నీకు నాకు మధ్య కోటి ప్రేక్షకులు

03 Feb,2018

నిత్యం ఎన్నో రాగాలు, మరెన్నో పాటలు మనం వింటూనే ఉంటాం. చాలా పాటలు చెవులకు మాత్రమే సోకితే...మంచి పాటలు నేరుగా హృదయాన్ని తాకుతాయి. దళపతి అనే కొత్త చిత్రంలో అలాంటి పాటే ప్రస్తుతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. నీకు నాకు మధ్య ఏదో ఉంది అని సాగే ఈ పాటకు రాంబాబు ఘోసల సాహిత్యాన్ని అందించగా...యాజమాన్య స్వరాలు కూర్చారు.

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్, యాజమాన్య కలిసి పాడిన నీకు నాకు మధ్య ఏదో ఉంది అనే పాటను యూట్యూబ్ లో కోటి మంది వీక్షించారు. కేవలం సింగిల్ ఛానెల్ అప్ లోడింగ్ లోనే 10 మిలియన్ వ్యూస్ అందుకుని ఆశ్చర్యపరుస్తోందీ పాట.  మిగతా అన్ని యూట్యూబ్ ఛానెల్స్ వ్యూస్ కలిపితే ఇది దాదాపు 20 మిలియన్ వ్యూస్ కు చేరుకుంటుంది. ఓ పాటకు ఇంతటి క్రేజ్ అతి కొద్ది మంది స్టార్ హీరోల సినిమాలకే చూస్తుంటాం. కానీ కొత్త కథానాయకుడు సదా, కవితా అగర్వాల్ జంటగా నటించిన దళపతి చిత్రంలోని పాటకు రావడం అరుదైన విషయం. యూట్యూబ్ లో నీకు నాకు మధ్య ఏదో ఉంది అనే పాట సృష్టిస్తున్న సంచలనంపై దర్శకుడు సదా మాట్లాడుతూ....సాధారణంగా బీట్ పాటలకు ఎక్కువ జీవితకాలం ఉండదు. అలా విని ఇలా మర్చిపోతుంటాం. కానీ మెలొడీ పాటలు ఎప్పటికీ శ్రోతల గుండెల్లో నిలిచిపోతాయి.

సంగీత దర్శకుడు యాజమాన్య ఈ పాట గురించి చెప్పినప్పుడు తప్పకుండా హిట్ అవుతుంది అనుకున్నాం కానీ...ఇంత గొప్పగా శ్రోతలకు చేరువవుతుందని ఊహించలేదు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మా దళపతి చిత్రానికి ఈ పాటే ప్రధాన ఆకర్షణగా మారిపోయింది. నాలాంటి కొత్త కథానాయకుడి పాట కోటి వ్యూస్ తెచ్చుకోవడం మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తోంది. పాటను ఇంతగా ఆదరించిన శ్రోతలకు, అద్భుతంగా స్వరపరిచి పాడిన యాజమాన్య, శ్రేయా ఘోషల్ లకు, సాహిత్యాన్ని అందించిన రాంబాబు ఘోసల గారికి కృతజ్ఞతలు. మాకు ఇంతటి పేరు తీసుకొచ్చిన పాట పేరునే నా దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రానికి పెట్టుకుంటున్నాము. నీకు నాకు మధ్య ఏదో ఉంది అనే పేరుతో త్వరలో రానున్న చిత్రానికి స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. నూతన నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే నీకు నాకు మధ్య ఏదో ఉంది అనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాం. అన్నారు.​

Recent News