దివంగత నటి శ్రీదేవి గురించి సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు రచించిన `అతిలోక సుందరి` పుస్తకావిష్కరణ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రకుల్ ప్రీత్‌సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని తొలి ప్రతిని ఆవిష్కరించి దిల్‌రాజుకు అందించారు. తొలి ప్రతిని మాదాల రవి రూ.20వేలు ఇచ్చి కొనుగోలు చేశారు. ఈ సందర్బంగా అచ్చిరెడ్డి మాట్లాడుతూ `` శ్రీదేవికి ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో నేనూ ఒకడిని. ఆమెలో ఆత్మసౌందర్యం ఉంటుంది. నిర్మలత్వం ఉంటుంది. బాల నటి నుంచి హాలీవుడ్ నటిదాకా ఆమె ప్రస్థానం స్ఫూర్తిమంతం`` అని చెప్పారు. దిల్‌రాజు మాట్లాడుతూ ``ఇండియాలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటి శ్రీదేవి. ఆమె గురించి రామారావుగారు పుస్తకం రాయడం బావుంది. ఆయన అద్భుతమైన జర్నలిస్ట్`` అని అన్నారు.
రకుల్ ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ ``అతిలోక సుందరి అనే పేరు ఆమెకే చెల్లింది. ఆమె జీవితం ఓ వేడుక. ఇండియాలో తొలి సూపర్‌స్టార్ ఆమె. నా ఫేవరేట్ పర్సన్`` అని చెప్పారు.
బీవీయస్‌యన్ ప్రసాద్ మాట్లాడుతూ ``రామారావుగారు రాసిన ఈ పుస్తకం అందరికీ చేరువవ్వాలి`` అని అన్నారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ``బంగారక్క సినిమాలో ఆమెను చూశాను. ఆ తర్వాత ఆమె ఆకాశమంత ఎత్తు ఎదిగింది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లిన వైజయంతీమాల, రేఖ, జయప్రద, శ్రీదేవి చాలా గొప్పవారు. వారిలో ఉన్న అందం, అభినయం, నృత్యం, క్రమశిక్షణ అన్నీ శ్రీదేవిలో ఉన్నాయి. ఆమె చనిపోయినప్పుడు ప్రపంచంలోని సినీప్రియులందరూ కన్నీరు కార్చారు. తెలిసో తెలియకో కొన్ని తప్పటడుగులు వేస్తాం. వాటి పర్యవసానం వేరుగా ఉంటుంది. ఒకసారి నేను సెన్సార్ కోసం ముంబై వెళ్లినప్పుడు శ్రీదేవిగారిని కలిశాను. ఆమె నా సినిమాల గురించి ప్రస్తావించింది. ఇప్పుడు సెన్సార్ బోర్డు కళాకారులను ఇబ్బందిపెడుతోంది. ఇబ్బందిపెట్టకూడదు. ఎన్టీఆర్ గురించి అప్పట్లో సినిమా వస్తోందని చెబితే ఎన్టీఆర్ ఏం పర్వాలేదన్నారు. అంత స్పోర్టివ్ పర్సన్ ఆయన. అలాగే నెహ్రూ గురించి ఆర్.కె.నారాయణ్ వేసిన కార్టూన్లను నెహ్రూ ఏ రోజూ తప్పుగాతీసుకోలేదు. ఇండస్ట్రీ అంతా కలిసి సెన్సార్ గురించి ఆలోచించాలి`` అని అన్నారు.
మాదాల రవి మాట్లాడుతూ ``జర్నలిస్ట్ ఐకాన్ పసుపులేటి రామారావుగారు. వామపక్ష భావాలున్నవ్యక్తి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన రాజీలేని పోరాటం చేస్తూనే ఉన్నారు. జర్నలిజంకి మంచి పేరు తెచ్చారు. మా నాన్నగారికి ఆయనే పీఆర్వో. ఏరోజూ డబ్బు తీసుకునేవారు కాదు. మేమే బతిమలాడి జేబులో పెట్టేవాళ్లం. ఉన్నత విలువలున్న వ్యక్తి ఆయన. భావితరాలకు ఆయన పుస్తకాలు మార్గనిర్దేశకాలు. చనిపోయిన వారు అందరి హృదయాల్లోకి వెళ్తే వాళ్లు స్వర్గంలోకి వెళ్లినట్టు. లేకుంటే నరకానికి వెళ్లినట్టు. శ్రీదేవిగారు స్వర్గంలోనే ఉన్నారు`` అని అన్నారు.
శివాజీరాజా మాట్లాడుతూ ``పసుపులేటి రామారావుగారు, ఆర్.నారాయణమూర్తిగారిని చూస్తే చాలా సింపుల్‌గా ఉంటారు.వాళ్లలాగా నేను ఉండలనా అని ఆలోచిస్తాను. నాకు శ్రీదేవిగారంటే ఇష్టం. చిరంజీవిగారు నటించిన అన్నీ సినిమాల్లోనూ ఆయన డ్యాన్సులనే చూశాను. కానీ ఒక్క సినిమాలో మాత్రం ఆయన పక్కన డ్యాన్స్ చేసిన శ్రీదేవి గారిని చూశాను. ఆమె నవరసాల తేనెపట్టు, దక్షిణాది నుంచి వెళ్లి ఇండియాలో స్టార్ కావడం అంటే మాటలు కాదు. శ్రీదేవి మళ్లీ పుడుతుంది. ఇదే పరిశ్రమలో ఉంటుంది. 100 ఏళ్లు బతుకుతుంది`` అని అన్నారు.
పసుపులేటి రామారావు మాట్లాడుతూ ``శ్రీదేవి నాకు బాలనటిగా పరిచయం. ఆ పాప గురించి జ్యోతిచిత్రలో రాయమని వాళ్ల అమ్మ నన్ను ఎన్నో సార్లు అడిగేవారు. ఒకసారి మాదాల రంగారావుగారు ఓ సినిమా వార్త ఇవ్వమని చెప్పారు.నేను ఇచ్చాను. అందులో దర్శకుడి పేరు లేదు. ఆ దర్శకుడి సెట్లోనే నేను శ్రీదేవిని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ దర్శకుడు నన్ను బయటికి పొమ్మన్నాడు. కానీ ఆమె మాత్రం బయటకు వచ్చి నన్ను పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ మధ్య ఒకసారి ఆమె పార్క్ హయత్ హోటల్‌లో ఉందని తెలిసి వెళ్లాం. నేను సంతోషం సురేష్ కొండేటి, ఫొటోగ్రాఫర్ వాసుతో కలిసి వెళ్లాం. ఆమె మా కోసం కిందికి దిగి వచ్చి, ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె ఎక్కడున్నా ఆమెను మర్చిపోలేం`` అని అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ ``నేను పత్రికాధినేతగా ఎన్నో కవర్ పేజీలు చూశాను. కానీ నాకు అతిలోకసుందరి కవర్ పేజీ బాగా నచ్చింది. వండర్‌ఫుల్ కవర్‌పేజీ ఇది`` అని అన్నారు.