అమర్ అక్బర్ ఆంటోని 

16 Nov,2018

సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ - మోహన్ చెరుకూరి
స్క్రీన్ ప్లే - రచన - దర్శకత్వం: శ్రీను వైట్ల
నటీనటులు: రవితేజ - ఇలియానా - షాయాజి షిండే - తరుణ్ అరోరా - ఆదిత్య మీనన్ - సునీల్ - వెన్నెల కిషోర్ తదితరులు
విడుదల తేదీ : నవంబర్ 16, 2018
రేటింగ్ : 2. 5 / 5

గతంలో ‘వెంకీ’.. ‘దుబాయ్ శీను’ లాంటి హిట్లు అందించిన రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం  అమర్ అక్బర్ ఆంటోని’. శ్రీను వైట్ల మార్క్ కాకుండా భిన్నమైన సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ మూడు షేడ్స్ లో కనిపిస్తాడు.  మరి అమర్ అక్బర్ ఆంటోని ఎవరన్నది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే .. 

కథ:

అమర్ (రవితేజ) తన చిన్నతనంలోనే తన ఫ్యామిలిని కోల్పోతాడు. వీరి కుటుంబం ఎంతో నమ్మి తమ సంస్థలో భాగస్వాములుగా చేసుకున్న వాళ్లే కుట్ర పూరితంగా వాళ్లను చంపేస్తారు. ఓ హత్య చేసి జైలుకు వెళ్లిన అమర్.. తిరిగొచ్చి తనకు కుటుంబాన్ని దూరం చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు. అమెరికాలో వాటా అనే సాంస్కృతిక సమితికి కో ఆర్డినేటర్ గా ఉండే ఐశ్వర్య ( ఇలియానా ) తో పరిచయం ఏర్పడుతుంది. ఐతే అమర్ కు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. తనకే తెలియకుండా చిత్ర విచిత్రంగా.. ముగ్గురు వ్యక్తుల్లా ప్రవర్తిస్తుంటాడతను. ఇంతకీ అతడి సమస్య ఏమిటి ? దీన్ని అధిగమించి తన శత్రువులను ఎలా అంతమొందించాడు అన్నది మిగతా కథ.  

రవితేజ కొత్తగా కనిపించాడు కానీ.. నటించేందుకు అక్కడ పెద్దగా స్కోప్ లేదు.  అతడిలో ఎప్పుడూ ఉండే ఎనర్జీ ఇందులో కనిపించలేదు. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అతడికి సెట్టవ్వలేదు. పాత్రలో వైరుధ్యం చూపించాల్సిన సన్నివేశాల్లో రవితేజ తేలిపోయాడు. ఇలియానా గ్లామర్ గా కనిపించింది, నటన పరంగా ఇలియానా బాగా చేసింది. విలన్లుగా ఒకరికి నలుగురు కనిపించారు కానీ.. ఎవ్వరూ ప్రత్యేకంగా తనదైన స్థాయిలో ఆకట్టుకోలేదు.  ఒక్క పాత్రనూ సరిగా తీర్చిదిద్దలేదు. ఎఫ్బీఐ ఆఫీసర్ గా అభిమన్యు సింగ్  ఓవరాక్షన్ ఓ రేంజ్ లో ఉంది.  అతడి పాత్ర విసిగిస్తుంది. సత్య.. వెన్నెల కిషోర్.. సునీల్ ల కామెడీ పర్వాలేదు. మిగతా నటీనటులంతా యావరేజ్. 

ఇదివరకే ఓ రేంజ్  వినోదాన్ని అందించిన దర్శకుడు శ్రీను వైట్ల. ఒక దశ దాటాక అతడి బలమే బలహీనతగా మారిందేమో. తాను క్రియేట్ చేసుకున్న  ఫార్మాట్ దాటి బయటికి రాలేక విసుగెత్తించేశాడు.  రొటీన్ ప్రతీకార కథనే ఎంచుకుని.. దాన్ని డిఫరెంట్ ట్రీట్మెంట్ తో నడిపించాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దాన్ని డీల్ చేయడంలో వైట్ల పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.  థమన్ ఈ సినిమాకు పెద్దగా ఆకట్టుకునే మ్యూజిక్ ఇవ్వలేదు. నేపథ్య సంగీతం రొటీన్ గా అనిపిస్తుంది. వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణం జస్ట్ ఒకే. సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా రాజీ లేకుండా సినిమాకు ఖర్చు పెట్టిన విషయం తెరపై కనిపిస్తూనే ఉంటుంది. ఇక దర్శకుడు వైట్ల గురించి చెప్పాలంటే ..  ఏదో కొత్తగా ట్రై చేద్దామని చూశాడు కానీ.. అది వర్కవుట్ అవ్వలేదు. 

స్ప్లిట్ పర్సనాలిటీతో హీరో బాధ పడడం, అన్నది  ఎప్పుడో ‘అపరిచితుడు’ రోజుల్లోనే చూసిన ఈ పాయింట్ ను కొంచెం భిన్నంగా డీల్ చేయాలని చూశాడు. కానీ రవితేజ క్యారెక్టర్లు మార్చుకుని చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటే.. కామెడీగా అనిపిస్తుంది తప్ప ఇంటెన్సిటీని ఫీలవ్వలేం. అసలు కథలో ఎక్కడా ఈ పాయింట్ ఇమడక.. ఏదో ఒక సెపరేట్ ట్రాక్ నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది.   దీన్ని ఎలా డీల్ చేయలో తెలియని సందిగ్ధంలో కంగాళీ చేసేశాడు వైట్ల. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్లో విక్రమ్ లాంటి నటుడి నుంచి పతాక స్థాయి పెర్ఫామెన్స్ చూశాక.. రవితేజ కూడా సాధారణంగా అనిపిస్తాడు. 

 రొటీన్ రివెంజ్ డ్రామా , కథలో తర్వాత ఏం జరుగుతుందనే ఎగ్జైట్మెంట్ కలగదు. ఫ్లాష్ బ్యాక్ ను రిపీట్ చేయడం చిరాకు తెప్పిస్తుంది.
ఎప్పట్లాగే కామెడీ బెటాలియన్ పెద్దగానే దించాడు కానీ ఎక్కడా కూడా పేలిపోయే కామెడీ లేదు. అక్కడక్కడా సత్య.. వెన్నెల కిషోర్.. సునీల్ కొంచెం నవ్వులు పంచారు తప్పితే.. ఒకప్పటి వైట్ల స్థాయి కామెడీకి అవకాశమే లేదు. సెటైర్లకు పెట్టింది పేరైన వైట్ల.. ఈసారి అమెరికాలో తెలుగు సంఘాల మీద పంచులేయాలని చూశాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. మొత్తంగా చూస్తే వైట్ల గత సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా అనిపిస్తుంది తప్ప.. అలరించదు.  

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY