రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `వినయ విధేయ రామ`. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ మంత్రి, టి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా...మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ''చిరంజీవి నువ్వేమి సాధించావ్? అని ఎవరైనా అడిగితే రెండు అని చెప్పగలను. ఒకటి రాంచరణ్ అయితే.. రెండు ఎప్పటికీ తరిగిపోని కోట్లాది మంది అభిమానులనే అని గుండె లోతుల్లో నుండి చెప్పగలను. రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీ అభిమానం ఎలా ఉంటుందోనని మీమాంస ఉండేది. అయితే ఖైదీ నంబర్ 150 సినిమాను సూపర్‌డూపర్ హిట్ చేసి అభిమానం చెక్కు చెదరలేదు అని నిరూపించారు. ఆజన్మాంతం అభిమానులకు రుణపడి ఉంటాను. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ ఫంక్షన్‌కి వచ్చిన కె.టి.ఆర్‌ను చూస్తే సంతోషంగా ఉంది. నేను, తను శాసనసభలో బెంచ్ మేట్స్. మృదు భాషి. కుశల ప్రశ్నలు వేస్తుండేవారు. వినయ విధేయ రాముడు కె.టి.ఆర్‌గారే అనిపించినా.. ఆయన తన మాటల తూటాలతో ప్రత్యర్థుల నోళ్లు మూయించే డైనమిజం ఉన్న మనిషి. అంతర్జాతీయ వేదికలపై తన తీరు చూసి డేరింగ్, డైనమిక్ పర్సన్‌లా కనపడ్డారు. నన్ను స్టార్టింగ్‌లో డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో అనేవారు. ఇప్పుడు ఆ మూడు పదాలు కె.టి.ఆర్ అనే మూడు అక్షరాలకు సరిగ్గా సరిపోతాయి. బాధ్యత ఏదైనా తీసుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరని జి.హెచ్.ఎం.సి ఎన్నికలతో పాటు రీసెంట్ ఎన్నికల్లోనూ నిరూపించారు. సినిమా విషయానికి వస్తే.. రంగస్థలం షూటింగ్ సమయంలో రాంచరణ్‌తో తదుపరి సినిమా ఏం చేస్తే బావుంటుందనే డిస్కషన్ చేశాను. మాస్‌ను అలరించేలా ఫ్యాన్స్‌కు కిక్ ఎక్కించేలా సినిమా చేయమని చెప్పాను. అప్పుడు అలాంటి లైన్‌ను బోయపాటిగారి దగ్గర విన్నాను అని తను చెప్పాడు. పర్‌ఫెక్ట్ కాంబినేషన్ .. డెఫనెట్‌గా అలాంటి డైరెక్టర్ మాస్ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నేను ప్రోత్సహించాను. అలా బోయపాటిగారు లైన్‌లోకి వచ్చారు. ఫ్యామిలీ ప్రొటెక్టర్‌గా కథ వినగానే నాకు గ్యాంగ్ లీడర్ గుర్తుకొచ్చింది. నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. సినిమా రషెష్ చూశాను. ఆకట్టుకుంది. మాస్‌కు సంబంధించి చరణ్‌ను హైట్స్‌లో చూపించారు. చరణ్ డైలాగ్స్, ఫైట్స్ చక్కగా కుదిరాయి. అందరూ అలరించేలా, శభాష్ అనిపించుకునేలా సినిమా ఉంటుందని చెప్పగలను. దేవిశ్రీ చక్కగా మ్యూజిక్ అందించారు. అన్నారు.
కె.టి.ఆర్ మాట్లాడుతూ - ''స్వయంకృషితో తెలుగు పరిశ్రమలోనే కాదు.. భారత సినీ పరిశ్రమలో ఎదిగిన దిగ్గజం చిరంజీవిగారు. సముద్రమంతా అభిమానాన్ని, అద్భుతమైన వారసులను ఇండస్ట్రీకి అందించారు. సోదరుడు చరణ్ ధృవ సినిమా గురించి ఇదే వేదికపై మాట్లాడాను. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. రంగస్థలం సినిమాను చరణ్ చేస్తున్నప్పుడు తను గడ్డం పెంచుకున్నాడు. ఓసారి తనను బయట కలుసుకున్నాను. ఏ సినిమా చేస్తున్నావని అడిగాను. తను గ్రామీణ నేపథ్యంలో సినిమా చేస్తున్నానని చెప్పాడు. చరణ్ నాకు అర్బన్ కుర్రాడిగానే తెలుసు. కాబట్టి నేను ఆ సినిమా చూడనని చెప్పాను. కానీ సినిమా చాలా పెద్ద హిట్ అయిందని, గొప్పగా ఉందని స్నేహితులంతా చెబితే సినిమా చూశాను. చరణ్ కెరీర్‌లో బెస్ట్ ఫిలిం. ఆ సినిమాలోని ఆ గట్టునుంటావా? ఈ గట్టుకొస్తావా? అనే పాటను నేను ఎలక్షన్ టైంలో కూడా ఉపయోగించుకున్నాను. దేవిశ్రీగారి మ్యూజిక్ చాలా బావుంది. బోయపాటికి ఆల్ దిస్ట్. ఈ సినిమా మెగాభిమానులకు ఫీస్ట్‌లా ఉంటుంది. ఇండ్రస్టీలో అంచెలంచెలుగా ఎదుగుతున్న చరణ్‌గారికి నా అభినందనలు అన్నారు.
రాంచరణ్ మాట్లాడుతూ - ''ప్రియతమ నేత, గ్రేట్ లీడర్, యూత్‌కి ఇన్‌స్పిరేషన్ అయిన కె.టి.ఆర్‌గారికి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనందుకు నా అభినందనలు. ఆయన నా స్నేహితుడని చెప్పుకోవడానికి గర్వపడతాను. చాలా లవబుల్ పర్సన్. ఆయన ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. బాస్ అనాలో, మెగాస్టార్ అనాలో, అన్నయ్యగారనాలో తెలియడం లేదు. నేనైతే నాన్నగారనే అంటున్నాను. సినిమా విషయానికి వస్తే ఈ కథను బోయపాటిగారు నాలుగేళ్ల క్రితమే చెప్పారు. నాలుగేళ్లు తను ఆలోచించి ఈ స్క్రిప్ట్‌ను ఆలోచించి ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో డిసిప్లెయిన్డ్ సెట్ బోయపాటిగారిదే. ఏ హీరో అయినా తన కెరీర్‌లో బోయపాటిగారితో పనిచేయాలనుకుంటాడు. ఈసినిమాలో నాకు మంచి మెమొరీస్ ఉన్నాయి. దేవిశ్రీతో చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. ఇప్పటి నుండి భారీ సినిమాలంటే దానయ్యగారే గుర్తుకొస్తారు. ఆయనకు థాంక్స్. కియరా చాలా హార్డ్ వర్కర్. బెస్ట్ డాన్సింగ్ పార్ట్‌నర్. స్నేహగారు అద్భుతమైన, హంబుల్ క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ బ్యూటీఫుల్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. అన్నారు.