యంగ్ హీరో నితిన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాల్లో పవన్ కళ్యాణ్ సీన్, అయన ఫోటో, అయన డైలాగ్ ఇలా ఏదైనా ఉండేలా చూసుకుంటూ పవన్ పై అభిమానం వ్యక్తపరుస్తుంటాడు. పవన్ అంటే అంతగా అభిమానం చూపించే నితిన్ కోసం ఈ మద్యే పవన్ కళ్యాణ్ సుధాకర్ రెడ్డితో కలిసి చల్ మోహన్ రంగా సినిమా నిర్మించాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి రాజకీయాల్లో బిజీ అయ్యాడు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ ఆంధ్రా లో తన పార్టీని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆంధ్రాలో రాజకీయాలు రసవత్తరంగా మారి నువ్వా నేనా ? అన్న తరహాలో జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నితిన్ తన అభిమాన నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ కోసం 25 లక్షల విరాళాన్ని జనసేన పార్టీకి ప్రకటించాడు. నిన్న రాత్రి పవన్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనను భీమవరంలో పరామర్శించిన నితిన్, అయన తండ్రి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కలిసి ఈ చెక్కును అందజేశారు.
ఈ సందర్బంగా చెక్కును అందుకున్న పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తనపై ఎంతో అభిమానం చూపిన నితిన్, సుధాకర్ రెడ్డి లకు అయన కృతఙ్ఞతలు తెలిపాడు. ఇక పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ రోజు నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నాడు. జనసేన పార్టీ ని ఆంధ్రాలో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. మరి ఈ నెల 11 న ఎన్నికల్లో ఓటరన్న ఎవరిని నిలబెడతాడో చూడాలి !!