- Home
- News
- పెద్ద స్టార్ అవుతాననడమే గొప్ప కాంప్లిమెంట్: చందన కొప్పిశెట్టి
పెద్ద స్టార్ అవుతాననడమే గొప్ప కాంప్లిమెంట్: చందన కొప్పిశెట్టి
23 Aug,2020
ఏ రంగంలో అయినా ప్రతిభే కొలమానం. అలా తమ సామర్ధ్యాన్ని చాటుకున్నవాళ్ళే అందలం ఎక్కుతుంటారు. సినీరంగంలో కూడా అందంతో పాటు చక్కటి అభినయాన్ని ప్రదర్శించిన ప్రతిభావంతులైన కథా నాయికలే పదికాలాల పాటు రాణించారు....ప్రేక్షకుల హృదయాలలో శాశ్వత ముద్రను వేసుకున్నారు. ఆ కోవలోనే కథా నాయికగా వెలుగొందాలని కోరుకుంటోంది వర్ధమాన కథా నాయిక చందన కొప్పిశెట్టి. ఓ వైపు చదువుకుంటూనే చిన్నప్పటినుంచి నటన పట్ల పెంచుకున్న ఆకాంక్ష ఆమెతో పాటు పెరిగి పెద్దదైంది. తండ్రి వృత్తి రీత్యా వివిధ ప్రాంతాలలో విద్యాభ్యాసం చేసిన ఈ అచ్చ తెలుగు అమ్మాయి డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపి కోర్సు పూర్తి చేసినప్పటికీ...కథా నాయిక కావాలన్న దృఢ సంకల్పం ఆమెను సినీ రంగంలోకి ప్రవేశింపజేసేలా చేసింది. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం కోసం లోగడ జరిగిన ఆడిషన్స్ లో విజేతగా నిలిచి కథా నాయిక అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇందులో సత్యదేవ్ హీరోగా నటించగా.... అతని సరసన ఆమె నటించింది. కంటెంట్ ప్రాధాన్యంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్స్ మూసివేయడంతో నెట్ ఫ్లిక్స్ లో కొద్ది రోజుల క్రితం విడుదలై...అశేష ప్రేక్షక ఆదరణను చూరగొంది.
ఈ నేపథ్యంలో చందన కొప్పిశెట్టి పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించింది.
''ఓ అద్భుతమైన కంటెంట్ కలిగిన కథా చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కావడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. అందునా మరో ముఖ్య విశేషమేమిటంటే...బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు కావడం కూడా ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేసింది. స్వాతి అనే నటనకు ఎంతో అవకాశం వున్న పాత్రను ఇందులో పోషించాను. ప్రేమ విషయంలో నలిగి పోయే యువతిగా నా పాత్ర మలచబడింది. తొలి చిత్రంలోనే అభినయానికి అత్యంత
ప్రాముఖ్యం వున్న ఇలాంటి పాత్ర లభించడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు వెంకటేష్ మహా ప్రతీ ఫ్రేమ్ ను ఎంతో హృద్యంగా మలిచారు. హీరోయిన్ గా వెలగాలన్న నా ఆశయానికి ఈ చిత్రం బంగారు బాటలు వేసింది. ప్రస్తుతం మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరఫి చేస్తున్నప్పటికీ నటనకు తొలి ప్రాధాన్యం ఇవ్వదలచుకున్నాను. కంటెంట్ బేస్డ్, ఎంటర్టైన్మెంట్ కథా చిత్రాలలో హీరోయిన్ గా మంచి మంచి పాత్రలు చేస్తూ కెరీర్ ను అందంగా తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నా. డాన్స్ కూడా చాలా బాగా చేయగలననే ఆత్మ విశ్వాసం నాకుంది. డాన్స్ మాస్టర్ చెప్పే సూచనలను ఇట్టే పసిగట్టి అందుకు అనుగుణంగా డాన్స్ చేస్తున్నానని అందరూ అంటుండం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంటుంది. సినీరంగంలోని కొంతమంది ప్రముఖులు తొలి చిత్రంలోని నా నటనను చూసి పెద్ద హీరోయిన్ అయ్యే మంచి ఫీచర్స్ పుష్కలంగా వున్నాయంటూ కితాబు ఇవ్వడం ఎప్పటికీ మరచిపోలేను. ఇక కొత్త సినిమా అవకాశాల గురించి చెప్పాలంటే....
తాజాగా రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వాటి వివరాలను వెల్లడిస్తా'' అంటూ ముగించారు.
Recent News