రిపబ్లిక్ డే కు సినిమా ల సందడి

24 Jan,2018

కేసారి రెండు, మూడు సినిమాలు వస్తేనే ధియేటర్లకు పండగ వస్తుంది. అలాంటిది 5 సినిమాలు విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్‌కు ఫుల్ ఎనర్జీ, ప్రేక్షకులకు బోల్డంత వినోదం. రిపబ్లిక్ డేకు ఆ సంబరాలను మరింత పెంచడానికి స్ట్రయిట్ సినిమాలతో పాటు, డబ్బింగ్ మూవీస్ కూడా వస్తున్నాయి.

ఈ రిపబ్లిక్ డే టాలీవుడ్‌కు సినిమాల పండుగ తీసుకొస్తోంది. హారర్, రొమాంటిక్ ఎంటర్టైనర్, పీరియాడికల్ ఫిక్షన్, స్పేస్ జానర్ సినిమాలతో ఈ జెండా పండగ వినోదం రెట్టింపు కాబోతోంది. 'బాహుబలి'తో బ్లాక్‌బస్టర్ అందుకున్న అనుష్క, అశోక్ దర్శకత్వంలో 'భాగమతి'గా భయపెట్టడానికి ఈనెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. స్వీటీ కలెక్టర్‌గా నటించిన ఈ సినిమా 'అరుంధతి' రేంజ్‌లో ఆకట్టుకుంటుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు దర్శక,నిర్మాతలు. ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళ, మళయాళంలోనూ రిలీజ్ అవుతోంది.

 

హీరోగా సరైన హిట్ కొట్టి చాలా కాలం అయిన రాహుల్ రవీంద్రన్ కూడా రిపబ్లిక్ డే బరిలో దిగుతున్నాడు. రేవన్. యాదూ దర్శకత్వంలో రాహుల్, చాందినీ చౌదరి జంటగా నటించిన 'హౌరా బ్రిడ్జ్' ఈ నెల 26న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దీంతో 'హౌరా బ్రిడ్జ్' డైరెక్టర్‌గా తన రేంజ్ పెంచుతుందని రేవన్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక ఆర్టిస్ట్ నుంచి 'చి.ల.సౌ' సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ కు ఈసినిమా బోనస్ లాంటిదనే చెప్పొచ్చు.

'పద్మావత్' సినిమా బాలీవుడ్‌లోనే కాదు తెలుగునాట ప్రభావం చూపిస్తోంది. వివాదాల నుంచి బయపటపడి ఈనెల 25న వస్తోన్న 'పద్మావత్' ను సోలోగా వదిలేస్తూ అక్షయ్ కుమార్ 'పాడ్ మాన్', సిద్దార్ధ్ మల్హోత్రా 'అయ్యారే' సినిమాలు ఫిబ్రవరి 9కి వెళ్లాయి. ఇక ఈ సినిమా తెలుగులోనూ డబ్ అవుతుండడంతో మంచు విష్ణు 'ఆచారి అమెరికా యాత్ర', మంజుల ఘట్టమనేని డైరెక్టోరియల్ డెబ్యూ 'మనసుకు నచ్చింది' సినిమాలు కూడా ఈనెల 26 నుంచి వాయిదా పడ్డాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకుణే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ లీడ్ రోల్స్‌లో రూపొందిన 'పద్మావత్' విడుదలకు ముందు వివాదాలు సృష్టించినా, రిలీజ్ అయ్యాక రికార్డులు క్రియేట్ చేస్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది.

తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ రిపబ్లిక్ డేకు సందడి చేయబోతున్నాయి. మిత్రన్ దర్శకత్వంలో విశాల్, సమంత లీడ్ రోల్స్‌లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'అభిమన్యుడు' ఈనెల 26న వస్తోంది. దీంతో పాటే మరో తమిళ డబ్బింగ్, ఇండియన్ ఫస్ట్ స్పేస్ ఫిల్మ్‌గా రూపొందిన శక్తి సౌందర్ రాజన్, జయం రవిల 'టిక్ టిక్ టిక్' కూడా రిలీజ్ అవుతోంది. తెలుగు నాట సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు సందడి చేస్తే, ఇప్పుడు మీడియం బడ్జెట్ మూవీస్ హై ఎంటర్టైన్మెంట్ అందించాలనుకుంటున్నాయి. మరి ఈ హోరా హోరీ పోరులో ప్రేక్షకులను ఎవరు ఎక్కువగా ఆకట్టుకుంటారో చూద్దాం.

Recent News