టీవీ-9 సీఈవో రవిప్రకాష్ కు చేదు అనుభవం ఎదురైంది. రవిప్రకాష్ టీవీ-9లో లైవ్ చెబుతున్నప్పుడు టీవీ-9 మాజీ రిపోర్టర్ చెప్పుతో దాడి చేశాడు. ఈ సంఘటన తాజాగా కర్నూల్ జిల్లాలో జరిగింది. కర్నూల్ వరద బాధితుల కోసం టీవీ-9 ఏర్పాటు చేసిన 'ప్రజానగర్-2'లో ఈ అపశృతి చోటు చేసుకుంది.
2009లో అక్టోబర్ 2న తుఫాన్ దాటికి కర్నూల్ నగరాన్ని జలప్రళయంగా వేలాది మంది ఇళ్లను కోల్పోయారు. వరద బాధితులకు ఇళ్లను అందించేందుకు పలువురి సహకారంతో టీవీ-9 'ప్రజానగర్' కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా 'ప్రజానగర్- ఫేజ్ 1'ను గతంలోనే ప్రారంభించింది. తాజాగా ఈ రోజు (శనివారం) 'ప్రజానగర్-2' కాలనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవిప్రకాష్ తాము చేపట్టిన కార్యక్రమం గురించి లైవ్ చెబుతున్నాడు. అదే సమయంలో పక్కనుంచి రమణ అనే టీవీ-9 మాజీ రిపోర్టర్ చెప్పుతో ముఖంపై కొట్టాడు. అయితే రమణపై జరిగిన దాడిని అక్కడున్న స్థానికులు అడ్డుకున్నారు. లైవ్ కాబట్టి ఇది చానల్లో ప్రసారమైంది. రవిప్రకాష్ తన లైవ్ ను బ్రేక్ లేకుండా అలాగే కొనసాగించారు.
దాడి ఘటనపై కర్నూల్లో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రమణపై హత్యాయత్నం 307, 120బి సెక్షన్లతో కేసును నమోదు చేశారు. తన కుమారుడికి కీడు జరిగితే అందుకు రవిప్రకాశ్దే బాధ్యత అని రమణ తల్లి జయమ్మ అన్నారు. మా అబ్బాయి చాలా శాంత స్వభావి, మా అబ్బాయి నలుగురికి సాయంచేసే వ్యక్తి, తనకు ఎందుకు కోపంవచ్చిందే తెలియదు అని రమణ తల్లి జయమ్మ అన్నారు. రవిప్రకాష్ పై జరిగిన దాడిని పలువురు ఖండించారు.