'అతడు'లో కథానాయకుడి చిన్నప్పటి పాత్రలో జూనియర్ మహేష్ బాబుగా, 'ఛత్రపతి'లో జూనియర్ ప్రభాస్గా మెప్పించారు మనోజ్ నందం. బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' చిత్రంలో కథానాయకుడిగానూ ఆకట్టుకున్నారు. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తర్వాత పలు చిత్రాలు చేశారు. ఇప్పుడు తొలిసారి ప్రతినాయకుడిగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రచయిత అబ్బూరి రవిని ప్రతినాయకుడిగా పరిచయం చేస్తున్న సాయికిరణ్ అడివి... మనోజ్ నందాన్నీ ప్రతినాయకుడిగా పరిచయం చేస్తున్నారు. 'వినాయకుడు', 'విలేజ్ లో వినాయకుడు', 'కేరింత' వంటి సెన్సిబుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. వినాయకుడు టాకీస్ పతాకంపై వాస్తవ ఘటనల ఆధారంగా కల్పిత కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ఎన్.ఎస్.జి కమాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది సాయికుమార్, టెర్రరిస్ట్ 'ఘాజీ బాబా' పాత్రలో అబ్బూరి రవి నటించారు. యంగ్ టెర్రరిస్ట్ 'ఫరూక్ ఇక్బాల్ ఇరాఖీ' పాత్రలో మనోజ్ నందం నటించారు. అతని ఫస్ట్ లుక్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ విడుదల చేశారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ "ఫరూఖ్ ఇక్బాల్ ఇరాఖీగా మనోజ్ నందం లుక్ను నేను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. నా చిన్నప్పుడు జూనియర్ మహేష్ బాబుగా మనోజ్ నందం నటించాడు. అప్పటి నుంచి అతడి సినిమాలు చూస్తున్నా. సాయికిరణ్ అడివి గారిని నేను ముందే కలిశాను. 'కేరింత' సినిమా కోసం నేను ఆడిషన్ కూడా ఇచ్చాను. దురదృష్టవశాతూ అప్పుడు నాకు అవకాశం రాలేదు. ఆయన సినిమాలు నేను చూస్తుంటాను. మేమంతా శేఖర్ కమ్ములగారి టీమ్ నుంచి వచ్చాము. మనోజ్ నందం లుక్తో పాటు ఈ సినిమాలో అబ్బూరి రవి లుక్ కూడా నాకు నచ్చింది. ఆది సాయికుమార్, అబ్బూరి రవిగారు, ఎయిర్టెల్ 4జీ గాళ్ శషాకి, అలాగే టీమ్ అందరికీ, ముఖ్యంగా సాయికిరణ్ అడివిగారికి నా బెస్ట్ విషెస్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా" అన్నారు.
సాయికిరణ్ అడివి మాట్లాడుతూ "విజయ్ దేవరకొండకు చాలా చాలా థాంక్స్. తను బిజీగా ఉన్నప్పటికీ మేం అడిగిన వెంటనే లుక్ విడుదల చేయడానికి అంగీకరించాడు. టైమ్లో కూడా మాకు టైమ్ ఇచ్చాడు. 'కేరింత'లో నేను తనకు ఏం చేయలేకపోయా. కానీ, తను మాకు హెల్ప్ చేశాడు. విజయ్ దేవరకొండకు మరోసారి థాంక్యూ" అన్నారు.