25 Dec,2017

నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". బాలకృష్ణకి 102వ చిత్రమిది. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ విజయవాడలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి నారా లోకేష్ ఆడియో సీడీలను ఆవిష్కరించి అతిధులకు అందచేశారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 12న నందమూరి అభిమానులకు సంక్రాంతి కానుకగా "జై సింహా" చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. 

ఆడియో విడుదల అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ..‘‘అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు. నేను నారా భువనేశ్వరి పుత్రుడు లోకేష్‌ని. నన్ను నేను ఇలా చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నా. దానికి కారణం కూడా ఒక సినిమా. గౌతమీపుత్ర శాతకర్ణి. అందుకే మీ అందరి తరుపునా.. నందమూరి బసవతారకమ్మ పుత్రుడు బాలకృష్ణగారికి ధన్యవాదాలు. నా ముద్దుల మావయ్య.. మనందరి బాలయ్య. ఆయన నటించిన జైసింహా సినిమా ఆడియో ఫంక్షన్ మన గడ్డపైన, మన అమరావతిలో జరగడం.. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉంటారు. కానీ మనసులో ఉన్నమాట, డైరెక్ట్‌గా చెప్పగలిగిన ఏకైక హీరో మన బాలయ్య బాబుగారు. హీరో ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఉంటారు. కానీ హీరో కోసం ప్రాణాలు త్యాగం చేసే ఫ్యాన్స్ మాత్రం కేవలం మన బాలయ్య బాబుగారికే ఉంటారు. 1955లో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుగారు జయసింహా సినిమా చేశారు. అది మన విజయవాడలో 160 రోజులు ఆడింది. ఆ చరిత్రని ఈ జైసింహా చిత్రం మరోసారి తిరగరాయబోతుందని, ఈ సభాముఖంగా మీ అందరికీ మాటిస్తున్నాను.

మీసాలు తిప్పినా, తొడగొట్టి వెళ్లినా.. ఇటువంటివి చేయగలిగిన వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి బాలయ్య బాబుగారే. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఒక సింహా, ఒక లెజెండ్, ఒక గౌతమీపుత్ర శాతకర్ణి. చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా అది ఒక్క బాలయ్య బాబుగారి వల్లే అవుతుందని ఈ సభా ముఖంగా మీ అందరికీ చెబుతున్నా. ఇంకో వైపు హిందూపూర్ శాసన సభ్యులు. నేను పంచాయితీ రాజ్, గ్రామీణ శాఖ మంత్రి అయినప్పటి నుంచి ఆయన నన్ను వెంటాడతారు. రోజూ ఫోన్ చేసి.. మా హిందూపూర్‌కి రావడం లేదు. మాకు నిధులు కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరిలో నిధులు ఎక్కువ కావాలని కోరిన ఏకైక శాసన సభ్యులు మన బాలయ్య బాబుగారు.

మూడోది మన కేన్సర్ హాస్పటల్. ఎంతోమంది పేదవారు ఇబ్బంది పడుతున్నారు. కేన్సర్ వ్యాధి వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారందరినీ ఆదుకోవాలి. వాళ్లది ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆదుకోవాలని.. హాస్పటల్‌ని ఒక పద్ధతి ప్రకారం నడిపించిన ఘనత కూడా మన బాలయ్య బాబుగారిదే. అంతేందుకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన కేన్సర్ హాస్పటల్ మన గడ్డపై ఉండాలని,  అమరావతిలో కూడా కేన్సర్ హాస్పటల్‌ని తొందరలో మన బాలయ్య బాబుగారు ప్రారంభించబోతున్నారు.

ఇప్పుడే భట్‌గారు అంటున్నారు. బాలయ్య బాబుగారికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అని. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా పిల్లలందరీ కంటే ఎక్కువ ఎనర్జీ ఆయనలో ఉంది. ఆయన స్పీడ్ చూస్తుంటే నాకే డౌట్ వస్తుంది. మా దేవాంశ్‌తో కూడా బాలయ్య బాబుగారు సినిమా తీసేట్లు ఉన్నారు. అలాంటి ఎనర్జీ ఆయనకి ఉంది. మనం ఇప్పుడు ట్రైలరే చూశాం. సినిమా రాబోతుంది. టాప్ లేచిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మళ్లీ ఇండస్ట్రీలో చరిత్ర తిరగరాయబోయేది మన బాలయ్యబాబుగారే. అలాగే డైరెక్టర్ రవికుమార్‌గారికి, నిర్మాత కల్యాణ్‌గారికి.. ఇంకా ఈ వేదికపై ఉన్న చిత్ర యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే ఇక్కడకు వచ్చిన గౌరవ రాజకీయ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జోహార్ అన్న ఎన్టీఆర్..’’ అంటూ ముగించారు.

Recent News