లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రధారిణిగా కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి'. ఇందులో మధునందన్, ప్రవీణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, 'నేను ఇందులో చంటిగాడు పాత్ర పోషించా. పాండుగాడు పాత్రలో నటిస్తున్న మధునందన్‌తో కలిసి అవారాగా తిరుగుతుంటాను. మా బాధ భరించలేక ఊరు జనాలు మమ్మల్ని వదిలించుకోవాలనుకుంటారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల ఇతివృత్తంగా సినిమా సాగుతుంది. ఫుల్ లెన్త్ కామెడీ పాత్ర మాది. ఎమోషనల్‌గా, థ్రిల్లింగ్‌గా ఉండే ముగింపు ఉంటుంది. అది హైలైట్‌గా నిలుస్తుంది. దర్శకుడు కిషోర్ చాలా బాగా రూపొందించారు. ఇటీవల విడుదలైన ఆడియో సినిమాకి ప్లస్ అయ్యింది. కమెడియన్స్ హీరోలుగా మారి యాక్షన్ చేయకూడదు. యాక్షన్ చేసేందుకు పెద్ద హీరోలున్నారు. హాస్యనటులు నవ్వించకపోతే రాణించడం కష్టం. మన తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. కామెడీ రాసే రైటర్స్ కూడా చాలామందే ఉన్నారు. పోటీ ఉన్న మాట వాస్తవమే. హీరోలు కూడా కామెడీ చేయడం అభినందనీయం. ప్రస్తుతం 'జెర్సీ', శర్వానంద్, అల్లరినరేష్ సినిమాల్లో నటిస్తున్నా. కృష్ణభగవాన్ సెటైరికల్ కామెడీ అంటే ఇష్టం' అని అన్నారు. 'పండుగాడు పాత్రలో నవ్విస్తాను. సినిమా మొత్తం వినోదాత్మకంగా సాగుతుంది. చివర్లో కొంతభాగమే హర్రర్, సస్పెన్స్ అంశాలుంటాయి. సినిమాకి స్ట్రాంగ్ డైరెక్షన్ టీమ్ కుదిరింది. క్రెడిట్ అంతా వారిదే. మాకిది మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక్క హాస్య నటుడు పదేండ్లు రాణించడం గొప్ప విషయం. అయితే గతంలో వినోదానికి సినిమా తప్ప మరే మాద్యమం లేదు. దీంతో హాస్యనటులు దశాబ్దాలుగా రాణించారు. ఇప్పుడు అనేక డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫ్లాట్‌ఫామ్స్ వచ్చాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. ఎవరు ఎక్కడైనా రాణించగలుగుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాలనుకుంటున్నా. నటుడిగా కోట శ్రీనివాసరావు స్ఫూర్తి. ప్రస్తుతం 'అక్షర', 'షాజాహాన్' చిత్రాల్లో నటిస్తున్నా' అని మధునందన్ చెప్పారు.