హీరో హీరోయిన్ల రోల్స్ విషయానికి వస్తే, తెరపై చక్కని కెమిస్ట్రీ పండించడం ప్రతి నటుడూ, ప్రతి నటీ తాపత్రయపడతారు. అదే తోబుట్టువుల పాత్రల విషయానికి వస్తే, అన్నాచెల్లెళ్లుగా లేదా అక్కాతమ్ముళ్లుగా కొంతమంది యాక్టర్లు మాత్రమే అద్భుతమైన కెమెస్ట్రీ పండించగలుగుతారు.
హాలీవుడ్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న 'మోసగాళ్లు' చిత్రంలో ఇద్దరు ప్రతిభావంతులైన యాక్టర్లు విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ తోబుట్టువులుగా ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ పండిస్తున్నారు. ఇప్పటిదాకా మనం చూడని ఆన్ స్క్రీన్ బ్రదర్-సిస్టర్ జంటగా వాళ్లు అలరించనున్నారు. నేడు రాఖీ పూర్ణిమ సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది.
ఆన్ స్క్రీన్‌పై తోబుట్టువులుగా ఒక హీరో లేదా హీరోయిన్ చేసేటప్పుడు భారతీయ సినిమాల్లో కుటుంబ బంధాలు అరుదుగా కనిపిస్తాయి. సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించేవాళ్లు తోబుట్టువులుగా చేయడం మరీ అరుదు. 'రక్త సంబంధం'లో ఎన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్లుగా, కృష్ణార్జునులులో శోభన్‌బాబు, శ్రీదేవి అన్నాచెల్లెళ్లుగా నటించగా, బాలీవుడ్‌లో షారుఖ్ కాన్, ఐశ్వర్యా రాయ్ అన్నాచెల్లెళ్లుగా కనిపించారు. ఇప్పుడు 'మోసగాళ్లు'లో విష్ణు, కాజల్‌లను తోబుట్టువులుగా చూడబోతున్నాం.
మంచి కమిట్‌మెంట్‌తో తను చేసే క్యారెక్టర్లకు ప్రాణం పోస్తుందని పేరు పొందిన కాజల్ అగర్వాల్ 'మోసగాళ్లు' సినిమా కోసం ఒక స్పెషల్ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.
చరిత్రలో నమోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తయారవుతున్న 'మోసగాళ్లు' మూవీకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి, రుహీ సింగ్, నవీన్ చంద్ర, నవదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
లాస్ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తోన్న మోసగాళ్లుకు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పనిచేస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మిస్తుండగా, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి ఈ వేసవిలోనే 'మోసగాళ్లు' విడుదల కావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో విడుదల తేదీ వాయిదాపడింది. త్వరలోనే మోసగాళ్లు ఎప్పుడు విడుదలయ్యేదీ నిర్మాతలు ప్రకటించనున్నారు.