నవీన్ పోలిశెట్టి టైటిల్ రోల్ పోషించిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. తన సూపర్బ్ పర్ఫార్మెన్స్‌తో ఆబాలగోపాలాన్నీ అలరించారు నవీన్.
టాలీవుడ్ షెర్లాక్ హోమ్స్ అనదగ్గ 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' రానున్న రోజుల్లో మరికొన్ని మిస్టీరియస్ కేసుల్ని ఛేదించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా బర్త్‌డేని పురస్కరించుకొని ఆ సినిమా ట్రైలజీగా వస్తుందని ప్రకటించారు. అంటే ఆ చిత్రానికి మరో రెండు భాగాలు రానున్నాయన్న మాట.
డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్‌జె ప్రస్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. తను డైరెక్ట్ చేస్తోన్న రెండో సినిమా పూర్తవగానే 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' రెండో భాగం షూటింగ్ మొదలవుతుంది.
మరోవైపు, ఈ సినిమా హిందీ, తమిళ, మలయాళం రీమేక్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోయాయి. త్వరలో కన్నడ హక్కులు కూడా అమ్ముడు కానున్నాయి. ఇంకో విశేషమేమంటే, ఈ సినిమా జపాన్ భాషలో అనువాదమవుతోంది. సెప్టెంబర్ 11న అక్కడ విడుదలవుతోంది.
ఇటీవలి కాలంలో మరే తెలుగు సినిమా ఇన్ని భాషల్లో రీమేక్ కాలేదన్నది నిజం. ఇది 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సాధించిన ఘనతగా చెప్పుకోవచ్చు.
ఈ చిత్రానికి సంబంధించిన మరో రెండు భాగాలు రానున్నాయనే అనౌన్స్‌మెంట్ థ్రిల్లర్, కామెడీ సినిమాలను ఇష్టపడే అభిమానులకు ఆనందాన్ని చేకూర్చనుంది.
తన బర్త్‌డే సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ, "ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ రెండో భాగం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తన రెండో సినిమా పూర్తవగానే డైరెక్టర్ స్వరూప్ సెకండ్ పార్ట్‌ను చేపడతారు. స్క్రిప్ట్ తయారవుతున్న విధానానికి మేం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడిస్తాం" అన్నారు.