వరుణ్ సందేశ్ కీలక పాత్రలో ఏ డి.జె.ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ఆర్ల నిర్మిస్తున్న చిత్రం `దాడి`. మధు శోభ.టి దర్శకుడు. ఈ చిత్రంలో జీవన్, చెరిష్మా శ్రీకర్, కారుణ్య చౌదరి తదితరులు నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏడిద శ్రీరామ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. శివాజీ రాజా క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో.. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ - ``ఏడాది పాటు అమెరికాలో ఉన్నాను. గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇదే. యు.ఎస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత చాలా కథలు విన్నాను. ఈ కథ నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ మధు మంచి స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నా గత సినిమాలకు భిన్నమైన ప్రయత్నమిది. గోకుల్ చాట్ బాంబు దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఇందులో కనపడతాను. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అలాంటి పరిణామాలు వెనుక అసలు నిజాన్ని రాబట్టడానికి జర్నలిస్ట్‌గా మారి ఏం చేశాననేదే ఈ కథ. మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధాన బలం. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్కెళతాం`` అన్నారు.
డైరెక్టర్ మధు శోభ.టి మాట్లాడుతూ - ``అన్నీ రకాల ఎమోషన్స్ ఉండే చిత్రమిది. యూత్‌కు మంచి సందేశం ఉంటుంది. సమాజంలో జరుగుతున్న పరిణామాల వెనుకున్న చీకటి కోణాలను వెలికి తీసే జర్నలిస్ట్ కథ ఇది. కచ్చితంగా హిట్ సాధిస్తాననే నమ్మకం ఉంది`` అన్నారు. నిర్మాత శంకర్ ఆర్ల మాట్లాడుతూ - ``మంచి సందేశం ఉన్న చిత్రం. వరుణ్ సందేశ్ తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. దర్శకుడు మధు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి నిర్మాతగా మారాను`` అన్నారు.