఇదిలా ఉంటే మిగిలిన ఎలిజిబుల్ బ్యాచిలర్లను.. బ్యూటీలను వివాహం ఎప్పుడని అడగడం కామనే. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో ముంబై బ్యూటీ యామి గౌతమ్ కు ఇలాంటి ప్రశ్నే ఎదురైతే చిర్రుబుర్రులాడింది. పలు హిందీ సినిమాలతో పాటుగా తెలుగు సినిమాల్లో కూడా నటించిన యామీ గౌతమ్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకోలేదు గానీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే ఉంది. కెరీర్ కూడా కాస్త స్లో కావడంతో త్వరలో పెళ్ళి చేసుకుంటుందనే రూమర్లు కూడా వినిపించాయి. అదే విషయం అడిగితే "నాకు పెళ్ళి చేసుకోవాలనే తొందర లేదు. నన్నొదిలెయ్యండి.. ప్లీజ్" అంటూ సమాధానమిచ్చింది. యామి గతంలో బాలీవుడ్ యాక్టర్ పుల్కిత్ సామ్రాట్ తో లవ్ ఎఫైర్ నడిపిందని వార్తలు వచ్చాయి. ఈ ఎఫైర్ కారణంగా అప్పటికే పెళ్ళయిన పుల్కిత్ తన భార్య శ్వేత రోహిర నుండి 2015 లో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందట. శ్వేత అప్పట్లో తమ విడాకులకు యామీనే కారణం అని ఓపెన్ గా ఘాటు విమర్శలు చేసింది. అప్పటినుండి యామి పెళ్ళి మాట ఎత్తడం లేదు.