లాగిన్ మీడియా పతాకంపై మేఘన, సంతోషి, సల్మాన్ ప్రధాన పాత్రల్లో కృష్ణకార్తీక్ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్. వై నిర్మించిన హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ 'హ్యాక్‌డ్ బై డెవిల్' (హెచ్‌బిడి). ఈ చిత్రం ఫిబ్రవరి 2 తేదీన విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్. పి. పట్నాయక్, రాజ్ కందుకూరి, సెంట్రల్ ఎక్స్ మినిస్టర్ సర్వే సత్యనారాయణ, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, ఎంఐఎం జూబ్లీహిల్స్ కంటెస్ట్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, సాయి వెంకట్, రామ సత్యనారాయణ తదితరులతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.
ఈ సందర్భంగా చిత్ర టీజర్ ని నవీన్ యాదవ్, ట్రైలర్ ని సర్వే సత్యనారాయణ విడుదల చేశారు. పాటలను ఆర్. పి. పట్నాయక్, రాజ్ కందుకూరి, రామ సత్యనారాయణ, సాయి వెంకట్ లు విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణకార్తీక్ మాట్లాడుతూ.. ''చాలా ఉద్వేగంతో వున్నాను. నా మొదటి సినిమా ఇది. ఫిబ్రవరి 2 వ తేదీన విడుదల కాబోతుంది. పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిలా వేచి చూస్తున్నాను. నా ఈ తొలి అడుగుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన అందరికి నా ధన్యవాదాలు. సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫిబ్రవరి 2 అందరం థియేటర్స్ లో భయపడదాం..'' అన్నారు.
చిత్ర నిర్మాత ఉదయ్‌భాస్కర్. వై మాట్లాడుతూ.. '' ముందుగా మా టీమ్ ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. మేము ఒక టీమ్‌లా ఏర్పడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రం తర్వాత రెగ్యులర్‌గా సినిమాలు నిర్మిస్తాం. 'హ్యాక్‌డ్ బై డెవిల్' ఫిబ్రవరి 2 వ తేదీన విడుదల అవుతుంది. దర్శకుడు కృష్ణకార్తీక్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆయనకి తొలి చిత్రం ఇది. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరికి ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ చిత్రంని ఆదరించి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను..'' అని అన్నారు.
అతిధులుగా హాజరైన అందరూ ఈ సినిమా ఘన విజయం సాధించి, ఈ టీమ్ కి మంచి పేరు తీసుకురావాలని అభిలాషించారు.
మేఘన, సంతోషి, సల్మాన్, హిమజ, మానస, సురేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్ యం.యం, డిఓపి: కన్నా కోటి, ఎడిటర్: కె.ఆర్. స్వామి, డైలాగ్స్: అభయ్ శ్రీజయ్, కో-డైరెక్టర్: రమేష్ పోలే, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లిక్. కె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్ గౌడ్. వై, నిర్మాత: ఉదయ్‌భాస్కర్. వై, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కృష్ణకార్తీక్.