ఎన్టీఆర్ పాటలు వచ్చేశాయ్ 

22 Dec,2018

 నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను 'యన్‌.టి.ఆర్‌' పేరుతో తెరకెక్కిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ టైటిల్‌ పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్‌ 'యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు'.. 'యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు' అనే రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో మొదటి భాగం 'యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, కలెక్షన్‌ కింగ్‌ ఎం.మోహన్‌బాబు, వరప్రసాద్‌ రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్‌, సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి, క్రిష్‌ జాగర్లమూడి తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను సీనియర్‌ ఎన్టీఆర్‌ పెద్దకుమార్తె గారపాటి లోకేశ్వరి విడుదల చేశారు. ఈసందర్భంగా.. 
సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ - ''నేను చిన్నప్పట్నుంచి రామారావుగారి అభిమానిని. డిగ్రీ పూర్తయిన తర్వాత రామారావుగారిని కలవాలనే మద్రాసు వెళ్లాను. వారిని కలిసి 'మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. నాకు సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్‌ ఉంది. మీ పిక్చర్స్‌లో ఏదైనా వేషం ఇవ్వండి' అన్నారు. దానికి ఆయన 'నువ్వింకా చిన్న కుర్రాడిగానే ఉన్నావ్‌. రెండు, మూడేళ్లు అగితే నువ్వు పనికొస్తావ్‌. డెఫనెట్‌గా వేషం ఇస్తాను' అన్నారు. ఈలోపు ఆదుర్తి సుబ్బారావుగారు నన్ను తేనె మనుషుల్లో హీరోగా పరిచయం చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఐదో సినిమా 'స్త్రీ జన్మ'లో రామారావుగారితో నటించే అవకాశం కలిగింది. తర్వాత నిలువుదోపిడి, విచిత్ర కుటుంబం సినిమాలు చేశాను. మూడు సినిమాలు హిట్‌ అయ్యాయి. ఆ తర్వాత పండంటి కాపురం హండ్రెండ్‌ ఫంక్షన్‌కి రామారావుగారు వచ్చారు. నేను స్టేజ్‌పైనే రామారావుగారితో సినిమా చేయాలనుందని అనౌన్స్‌ చేస్తానని అంటే.. 'డెఫనెట్‌గా బ్రదర్‌ పిక్చర్‌లో నేను యాక్ట్‌ చేస్తాను. సబ్జెక్ట్‌ చూసుకోండి' అన్నారు. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు సబ్జెక్ట్‌ వినిపిస్తే చాలా బావుందని, ఓకే షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. ఆయనతో నేను చేసిన సినిమాలన్నింటిలో తమ్ముడిగానే నటించాను. బాలకృష్ణగారు ఈ ఫంక్షన్‌కు పిలవడానికి వచ్చి ఆయన వేసిన గెటప్స్‌ను ఫోన్‌లో నాకు చూపించారు. 100 శాతం రామారావుగారిలాగానే బాలకృష్ణ కనిపించారు. 'యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు', 'యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు' సినిమాలు ఘన విజయాలు సాధించి బాలకృష్ణగారికి గొప్ప పేరుని తీసుకురావాలి'' అన్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ''సమాజమే నా దేవాలయం ప్రజలే నా దేవుళ్లు అన్నది అన్నగారే. ఆయనతో పనిచేయాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. అలాంటి గొప్ప వ్యక్తితో 12 సినిమాలు చేశాను. అన్నగారి అఖరి పిక్చర్స్‌ నేనే చేశాను. ఈ సినిమాను నేను 12 సార్లు చూస్తాను. ఎందుకంటే ఆయనతో నేను 12 సినిమాలు చేశాను కాబట్టి.. అలాగే సంవత్సరానికి పన్నెండు నెలలుంటాయి. కాబట్టి ప్రతి నెలా చూస్తాను. ఈవాళళీ స్టేజ్‌పై నేను ఉన్నానంటే కారణం అన్నగారే'' అన్నారు.
జూనియర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ''మా బాబాయ్‌ను చూస్తుంటే పెద్దాయన గుర్తుకు వస్తున్నారు. ఆ మహా మనిషి కుటుంబంలో నేను కూడా ఒక వ్యక్తిని. ఆ కుంటుంబంలో నేను కూడా ఒక సభ్యుడ్ని అవడం ఎంత గర్వ కారణం. ఈరోజు నేను కుటుంబసభ్యుడిగా మాట్లాడటానికి రాలేదు. ఓ మహానుభావుడు చేసిన త్యాగాల వల్ల లబ్దిపొందిన తెలుగువాడిగా మాట్లాడటానికి వచ్చాను. తెలసి తెలియని వయసులో.. తాతయ్యగారు అని మహా మనిషిని సంబోధించిన నేను.. ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావుగారు అనో.. అన్నగారు అనో సంబోధించడం మొదలు పెట్టాను. ఎందుకంటే ఆయన ఏ ఒక్క కుటుంబానికో చెందినవాడు కాదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడికీ చెందిన ధృవతార ఆయన. ఎన్నో కథలు ఆయన గురించి విన్నాను. నాన్న, అమ్మ, బాబాయ్‌లు చెప్పినప్పుడు తెలుసుకునేవాడిని. అయితే ఇంకా తెలుసుకోవాల్సిందే ఎంతో ఉంది. వాల్మీకి మహర్షి రామాయణం రాసేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఆయన్ను అడిగి ఉంటాడేమో 'అయ్యా ధర్మ మూర్తీభవించేలా .. కనపడేలా ..నిలువెత్తు ధర్మంతో కనపడేలా ఏ మానవుడు లేడా' అని ఉంటాడు. ఎందుకు లేడు.. అడుగో శ్రీరామచంద్రుడు అని చెప్పి ఆయన రామాయణం రాసి ఉంటాడు. ఆయన అవతారాన్ని వదిలేసిన తర్వాత మన తెలుగు వాళ్లు అడిగారేమో మళ్లీ అలాంటి ధర్మ మూర్తిని చూడమా? మళ్లీ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని చూడలేమా? అనే తెలుగువాడి ఆర్తనాదంలోనుండి ఆ శ్రీరామచంద్ర ప్రభువు కటాక్షంతోనే 1923 మే 28న నిమ్మకూరులో ఓ ధృవతార వెలిసింది. గొప్ప తండ్రే కాదు.. గొప్ప బిడ్డే కాదు.. గొప్ప నటుడే కాదు.. గొప్ప నాయకుడే కాదు.. వీటన్నింటికంటే ముఖ్యం తెలుగువాళ్లమని మనల్ని సంబోధించని రోజుల్లో.. పక్క రాష్ట్రంవాళ్ల పేరుతో మనల్ని పిలిచిన రోజుల్లో ఇదిరా తెలుగువాడి గౌరవం.. ఇదిరా తెలుగువాడి పౌరుషం..ఇదిరా తెలుగువాడి ఖ్యాతి అని తొడగొట్టి ఇదిరా తెలుగువాడని మనం చెప్పుకుంటున్నామంటే అందుకు త్యాగం చేసిన మహానుభావులు ఎందరో. అందులో నందమూరి తారక రామారావుగారు ఒక ప్రముఖులు. ఇది నాకు తెలుసు. రేపు పొద్దున మా పిల్లలు మమ్మల్ని నాన్న అలాంటి ధర్మమూర్తి ఉన్నాడా? అప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను 'ఇంకా పుట్టలేదేమో నాన్న.. అని మా తాతగారి వాళ్ల తాత చేసిన సినిమా గురించి చూపించుకుంటాను. ఆ మహానుభావుడు చరిత్రను భావితరాల వారికి తీసుకెళ్తున్న బాబాయ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ మహానుభావుడు చరిత్రను బాబాయ్‌ అందిస్తున్నారు. బాబాయ్‌కి ఎన్నో చిత్రాలు చూశాను. మొట్టమొదటిసారి మా తాతగారిని చూసుకున్నాను. ఈ చరిత్రను విజయం సాధించాలని నేను కోరుకోను. ఎందుకంటే ఈ చిత్రం విజయం సాధించాకే మొదలైంది. చరిత్రకు విజయాలు, అపజయాలుండవు. చరిత్ర సృష్టించడమే ఉంటుంది. బాబాయ్‌ చేస్తున్న ఈ ప్రయత్నానికి, కన్న కలకు చేదోడు వాదోడుగా, వెన్నుముకలా నిలిచిన క్రిష్‌ నాకెంతో ఆప్తుడు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మరోగొప్ప సినిమాను మనకు అందిస్తున్నారు. ఆయన్ను ఎంత పొగిడినా తక్కువే. ఆయనతో పాటు కీరవాణిగారు, సాయిమాధవ్‌బుర్రాగారు.. జ్ఞానశేఖర్‌గారు.. సహా ప్రతి సాంకేతిక నిపుణుడికి, నటీనటులకు కృతజ్ఞతలు'' అన్నారు.
 

Recent News