ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో అగస్త్య మంజుతో కలిసి తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రాకేష్‌రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ ‘‘నాకు ప్రత్యేకమైన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఇందులో చూపించిన సంఘటన మీద నాకు అంత అవగాహన లేదు. ఇది జరిగినప్పుడు నేను ముంబైలో ‘రంగీలా’ తీస్తున్నాను. కానీ ఈ బయోపిక్ కోసం నిజాన్ని కనుక్కొనే ప్రయత్నం చేశా. ఒక బయోపిక్ తీయడానికి కావల్సింది నిజాయతీ. ఆ నిజాయతీతోనే ఈ సినిమా చేశా. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల బంధం నాలుగైదేళ్లు సాగి ఉంటే ఆ సంఘటనలన్నింటినీ రెండున్నర గంటల్లో చెప్పడానికి సాధ్యం కాదు. కానీ ఇందులో ఆ కాలం మొత్తం సారాన్ని, ఆత్మని ఇందులో చూడొచ్చు’’. లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీయడానికి నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆయనకి ఈ సినిమాని అంకితం చేస్తున్నా’’ అన్నారు. గీత రచయిత సిరాశ్రీ మాట్లాడుతూ ‘‘రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమా తీయడమనేది చారిత్రాత్మక ఘట్టం. స్క్రిప్టు దశ నుంచి ఆయన ఎంతో తీవ్రంగా కష్టపడి పనిచేశార’’న్నారు. సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ మాట్లాడుతూ ‘‘ఇందులోని సంగీతం ఆర్జీవీ స్టైల్‌లో ఉంటుందా? నా స్టైల్‌లో ఉంటుందా అని అడిగితే అది చెప్పలేను. మిగతావాళ్లకి నచ్చిందంటే బోనస్‌గా ఫీలవుతాను’’ అన్నారు. పోసాని మాట్లాడుతూ ‘‘మొత్తం సినిమా పట్ల పరిపూర్ణ అవగాహన ఉన్న ఒకే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయానికొస్తే ఈ సినిమాని బయటికి రానీయరని చాలామంది చెబుతున్నారు. ఇది జరిగిన కథ కాబట్టి, ముక్క ముట్టుకోకుండా బయటికి వస్తేనే ప్రజలు నమ్ముతారని సెన్సార్ వాళ్లకి ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నా’’ అన్నారు. నిర్మాత రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘రామ్‌గోపాల్ వర్మ ‘ఆ రోజు ఏం జరిగిందో అదే తీస్తా’నని చెప్పారు. ఆయన ఏమనుకొన్నారో, అప్పట్లో ఏం జరిగిందో అది ఈ నెల 22న తెరపై చూస్తారు ప్రేక్షకులు’’ అన్నారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ‘‘రామ్‌గోపాల్ వర్మకి రుణపడి ఉన్నా. 23 ఏళ్లుగా ఒక స్త్రీ నిరంతరంగా వేదన పడుతూ, ఎన్నో అవమానాల్ని గుండెల్లో పెట్టుకొని కుమిలిపోతూ వచ్చింది. ఎవరు న్యాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఆర్జీవీ రూపంలో న్యాయదేవత ప్రత్యక్షమైనట్టు అనిపించింది. ఈ సినిమాతో నిజంగా నాకు మనశ్శాంతి దొరికింది’’ అని అన్నారు.