ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు సినీ రచయితల సంఘం బుధవారం హైదరాబాద్‌లో సిరివెన్నెలని ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా సిరివెన్నల సీతారామశాస్ర్తి మాట్లాడుతూ, ` కళలో సాహిత్యం అనేది అనేక రూపాలుగా ఉంటుంది. అందులో విశిష్టమైనది నాటకం. ఆ నాటకానికి సాంకేతిక రూపమే సినిమా. సినిమాకి ఔన్నత్యం ఎంత అనేది ప్రశ్నించ రానిది. సమాజాన్ని నిలువెత్తు అద్దంలా చూపిస్తుంది సినిమా తెర. సినిమా అంత గొప్పది కాబట్టే నేను సినిమా రంగాన్ని దేవాలయంగా భావిస్తాను. నా మాట పద్మమై పుట్టాలనే తపనతోనే ప్రతి పాటనీ రాస్తుంటాను. అమ్మవారులందరికీ పాదపీఠం పద్మమే కాబట్టి వాళ్లందరి ఆశీస్సులతోనే ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా రాస్తున్నాను. సినిమా పాట రాయడమంటే తేలిక అనుకుంటారు చాలామంది. వైవీఎస్ చౌదరి ఒక సినిమా కోసం రామాయణాన్ని ఒక పాట రూపంలో చెప్పండన్నారు. అదొక సవాల్. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడే పాట రాశాను. గౌరవాన్ని పొందాను. పాట ద్వారా భావాన్ని వ్యక్తం చేయాలి. అందుకోసం నాకు సంతృప్తి లభించే వరకు రాస్తూనే ఉంటాను. సమాజాన్ని ప్రభావితం చేసే అద్భుతమైన మాధ్యమం సినిమా. ప్రేమ, స్నేహం అనేవి పంచుకోగలిగేవి కాబట్టే నేను ఆత్మీయంగా అందరితో ఉండగలుగుతున్నాను. పాట రాయడం తేలిక కాదు. నా జీవిత భాగస్వామి పేరు పద్మావతి. దాంతో నేను పరిశ్రమలోకి వచ్చినప్పుడే పద్మశ్రీతో వచ్చాను. నాకు భారతరత్న రావాలని మనవాళ్లంతా అంటున్నారు. నా దృష్టిలో భారతీయుడు అంటేనే భారతరత్న. భవిష్యత్ లో మరిన్ని మంచి పాటలు రాస్తానని` అన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘తెలుగు చిత్ర పరిశ్రమలో మాకు బాగా పరిచయమైన రచయిత శ్రీశ్రీ. ఆ తర్వాత వేటూరి, సిరివెన్నెలలే. భావో ద్వేగంతో పాటు భావ పూరితమైన పాటలు రాస్తుంటారు సిరివెన్నెల’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘జగమంత కుటుంబం నాది...’ అని పాట రాసిన సిరి వెన్నెల రచయితల కుటుంబం మొత్తానికీ గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆయనకీ, రచయితలకీ మధ్య అన్నదమ్ముల సంబంధం ఉంటుంది. పద్మశ్రీ అనేది తెలుగు సినిమా రంగంలో చాలామంది నటులకి వచ్చింది, దర్శకుల్లో రాజమౌళికీ, సాహితీవేత్తల్లో సినారెకీ వచ్చింది. సినీ గీత రచయితగా వచ్చింది మాత్రం సిరివెన్నెల గారికే’ అన్నారు.
ఈ కార్యక్రమంలో రచయితలు విజయేంద్రప్రసాద్, బుర్రా సాయిమాధవ్, భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, వెన్నెలకంటి, వడ్డేపల్లి కృష్ణ, గుణ్ణం గంగరాజు, కె.ఎల్.నారాయణ, బలభద్రపాత్రుని రమణి, రామ్‌ప్రసాద్, ఆర్పీపట్నాయక్, రామకృష్ణ ఆకెళ్ళ, వై.వి.ఎస్.చౌదరి, వేమూరి, విజయలక్ష్మి, వెనిగళ్ల రాంబాబు, ఉమర్జీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.