సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
ఎడిటర్ : తమ్మిరాజు
నిర్మాత: శిరీష్
రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి
నటీనటులు: వెంకటేష్-వరుణ్ తేజ్, తమన్నా,మెహ్రీన్ కౌర్, ప్రకాష్ రాజ్,రాజేంద్ర ప్రసాద్, ప్రియదర్శి, నాజర్ తదితరులు
విడుదల : 12-01-2019
రేటింగ్ : 3 / 5
ఫ్యామిలి సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు .. అయన బ్యానర్ నుండి వచ్చే సినిమాలు అన్ని ఎమోషన్స్ తో ముక్యంగా ఫ్యామిలి ఆడియెన్స్ ని టార్గెట్ చేసేలా ఉంటాయి. అలాంటి సినిమాలను సంక్రాంతి సీజన్ లో విడుదల కొట్టడం ఆయనకు కొత్తేమి కాదు. వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ఎఫ్ 2, ఫన్ అండ్ ఫ్రాస్ట్రేషన్ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలైంది. మరి ఈ ఫన్ ఎవరికీ ఫ్రాస్ట్రేషన్ ఎవరికీ అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..
కథ:
వెంకీ (వెంకటేష్) ఎమ్మెల్యే దగ్గర పీఏగా పని చేస్తుంటాడు. ఎవరు లేని అనాధ. ఎం ఎల్ ఏ కు తెలిసిన వారిద్వారా వచ్చిన సంబంధం నచ్చి హారిక (తమన్నా)ను పెళ్లాడతాడు. పెళ్లయిన కొత్తలో ఇద్దరు బాగానే ఉంటారు .. కానీ రోజు రోజు కు హారిక పెట్టె టార్చర్ తట్టుకోలేక పోతుంటాడు వెంకీ. ఆ సమయంలోనే హారిక చెల్లెలు హనీ (మెహ్రీన్)తో గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న బోరబండ కుర్రాడు వరుణ్ (వరుణ్ తేజ్) తో పెళ్ళి సెట్ అవుతుంది. పెళ్లి విషయంలో హాని ఫ్యామిలి, హాని వరుణ్ ని టార్చర్ పెడుతుంటారు .. పెళ్లి కాక ముందే హనీ నుంచి వేధింపులు మొదలవడంతో తన తోడల్లుడు వెంకీ తో తన బాధలు చెప్పుకుంటాడు .. ఇద్దరు కలిసి వీరి బాధలను భరించడం వద్దని .. మరో గంటలో పెళ్లి ఉందనగా యూరప్ వెళ్ళిపోతారు. ఇలా అర్ధంతరంగా తమను విడిచి వెళ్లిపోయిన వెంకీ.. వరుణ్ లను వెదికే క్రమంలో హాని, హారిక యూరప్ వస్తారు .. అక్కడ వాళ్ళను కలిసినప్పుడు జరిగిన సంఘటనలు ఏమిటి ? హారిక, హాని వీరిద్దరి కాదని వేరేవాళ్లను పెళ్లి చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు .. ? మరి ఈ పెళ్లి ఆపి వెంకీ, వరుణ్ వాళ్ళను తెచ్చుకున్నారా ? లేదా అన్నది అన్నది మిగతా కథ.
నటీనటుల ప్రతిభ :
ఈ సంక్రాంతికి ఫుల్ గా నవ్వించడానికి వచ్చిన సంక్రాంతి అల్లుళ్ళు సూపర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా వెంకటేష్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి కామెడీ కోరుకుంటున్నారో ఈ సినిమాలో ఆ టైపు కామెడీ బాగానే వర్కౌట్ అయింది. వెంకటేష్ తన కామెడీ టైమింగ్తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. మళ్లీ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల్లోని తన కామెడీని గుర్తుచేసాడు . ఈ సినిమాలో ప్రధానంగా వెంకీ, పెళ్లి తర్వాత ఫ్రస్ట్రేషన్ కి గురి అయ్యే సన్నివేశాల్లో గాని, వరుణ్ తేజ్ తో సాగే సన్నివేశాల్లో గాని, అలాగే క్లైమాక్స్ లో కూడా తనలోని కామెడీ యాంగిల్ తో మరియు తన మాడ్యులేషన్ తో వెంకీ బాగా అలరిస్తారు. ఈ చిత్రానికి వెంకీ నటన ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాలో వెంకీ లుక్ కూడా బాగుంది. వరుణ్ తేజ్ పర్వాలేదు. హైదరాబాదీ కుర్రాడిగా తెలంగాణ యాసతో ఆకట్టుకున్నాడు . తమన్నా.. మెహ్రీన్ కౌర్ నటన పరంగా యావరేజ్ గా ఉన్నా .. తమ గ్లామర్ షోతో ఇద్దరూ బాగానే మెప్పించారు. అందులోను ఇద్దరూ కలిసి కనిపించిన ఒక పాటలో పోటీ పడి అందాల ప్రదర్శన చేశారు. ప్రకాష్ రాజ్ పాత్ర చాలా సాధారణంగా అనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ కూడా యావరేజ్ పాత్రే. ఫ్రెండు పాత్రలో ప్రియదర్శి బాగానే నవ్వించాడు. వెన్నెల కిషోర్ ను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రకు తగ్గట్టు బాగానే చేసారు.
టెక్నీకల్ హైలెట్స్ :
దేవిశ్రీ ప్రసాద్..ఇందులో కూడా పెద్దగా మెప్పించలేకపోయాడు. సంగీతానికి పెద్దగా ప్రాధాన్యమున్న సినిమా కాదు కానీ ఉన్నంతలో మంచి సాంగ్స్ ఒక్కటి కూడా లేదు. నేపథ్య సంగీతం కూడా రొటీన్ గా సాగిపోతుంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ఆకట్టుకుంది . నిర్మాణ విలువలుబాగున్నాయి . ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. ఈ తరంలో క్లాస్-మాస్ అని తేడా లేకుండా అందరినీ అలరించేలా కామెడీ పండించడంలో తాను ముందుంటానని అతను మరోసారి చాటి చెప్పాడు. భార్యాబాధితుల కష్టాల్ని వినోదాత్మకంగా చెప్పడంలో అనిల్ విజయవంతమయ్యాడు. అతడు రాసుకున్న మాటలు భలేగా పేలాయి. కానీ కామెడీ మీద దృష్టిపెట్టి కథను సరిగ్గా తీర్చిదిద్దుకోకపోవడం. ద్వితీయార్ధాన్ని కాస్త బోర్ కొట్టించాడు.
విశ్లేషణ :
ఈ సినిమాకు ప్రధాన బలం వెంకటెష్. కామెడీ విషయంలో వెంకీకి తిరుగులేదన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘మల్లీశ్వరి’ తర్వాత ఆ స్థాయిలో వెంకీ అలరించిన సినిమా ఏదీ రాలేదు. ‘ఎఫ్-2’లో వెంకీ క్యారెక్టర్ ఆ రోజుల్ని గుర్తుకు తెస్తుంది. భార్యా బాధితుడిగా అతను చెలరేగిపోయి నటించాడు. ప్రథమార్ధంలో ఇలా ప్రేక్షకుల కడుపు చెక్కలు చేసే సీన్లు చాలానే ఉన్నాయి. పెళ్లి చూపుల టైంలో వెంకీ చూపించే అత్యుత్సాహం భలేగా ఎంటర్టైన్ చేస్తుంది. ఆ తర్వాత ఇదే తరహాలో సాగే వరుణ్ పెళ్లిచూపుల సన్నివేశాన్ని మరింత హిలేరియస్ గా డీల్ చేశాడు అనిల్. ద్వితీయార్ధానికి వచ్చేసరికి ‘ఎఫ్-2’ మరీ సాధారణంగా తయారై ఫ్రస్టేట్ చేస్తుంది. రెండో అర్ధం ఓ మోస్తరుగా సాగినా కూడా ఒక స్థాయిలో నిలిచే అవకాశమున్న చిత్రాన్ని ఒక దశా దిశా లేకుండా మరీ సిల్లీగా నడిపించడం. ప్రథమార్ధం చూసి ద్వితీయార్ధం మీద ఎన్నో అంచనాలు పెట్టుకుంటాం కానీ.. ‘ఎఫ్-2’ ఆ అంచనాలకు దరిదాపుల్లోనూ నిలవదు. కొంచెం కథ చెప్పాల్సిన చోట అనిల్ తేలిపోయాడు. కథను మలుపు తిప్పే ప్రయత్నం ఏమీ చేయలేదు. అక్కడక్కడా కొన్ని సీన్లు నవ్వించినా కూడా.. కథ మరీ సిల్లీగా సాగడంతో ద్వితీయార్ధం అంత ఎంగేజింగ్ గా అనిపించదు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘ఎఫ్-2’లో బోలెడంత ఫన్ ఉంది. కొంచెం ఫ్రస్టేషన్ తప్పదు మరి.