అక్టోబర్‌లో ‘ఓయ్.. నిన్నే’
మన సంతోషానికి దగ్గరగా ఉన్నప్పుడే మనం సుఖంగా ఉంటామని నమ్మే ఓ కుర్రాడు విష్ణు. కాలేజీలో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఓ దశలో ప్రేమా? కుటుంబమా? రెండిటిలో ఏదో ఒకదాన్నే ఎంపిక చేసుకోమని అమ్మాయి కోరుతుంది. ఆమె మాట వింటే ప్రేమ... అతని మనసు మాట వింటే కుటుంబం ఉంటుంది. అప్పుడతను ఏం చేశాడనే కథతో రూపొందిన సినిమా ‘ఓయ్.. నిన్నే’. భరత్ మార్గాని, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘పరశురామ్, చందూ మొండేటి, సుధీర్ వర్మ, కృష్ణచైతన్యల వద్ద మా దర్శకుడు సత్య చల్లకోటి దర్శకత్వ శాఖలో పని చేశాడు. అతనికిదే మొదటి చిత్రం అయినా అనుభవమున్న దర్శకుడిలా ‘ఓయ్.. నిన్నే’ను తీర్చిదిద్దాడు. తండ్రీకొడుకుల మధ్య అభిప్రాయ బేధాలు, బావా మరదళ్ల మధ్య ప్రేమకథ చిత్రానికి హైలైట్. గతంలో మా సంస్థ నిర్మించిన ‘సోలో, నువ్వా నేనా, రారా కృష్ణయ్య’ తరహాలో చక్కటి కుటుంబ కథాచిత్రమిది. భరత్, సృష్టిలు కొత్తవాళ్లైనా అద్భుతంగా నటించారు’’ అన్నారు.
దర్శకుడు సత్య చల్లకోటి మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథా చిత్రమిది. ఇందులో హీరోది ముక్కుసూటి మనస్తత్వం. మనసులో మాటను ఎదుటివ్యక్తి మొహం మీదే చెప్పేస్తుంటాడు. అతనికది కొన్నిసార్లు ప్లస్ అయితే, ఇంకొన్నిసార్లు మైనస్ అవుతుంటుంది. అటువంటి మనస్తత్వం వల్ల తండ్రితో అతనికి ఎలాంటి అభిప్రాయబేధాలు వచ్చాయి? మరదలికి, అతనికి మధ్య ఎవరు అడ్డు వచ్చారు? అనేది చిత్రకథ. ‘బొమ్మరిల్లు’లా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’’ అన్నారు.
తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు’ రమేష్, తులసి, ప్రగతి, ధనరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్: వెంకట్.