ఘాజీ దర్శకుడితో వరుణ్ తేజ్ కొత్త సినిమా?

22 Jan,2018

టెక్నాలజీని అందిపుచ్చుకుని అద్భుత చిత్రాలు తెరకెక్కించడంలో ముందుంటోంది దక్షిణాది సినీపరిశ్రమ. హాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన స్పేస్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ కూడా ఇప్పుడు దక్షిణాదిన రాబోతున్నాయి. తాజాగా తెలుగులోనూ ఈ తరహా సినిమా ఒకటి తెరకెక్కబోతోందట. వాలంటైన్స్ డే సందర్భంగా 'తొలిప్రేమ' వంటి ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్ తేజ్.. మరోవైపు తన నెక్స్ట్ మూవి మాత్రం ప్రయోగాత్మకంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిద్యానికే ప్రాధాన్యతను ఇస్తోన్న వరుణ్ తేజ్ త్వరలో 'ఘాజీ' దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించబోతున్నాడు. తొలిచిత్రంతోనే అంతర్జాతీయ స్థాయి సబ్జెక్ట్‌ను డీల్ చేసిన సంకల్ప్ రెడ్డి ఇప్పుడు వరుణ్‌తో తెరకెక్కించబోయే సినిమా ఈ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉండేలా మరోసారి ప్రయోగాత్మక కథనే సిద్ధం చేశాడట.


వరుణ్ తేజ్‌తో సంకల్ప్ రెడ్డి రూపొందించబోయే చిత్రం అంతరిక్ష నేపథ్యంలో ఉండబోతోందట.. ఈ తరహా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ హాలీవుడ్‌లో మినహా ఇండియాలో చాలా తక్కువ. ఆమధ్య ‘చందమామలో అమృతం' సినిమాలో కొంత స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినప్పటికీ పూర్తి స్థాయి స్పేస్ మూవీ కాదు. ఇక రిలీజ్‌కు రెడీ అవుతోన్న తమిళ చిత్రం 'టిక్ టిక్ టిక్' స్పేస్ బ్యాక్‌డ్రాప్ లోనే తెరకెక్కింది. 'ఘాజీ' సినిమాను 15 కోట్లలో కంప్లీట్ చేసి ఆశ్చర్యపరచిన సంకల్ప్ రెడ్డి ఈ స్పేస్ బ్యాక్‌డ్రాప్ మూవీని 25 కోట్ల బడ్జెట్‌లోనే రూపొందించబోతున్నాడట. ఈ మూవీలో నటించే ముందు వరుణ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట. ఏప్రిల్ నుంచి సెట్స్‌కు వెళ్లనున్న ఈ మూవీ తెలుగువారిని ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

Recent News