జాతీయ అవార్డు పొందిన ప్రతిభావంతుడైన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన మూడో సినిమా రూపకల్పనలో బిజీగా ఉన్నారు. తొలి రెండు చిత్రాలు 'అ!', 'కల్కి'లతో ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల మెప్పు పొందిన ఆయన ఇప్పుడు నిజ జీవిత ఘటనలను ఆధారం చేసుకొని సినిమా తీస్తున్నారు.
శనివారం ఆ చిత్రానికి 'జాంబీ రెడ్డి' అనే విభిన్న తరహా టైటిల్ ప్రకటించారు. హాలీవుడ్‌లో తయారైన వెన్ను జలదరింపజేసే యానిమేషన్‌తో తనదైన స్టైల్‌తో ప్రశాంత్‌వర్మ ఆ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. తెలుగులో ఇది మొట్టమొదటి జాంబీ ఫిల్మ్ కావడం విశేషం.
'జాంబీ రెడ్డి' టైటిల్ యానిమేషన్‌లో.. ఆకాశంలో నిండు చంద్రుడు, కొండమీదున్న గుడిని కెమెరా క్లోజప్‌లో చూపిస్తూ ఉండగా, గబ్బిలాలు కీచుమంటూ అరుస్తూ ప్రశాంత వాతావరణాన్ని కాస్తా వయెలెంట్‌గా మార్చేశాయి. ఒక శ్మశానంలోని సమాధి బద్దలైపోయి, దాని స్థానంలో ఒక్కసారిగా భూమిలోంచి ఓ చేయి 'జాంబీ రెడ్డి' టైటిల్‌ను పట్టుకొని ప్రత్యక్షమైంది. ఎండిపోయిన చెట్టు కొమ్మమీద గుడ్లగూబ దానినే చూస్తోంది. ఆ టైటిల్ బ్యాగ్రౌండ్‌లో చంద్రుడు ఎరుపురంగులోకి మారిపోయాడు. టెర్రిఫిక్‌గా ఉన్న ఆ యానిమేషన్ విజువల్స్‌కు బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత ఇంటెన్సిటీని చేకూర్చింది.
కరోనాకీ, 'జాంబీ రెడ్డి'కీ మధ్య కనెక్షన్ ఏంటి?.. అనేది మరింత ఆసక్తికరమైన విషయం. అదేంటో తెలుసుకోవాలంటే టీజర్ వచ్చేదాకా వెయిట్ చెయ్యాల్సిందే.
థియేటర్లు తెరుచుకున్నాక తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు 'జాంబీ రెడ్డి' సినిమా రెడీ అవుతోందని ఈ మోషన్ పోస్టర్‌తో మనకు అర్థమైపోతోంది.
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెలుగులో మొట్టమొదటి జాంబీ ఫిల్మ్‌గా తయారవుతున్న 'జాంబీ రెడ్డి' బ్లాక్‌బస్టర్ కావడం తథ్యమని ముందుగానే నిర్ణయమైపోయినట్లు కనిపిస్తోంది.
నిర్మాత రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ, "తెలుగులో తొలి జాంబీ మూవీ 'జాంబీ రెడ్డి'తో మా సినీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నందుకు మా యాపిల్ ట్రీ స్టూడియోస్ యూనిట్ చాలా హ్యాపీగా ఫీలవుతోంది. ప్రశాంత్ వర్మ విజన్, యూనిక్ ఫిల్మ్‌మేకింగ్ స్టైల్‌పై ఒక నిర్మాతగా నాకు అమితమైన నమ్మకం ఉంది. కరోనా మహమ్మారి సృష్టించిన క్లిష్టమైన పరిస్థితుల మధ్య మా తారాగణం, సాంకేతిక బృందం, అవార్డ్ విన్నింగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నిర్విరామంగా పనిచేస్తూ ఈ చిత్రాన్ని వాస్తవం చేశారు. ఈ హై క్వాలిటీ మూవీని ఆడియెన్స్ బాగా ఇష్టపడతారని మేం చాలా నమ్మకంతో ఉన్నాం. హై క్వాలిటీతో, నిజ జీవిత ఘటనల కథలతో సినిమాలు నిర్మిస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకోవాలనే విజన్‌లో భాగంగా ఈ చిత్రాన్ని తీస్తున్నాం. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి బెస్ట్ టెక్నికల్, క్రియేటివ్ స్కిల్స్‌తో మీ ముందుకు వస్తాం" అని తెలిపారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, "ఒక హై-కాన్సెప్ట్ ఫిల్మ్ 'జాంబీ రెడ్డి'. అన్ని రకాల ప్రేక్షకులు దీన్ని ఇష్టపడతారని కచ్చితంగా చెప్పగలను. ఇది ఏ జానర్ సినిమానో ఊహించమని మేం ప్రకటించిన కాంటెస్ట్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. సరిగ్గా ఊహించినవాళ్లకు గిఫ్టులు అందుతాయి" అని చెప్పారు.
ఇదివరకు చెప్పినట్లు త్వరలోనే 'జాంబీ రెడ్డి'లోని తారాగణం వివరాలను చిత్ర బృందం వెల్లడిస్తుంది.
సాంకేతిక బృందం:
స్క్రీన్‌ప్లే: స‌్క్రిప్ట్స్‌విల్లే
మ్యూజిక్: మార్క్ కె. రాబిన్
సినిమాటోగ్రఫీ: అనిత్
ఎడిటింగ్: సాయిబాబు
ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర తంగల
పీఆర్వో: వంశీ-శేఖర్
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి
నిర్మాత: రాజ్‌శేఖర్ వర్మ
రచన-దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
బ్యానర్: యాపిల్ ట్రీ స్టూడియోస్