24 Nov,2017

'వైశాఖం' మంచి సినిమాగా గుర్తింపు పొందడం ఎంతో సంతృప్తిగా వుంది 
- 'ఫాస్‌-అక్కినేని 2017' సినీ టీవి, సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డుల వేడుకలో డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. 


ఫిలిం ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ (ఫాస్‌) - అక్కినేని 2017 సినీ, టీవి అవార్డుల ప్రదానోత్సవం మరియు ఫాస్‌ సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నవంబర్‌ 23న హైదరాబాద్‌ త్యాగరాయగాన సభలో చిత్ర ప్రముఖులు, ఆహుతుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి, సమాచార హక్కుల చట్టం మాజీ కమీషనర్‌ విజయబాబు, ప్రముఖ సీనియర్‌ దర్శకులు రేలంగి నరసింహారావు, డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌, ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు, డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి., ప్రముఖ కమెడియన్‌ పృధ్వీ, నటుడు మాణిక్‌, సినీ జర్నలిస్ట్‌ డా. రెంటాల జయదేవ్‌, టి.వి.9 న్యూస్‌ ఎడిటర్‌ చంద్రమౌళి, జెమిని టీవి శ్రీనివాస్‌ తేజ, విజయ్‌, వి6 ప్రతినిధి విజయ్‌ శర్మ, సౌభాగ్య మీడియా ప్రతినిధి కడవాల వెంకటేశ్వర్లు, కలవెండి ఫౌండేషన్‌ కె.ఎస్‌.మూర్తి, వంశీ బర్కిలీ అవార్డుల అధ్యక్షులు వంశీ రామరాజు, సంస్కృతిరత్న ఫాస్‌ అధ్యక్షులు డా.కె. ధర్మారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు 'అక్కినేని సినీ గాన వైభవం' ఆధ్వర్యంలో అక్కినేని చిత్రాల్లోని పాటల్ని ఆలపించి వీక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి శ్రీమంత్రి భుజంగరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జ్యోతి ప్రజ్వలనతో సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయగారికి ఫాస్‌ సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డుతోపాటు శాలువా, కర్పూరదండ ప్రశంసా పత్రాన్ని, బహుకరించారు. అభినందన పురస్కారాన్ని డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌కి కర్పూరదండ, షీల్డ్‌ని అందజేశారు. ప్రత్యేక ప్రశంసా అవార్డుని నటుడు పృధ్వీకి అందించి సన్మానించారు. ఉత్తమ కుటుంబ కథా చిత్రం 'వైశాఖం'కిగాను నిర్మాత బి.ఎ.రాజుకు శాలువా, షీల్డ్‌తో పాటు సన్మాన పత్రాన్ని అందజేశారు. ఉత్తమ సినీ జర్నలిస్ట్‌ అవార్డును డా. రెంటాల జయదేవ్‌కి బహుకరించారు. ఉత్తమ ఫిలిం అవార్డుల సంస్థకుగాను శిరోమణి డా. వంశీ రామరాజుని సన్మానించి షీల్డ్‌ బహుకరించారు. ఉత్తమ సినీ టీవి, ఈటీవి, ఉత్తమ సీరియల్స్‌ టీవి జెమిని, ఉత్తమ న్యూస్‌ టీవి టీవి-9, ప్రత్యేక ప్రశంసా న్యూస్‌ టీవిగాను 6టీవికి అవార్డులను ప్రదానం చేసి అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు. 
డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ మాట్లాడుతూ - ''జయగారికి సన్మానం అనగానే ఏమీ ఆలోచించకుండా వచ్చేసాను. చిన్నప్పటి నుండి ఇండస్ట్రీలోనే పుట్టి, ఇండస్ట్రీలోనే సినిమాలను చూస్తూ పెరిగాను. 4 దశాబ్దాల ప్రస్థానం. ఈ జర్నీలో మా నాన్నగారు స్వరం అయితే, సంస్కారం మా అమ్మది. అభిమానం ప్రేక్షకులది. మాది అంతా కళాకారుల కుటుంబం. 1974లో 'దేవుడు చేసిన పెళ్లి' చిత్రం నుండి నిన్నటి 'రాజా ది గ్రేట్‌' వరకు సినిమాలను చేశాను. 1000 సినిమాలకి పైగా డబ్బింగ్‌ చెప్పాను. ఒక్క కమల్‌హాసన్‌కి తప్ప మిగతా వారందరికీ డబ్బింగ్‌ చెప్పాను. బి.ఎ.రాజుగారు అజాత శత్రువు. అందరూ బాగుండాలని కోరుకునే మనిషి. చాలా మంచి సినిమాలను నిర్మించారు ఆయన. మా ఆదితో 'లవ్‌లీ' సినిమా తీశారు. అది మంచి హిట్‌ అయ్యింది. అప్పట్నుంచీ మా ఆదికి చేదోడు వాదోడుగా వుంటూ ఆది అభివృద్ధికి తోడ్పాటుని అందిస్తున్నారు. భానుమతిగారి డైరెక్షన్‌లో మా నాన్నగారు యాక్ట్‌ చేశారు. విజయనిర్మలగారి డైరెక్షన్‌లో నేను యాక్ట్‌ చేశాను. జయగారి డైరెక్షన్‌లో మా ఆది చేశాడు. జయగారు 6 సినిమాలకు దర్శకత్వం వహించారు. అన్ని కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ చిత్రాలనే రూపొందించారు. చాలా క్లియర్‌గా, ఏ టెన్షన్‌ లేకుండా స్మూత్‌గా కమాండింగ్‌గా జయగారు వర్క్‌ చేస్తారు. డైరెక్టర్‌కి కావాల్సిన ఎబిలిటీస్‌ అన్నీ ఆమెలో వున్నాయి. 'వైశాఖం' నాకు చాలా ఇష్టమైన సినిమా. అందులో ఒక ఫైర్‌మెన్‌ క్యారెక్టర్‌ చేశాను. అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ గురించి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందరూ ఉమ్మడి కుటుంబంలా జీవించాలని 'తీసుకెళ్లే దేవుడి కంటే మనల్ని మోసుకెళ్లే మనుషులే చాలా గొప్పవాళ్లు' అని మంచి సందేశాన్ని ఇచ్చారు. అంత మంచి చిత్రాన్ని తీసిన జయగారికి సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డు ఇచ్చినందుకు ధర్మారావుగారికి థాంక్స్‌'' అన్నారు. 
డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''నాతో పాటు అవార్డులు తీసుకున్న మిత్రులందరికీ శుభాకాంక్షలు. నాకు సిల్వర్‌ క్రౌన్‌ అవార్డు ఎనౌన్స్‌ చేయగానే ఫస్ట్‌ షాక్‌కి గురయ్యాను. ఇంకా నేను సిల్వర్‌ క్రౌన్‌ అవార్డు తీసుకునేంత దూరం రాలేదు అనే ఉద్దేశంలోనే ఉన్నాను. ధర్మారావుగారు ఈ అవార్డు ఇచ్చి నన్ను షాక్‌కి గురి చేశారు. 'వైశాఖం' చాలా మంచి సినిమా అని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేశారు. 'వైశాఖం'లో మంచి మెసేజ్‌ ఇచ్చాం. అపార్ట్‌మెంట్స్‌లో అందరూ ఉమ్మడి కుటుంబంలా వుండాలి. నలుగురితో కలిసుండాలి అని చెప్పాం. రీసెంట్‌గా ఒక అపార్ట్‌మెంట్‌లో బాలింత చనిపోతే శవాన్ని తీసుకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇలాంటి పరిస్థితి మారాలి. అదే మా చిత్రంలో చూపించాం. మా సినిమా చూసి కూడా జనం మారలేదు అనే బాధ నాలో కలిగింది. అయినా కూడా నా సినిమాలన్నీంటిలోనూ ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే మెస్సేజ్‌ ఇస్తాను. 'వైశాఖం' మంచి సినిమాగా గుర్తింపు పొందడం ఎంతో సంతృప్తిగా వుంది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల మధ్య అవార్డుని తీసుకోవడం చాలా హ్యాపీగా వుంది. 'ఫాస్‌' ధర్మారావుగారికి నా కృతజ్ఞతలు'' అన్నారు. 
ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - 'విజయ్‌బాబు, నరసింహారెడ్డి వంటి పెద్దవాళ్లు పాల్గొన్న ఈ సభలో పాల్గొనడం చాలా ఆనందంగా వుంది. అవార్డు గ్రహీతలందరికీ నా అభినందనలు. ఇప్పటివరకు నేను 7 చిత్రాలు నిర్మించాను. వాటన్నింటిలో నాకు బాగా నచ్చిన సినిమా 'వైశాఖం'. సినిమా చూసి ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అని ఎంతో అభినందించారు. ఇంతవరకు ఇలాంటి సబ్జెక్ట్స్‌ రాలేదు. మంచి సినిమా తీశారు అని చాలామంది మెచ్చుకున్నారు. 'వైశాఖం' ఉత్తమ చిత్రంగా 'వైశాఖం' చిత్రానికి ఫాస్‌ అవార్డుని ఇవ్వడం చాలా సంతోషంగా వుంది. ఎంతో ఇష్టంగా ఈ అవార్డు స్వీకరిస్తున్నాను. ఇదే వేదిక పై మా చిత్రంలో నటించిన సాయికుమార్‌, పృధ్వీ అవార్డులు తీసుకోవడంతో ఇది వైశాఖం ఫంక్షన్‌లా అన్పిస్తోంది. 'వైశాఖం'లాంటి ఒక మంచి చిత్రాన్ని తీసినందుకు గర్వంగా వుంది. అలాగే జయకి సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డు రావడం ఇంకా చాలా హ్యాపీగా వుంది. అందరికీ నా థాంక్స్‌'' అన్నారు. 
సీనియర్‌ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ - ''చిన్న సినిమాలు హిట్‌ అయ్యి వాటికి సరైన గుర్తింపులేక మరుగున పడుతున్న సమయంలో ధర్మారావు ప్రేక్షకుల ఆదరణని పొందిన చిత్రాలను గుర్తించి వారికి అవార్డులు ఇస్తున్నందుకు ఆయనకి నా కృతజ్ఞతలు. నేను అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా వర్క్‌ చేస్తున్న టైమ్‌లో భానుమతిగారు, విజయనిర్మలగారు డైరెక్షన్‌ చేయడం చూశాను. ఆ తర్వాత ఎవరు నెక్స్‌ట్‌ అనుకుంటున్న టైమ్‌లో జయగారు రంగప్రవేశం చేశారు. ఆణిముత్యాల్లాంటి 7 సినిమాలకు డైరెక్షన్‌ చేయడం చాలా గ్రేట్‌. సీనియర్‌ దర్శకులకి మర్యాద ఇవ్వని వాళ్ళు ఎంతోమంది ఉన్న ఈరోజుల్లో ఈ ఫంక్షన్‌కి రాగానే జయగారు లేచి నిలబడి రెండు చేతులతో నాకు దణ్ణం పెట్టారు. ఆవిడ సంస్కారానికి నా హ్యాట్సాఫ్‌. అంత మంచి దర్శకురాలు మన ఇండస్ట్రీలో వుండటం మనందరికీ గర్వకారణం. 'వైశాఖం'లాంటి చక్కని కుటుంబ కథా చిత్రాన్ని తీసిన మా జయగారికి ఫాస్‌ సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డు రావడం ఎంతో సంతోషంగా వుంది'' అన్నారు. 
నటుడు పృధ్వీ మాట్లాడుతూ - ''పండంటి కాపురం', 'గుండమ్మ కథ', 'మిస్సమ్మ' చిత్రాలు సాంప్రదాయ విలువలతో చేశారు. మళ్ళీ ఆ కోవలోనే జయగారు 'వైశాఖం' సినిమా తీశారు. అపార్ట్‌మెంట్‌ కల్చర్‌లో మానవత్వ విలువలు కనుమరుగైపోతున్న తరుణంలో 'వైశాఖం'లాంటి చక్కని సినిమా తీయడం చాలా గొప్ప విషయం. ఆర్‌.జె. సినిమాస్‌ బి.ఎ.రాజుగారి బేనర్‌ అంటే ప్రొడక్షన్‌ వేల్యూస్‌కి ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాలు తీస్తారు'' అన్నారు. 
సీనియర్‌ ఫిలిం జర్నలిస్ట్‌ డా. రెంటాల జయదేవ మాట్లాడుతూ - ''భానుమతి, సావిత్రి, విజయనిర్మలగారి తర్వాత మహిళా దర్శకులు కరువైపోతున్న ఈరోజుల్లో నేనున్నాను అంటూ మహిళా దర్శకుల జెండాను రెపరెపలాడిస్తున్న జయగారికి సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డు రావడం చాలా అభినందనీయం. ఫాస్‌ ఆధ్వర్యంలో నిజమైన కళాకారులకు, టెక్నీషియన్స్‌కు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ధర్మారావుగారిని అభినందించి తీరాలి'' అన్నారు. 
పూర్వ ప్రదాన పాట్నా హైకోర్టు న్యాయమూర్తి ఎల్‌.నరసింహారెడ్డి మాట్లాడుతూ - ''కొన్ని సినిమాలు మనుషుల జీవన గమనాన్ని మారుస్తాయి. అంతలా సినిమా ప్రభావం ప్రజలపై వుంటుంది. మంచి సినిమాలు, కుటుంబమంతా కలిసి ఎంజాయ్‌ చేసే సినిమాలు రావాలి. జయగారు 'వైశాఖం'లాంటి చక్కని కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. ధర్మారావు కళాకారులను ఎంకరేజ్‌ చేస్తూ అవార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎలాంటి వివాదాలకు తావులేకుండా మంచి చిత్రాలలకు అవార్డులు ఇవ్వడం సముచితంగా వుంది. ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలను అభినందిస్తున్నాను'' అన్నారు. 
పూర్వ సమాచార చట్టం కమీషనర్‌ విజయ్‌బాబు మాట్లాడుతూ - ''మహిళా దర్శకులు కరువైపోతున్న నేటి రోజుల్లో జయగారు 'వైశాఖం'లాంటి చక్కని మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని నిర్మించినందుకు హ్యాట్సాఫ్‌. ఆవిడకి సిల్వర్‌ క్రౌన్‌ అవార్డు ఇచ్చినందుకు ధర్మారావుకి ప్రత్యేక అభినందనలు'' అన్నారు. 
'ఫాస్‌' వ్యవస్థాపక అధ్యక్షులు డా. కె.ధర్మారావు మాట్లాడుతూ - ''50 సంవత్సరాలుగా తెలుగు సినిమాలను ప్రత్యేకంగా, పరోక్షంగా చూస్తున్నాను. అప్పట్నుంచీ కళాకారులను ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నాను. దానిలో భాగంగా 20 ఏళ్ల క్రితం అక్కినేని నాగేశ్వరరావుగారు, దాసరిగారు, తుర్లపాటి కుటుంబరావుగారి సలహాతో 'ఫాస్‌' సంస్థని ఏర్పాటు చేశాం. ఉత్తమ కుటుంబ కథా చిత్రాలను, ఉత్తమ నూతన నటీ నటులని ఎంపిక చేసి అవార్డులను ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగు సినిమా 75 సంవత్సరాల వారోత్సవాల్ని 5 రోజుల పాటు ఇదే హాలులో ఘనంగా నిర్వహించాం. 'వైశాఖం'లాంటి సందేశాత్మక చిత్రాన్ని తీసిన జయగారికి ఫాస్‌ సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషంగా వుంది. దర్శకురాలిగా ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించడం మామూలు విషయం కాదు. ఖజకిస్తాన్‌లో పాటల్ని ఎంతో రిచ్‌గా చిత్రీకరించారు. పిక్చరైజేషన్‌ కూడా చాలా అద్భుతంగా వుంది. ఆ సినిమా వంద రోజులు ఆడింది'' అన్నారు. 
వంశీ రామరాజు మాట్లాడుతూ - ''రేలంగి, వంశీ-బర్కిలీ అవార్డులు నాలుగు దశాబ్దాలుగా ఇస్తూ వస్తున్నాం. ధర్మారావు 24 గంటలు కష్టపడే వ్యక్తి. మా వంశీ-బర్కిలీ అవార్డుల్ని తన భుజస్కందాలపై మోసేవాడు. ఎన్నో అవార్డులకు వంశీ-బర్కిలీ అవార్డ్సు ఒక మార్గదర్శకంగా నిలిచాయి'' అన్నారు. 
టీవి 9 న్యూస్‌ ఎడిటర్‌ చంద్రమౌళి మాట్లాడుతూ - ''నిజాన్ని నిర్భయంగా చెప్పడం మా నైజం. మంచిని మంచిగా చెప్తూ.. చెడుని చీల్చి చెండాడుతూ ప్రభుత్వాలను సైతం లెక్క చేయకుండా టీవి9 తెలుగు మీడియా రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తోంది'' అన్నారు. 
నటుడు మాణిక్‌ మాట్లాడుతూ - ''నీతి నిజాయితీగా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన సినిమాలకే అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి అవార్డులు కళాకారులను ఉత్సాహపరుస్తాయి. ధర్మారావుగారు ఇలాగే మరెన్నో అవార్డులు ఇవ్వాలి'' అన్నారు. 

Recent News