రుణం రివ్యూ

12 Apr,2019

బ్యానర్ : బెస్ట్ విన్ ప్రొడ్యూక్టన్స్ 
దర్శకత్వం : ఎస్ గుండ్రెడ్డి 
నిర్మాతలు : భీమనేని సురేష్, జి . కృష్ణారావు , 
నటీనటులు : గోపికృష్ణ, మహేంద్ర, శిల్పా, ప్రియా అగస్త్య తదితరులు 
విడుదల : 12- 04- 2019
రేటింగ్ : 3 / 5 

గోపికృష్ణ, మహేంద్ర, శిల్పా, ప్రియా అగస్త్య  ముఖ్య పాత్రల్లో ఎస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రుణం. మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బెస్ట్ విన్ ప్రొడక్షన్స్ బ్యానర్  పై నిర్మించారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం పేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎవరు ఎవరికీ రుణపడ్డారో అన్న విషయం తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 

కథ : 

సుధీర్ ( గోపికృష్ణ ) జీవితం అంటే ఎన్నో ఆశలతో ఆశయాలతో హైదరాబాద్ వస్తాడు. మంచి జాబ్ సంపాదించి తాను కలలుగన్న జీవితం గడపాలనుకుంటాడు. నిజానికి అతను అనాధ. ఆ సమయంలో లతా అనే అమ్మాయి పరిచయం అవడం, ఇద్దరు ప్రేమలో పడతారు. తనకు లతే జీవితం అని తన తల్లి దండ్రులు లేని లోటు ఆమె తన జీవితంలోకి రావడంతో తీరిపోతుందని అనుకుంటాడు. కానీ ఆమె అవకాశవాది అని తనలాగే చాలా మంది యువకులను తన బుట్టలో పడేసుకుందని తెలుసుకుంటాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రియురాలు కొట్టిన దెబ్బ అతని మనసుకు గట్టిగా  తగులుతుంది. డబ్బుకోసమే లతా ఇలా  మోసం చేస్తుందని, అందుకే ఎలాగైనా డబ్బు సంపాదించాలని, దొంగదారికోసం  ఓ చిప్ ని తయారు చేస్తాడు. అతని రూమ్ మేట్ అయిన శ్రీను ( మహేంద్ర ) తో కలిసి హైదరాబాద్ లో బాగా డబ్బున్న వారి అకౌంట్ ను హ్యాక్ చేయాలనీ ప్లాన్ చేస్తారు. ఈ ప్రయత్నంలో హైదరాబాద్ లోనే పేరుమోసిన రౌడీ వెట్రి అకౌంట్ హ్యాక్ చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఉండగా ఈ విషయం తెలుసుకున్న వెట్రి ఇతన్ని పసిగట్టి చంపే ప్రయత్నం చేస్తుం టాడు. వారినుండి తప్పించుకునే క్రమంలో తన ఫ్రెండ్ అయిన శ్రీను చనిపోతాడు. ఊరిలో ఉన్న శ్రీను  తల్లిదండ్రుల గురించి తెలుసుకున్న సుధీర్, శ్రీను వాళ్ళ ఊరికి వెళ్లి అతని అమ్మానాన్నలకు సేవ చేస్తుంటాడు? ఈ క్రమంలో అంధులైన అతని తల్లిదండ్రులు ఇతడు శీను కాదని తెలుసుకుంటారా ? చంపడానికి వెంటపడుతున్న వెట్రి నుండి సుధీర్ ఎలా తప్పించుకున్నాడు? అసలు సుధీర్ ఎవరికీ రుణపడ్డాడు ?  అన్నది మిగతా కథ.  


నటీనటుల ప్రతిభ : 

కొత్త హీరో అయిన గోపికృష్ణ సుధీర్ పాత్రలో బాగానే నటించాడు. నేటి యువతరం మనోభావాలకు ధీటుగా తన పాత్రను పోషించే ప్రయత్నం చేసాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఉన్న యువకుడిగా, తన వల్ల స్నేహితునికి జరిగిన అన్యాయానికి, అతని రుణం ఎలా తీర్చుకోవాలన్న పశ్చాత్తాపం ఉన్న ఎమోషన్స్ బాగా చేసాడు. నటన విషయంలో ఇంకాస్త బెటర్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఇక శ్రీను పాత్రలో మహేంద్ర ఉన్నంతలో చక్కగా నటించాడు. ముఖ్యంగా  అతనితో చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి. సీత పాత్రలో చేసిన హీరోయిన్ అదరగోట్టింది. అచ్చు పల్లెటూరి అమ్మాయిగా .. మరో వైపు మోడరన్ గెటప్స్ లో ఆమె సూపర్ అని చెప్పాలి. ముఖ్యంగా సీత .. సీతిక్కడ అంటూ ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మరో హీరోయిన్ గా చేసిన శిల్పా కూడా తన పాత్ర పరిధిమేరకు చక్కగా నటించింది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు వారి వారి పరిధి మేరకు బాగానే చేసారు. 

టెక్నీకల్ హైలెట్స్ : 

ఈ సినిమాకు సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా  రీ రికార్డింగ్ బాగుంది , కానీ కొన్ని సమయాల్లో సంగీతం మరి డామినేట్ చేసిందని చెప్పాలి. ఆర్ ఆర్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బెటర్. ఎడిటింగ్ ఫరవాలేదు. సినిమా వేగం విషయంలో బాగానే ఉంది. ఇక ఫోటోగ్రఫి చక్కగా ఉంది. కోనసీమ అందాలు చక్కగా చూపించే ప్రయత్నం చేసారు.  దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ అయన ట్రీట్మెంట్ బాగుంది. తల్లిదండ్రులను మించిన వారు లేరంటూ నేటి తరానికి మంచి మెసెజ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు. దాంతో పాటు అయన అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. నిర్మాణ విలువలకు డోకా లేదు. 


విశ్లేషణ : 

ఊరికే డబ్బు సంపాదించాలనుకుంటే కష్ఠాలు కూడా వస్తాయి అన్న ఆసక్తికర కథతో దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా  కొత్త వాళ్ళైన హీరో హీరోయిన్స్ బాగానే చేసారు. కానీ కమెడియన్ తో వేయించిన ఆ వేషం నవ్వించకపోగా .. వెగటు పుట్టించేలా ఉంది. దాన్నిమరి సాగదీసి విసుగు పుట్టించాడు దర్శకుడు. మ్యూజిక్, ఆర్ ఆర్, ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకున్న దర్శకుడు కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. మొత్తానికి ఫ్యామిలి సెంటిమెంట్ అంటే ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే అంశాలతో వచ్చిన రుణం ఓ మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు.  

ట్యాగ్ లైన్ : సెంటిమెంట్ ఎక్కువైంది. 

Recent reviews