ఇప్పటివరకూ పైరసీ సినిమాను కిల్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని సినిమా థియేటర్స్ నుంచి వెళ్లకముందే వెబ్ సెట్స్‌లోకి వచ్చేస్తోంది. పైగా రైట్స్ తీసుకుని మరీ ప్రసారం చేస్తున్నారు. తాజాగా 'ఎంసీఏ' సినిమాదీ అదే పరిస్థితి.
నాని హీరోగా నటించిన 'ఎంసీఏ' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. సంక్రాంతి సినిమాలు వచ్చినప్పటికీ.. 'ఎంసీఏ' సందడి మాత్రం థియేటర్స్‌లో ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమా చూసేందుకు కొందరు థియేటర్స్‌కు వెళ్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇంటర్నెట్ అధికారికంగా దర్శనం ఇవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. నిర్మాత దిల్ రాజు నుంచి అఫీషియల్‌గా హక్కులు కొన్న అమేజాన్ ప్రైమ్ సంస్థ దర్జాగా ఈ సినిమాను తమ సబ్ స్క్రైబర్స్ కోసం నెట్‌లో ఉంచింది.
'ఎంసీఏ' సినిమానే కాదు గతంలో 'జవాన్' సినిమా కూడా విడుదలైన 28వ రోజునే 'అమెజాన్ ప్రైమ్'లో ప్రసారమైంది. తమిళ, హిందీ సినిమాలు కూడా ఇలాగే ప్రసారమవుతున్నాయి. చిత్ర నిర్మాతల నుంచి రైట్స్ తీసుకునేటప్పుడే నెలరోజుల్లోపు ప్రసారం చేస్తామనే బాండ్ తీసుకుంటున్నారు సదరు స్ట్రీమింగ్ వెబ్‌సైట్ నిర్వాహకులు. భారీ మొత్తం ఆఫర్ చేస్తుండడంతో నిర్మాతలు సైతం అంగీకరిస్తున్నారు. దీంతో సినిమా థియేటర్స్‌లో ఉన్నా.. ఏం మాట్లాడలేని పరిస్థితి నిర్మాతలది.
కోట్లు పోసి పంపిణి హక్కులు కొన్న డిస్టిబ్యూటర్స్, థియేటర్ యాజమాన్యాలు మాత్రం స్ట్రీమింగ్ వెబ్‌సైట్స్ వైఖరి వల్ల భారీ ఎత్తున నష్టపోతున్నాయి. శాటిలైట్ హక్కులు కొనుక్కున్న టీవీ ఛానల్స్ దీ ఇదే పరిస్థితి. గతంలో ఈ విషయంపై నిర్మాత సురేష్ బాబు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. సినిమా విడుదలకు ముందే వీలయినంతగా సొమ్ము చేసుకోవాలనే ఏ నిర్మాతైనా ఆశిస్తాడు.
అందుకే 'అమెజాన్ ప్రైమ్', 'నెట్ ఫ్లిక్స్' వంటి సంస్థల ఆఫర్‌ను కాదనలేకపోతున్నారు. ఓ రకంగా ఇది నిర్మాతలకు అదనపు ఆదాయమే కానీ నెలరోజుల్లోనే ప్రసారం అయితే ప్రధాన ఆదాయవనరులైన పంపిణీ, శాటిలైట్‌పై దెబ్బ పడటం ఖాయం. అదే జరిగితే నిర్మాతలు అసలైన ఆదాయన్ని పోగొట్టుకోవలసి వస్తుందంటున్నారు. సో ఈ విషయమై నిర్మాతలు ఆలోచిస్తారేమో చూడాలి..!