అల్లుఅర్జున్ డాన్సులకు ప్రత్యేకంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మన టాలీవుడ్‌లోనేకాక ఈ స్టైలిష్ స్టార్‌కి బాలీవుడ్‌లో కూడా సెలబ్రెటీ ఫ్యాన్స్ ఎక్కువయిపోయారు. ఇకపోతే... డ్యాన్సులంటే ఎవరికి ఇష్టముండదు! వాస్తవానికి ఆయన తన డ్యాన్సులతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బన్నీ డ్యాన్సులకు కేవలం ప్రేక్షకులే కాదు.. సినీ పరిశ్రమకు చెందిన వారూ ఫిదా అయిపోతుంటారు. తాజాగా ఈ ఖాతాలో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ చేరిపోయారు. సల్మాన్ ఖాన్ ‘వీర్’ సినిమాతో పాపులర్ అయిన జరీన్ ఖాన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. గోపీచంద్ హీరోగా వస్తోన్న ‘చాణక్య’ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మెహ్రీన్ పిర్జాదా ప్రధాన కథానాయిక పాత్ర పోషించింది.
కాగా, ‘చాణక్య’ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోన్న జరీన్‌ను తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా పలకరించింది. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో తన కొత్త జర్నీపై పలు విషయాలను ఆమె పంచుకుంది. దక్షిణాది సినిమాల షూటింగ్‌లో వాతావరణాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని జరీన్ వెల్లడించింది. ‘ఇక్కడ మనుషులు చాలా హుందాగా, క్రమశిక్షణతో మెలుగుతారని నేను విన్నాను. ‘చాణక్య’ షూటింగ్ ద్వారా నేను ఆ అనుభూతిని పొందాను. గతంలో నేను పాల్గొన్న షూటింగ్‌లకు ఇది పూర్తి భిన్నంగా అనిపించింది. ఇదో అద్భుతం’ అని జరీన్ చెప్పుకొచ్చింది.
టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన డ్యాన్సర్ ఎవరు అని అడగగానే అస్సలు ఆలోచించకుండా టక్కున అల్లు అర్జున్ అని చెప్పింది. తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది మంచి డ్యాన్సర్లు ఉన్నారని అయినప్పటికీ తనకు అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించింది. ఆయన డ్యాన్స్ అంటే పడిచచ్చిపోతానంది. ఇక, ‘చాణక్య’ సినిమా గురించి చెబుతూ ఇదొక స్పై థ్రిల్లర్ అని తెలిపింది. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని చెప్పింది.