Mr మజ్ను ప్రీ-రిలీజ్ వేడుక 

22 Jan,2019

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ చిత్రాల  నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌ 'మిస్టర్‌ మజ్ను'. ఈ చిత్రం  జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సందర్భంగా  ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌ జె ఆర్ సి కన్వెన్షన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ విడుదల చేసిన 'Mr మజ్ను' థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాక విడుదలైన 3 గంటల్లోనే 1  మిలియన్ వ్యూస్, 12  గంటల్లో 2 మిలియన్ వ్యూస్, 15 గంటల్లోపే 3 మిలియన్ వ్యూస్  సాధించి దూసుకెళ్తోంది. ఇదే వేదిక పై 'Mr మజ్ను' తొలి టికెట్‌ను కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కోనుగోలు చేశారు. టికెట్ అందుకుంటున్నప్పుడు ఎన్టీఆర్‌ స్వయంగా జేబులోనుంచి 2 వేల నోటు తీసి నాగార్జున చేతికి ఇచ్చి ఈ టికెట్ కొనడం విశేషం. ఈ సందర్భంగా...కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌ మా పెద్ద పెద్దబ్బాయి. తను నన్ను ఎంతో ఆప్యాయంగా బాబాయ్‌ అని పిలుస్తుంటాడు. అలా అన్నప్పుడల్లా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వేడుకకి వచ్చినందుకు తారక్‌కి థాంక్స్‌. అఖిల్‌, తారక్‌ నుండి యాక్టింగ్‌ తో పాటూ మాస్‌ నేర్చుకోవాలి. బివిఎస్ఎన్‌ ప్రసాద్‌ గారికి నిర్మాతగా 25వ సినిమా. ఇండస్ట్రీలో 'మగధీర', 'అత్తారింటికి దారేది' వంటి రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఆయన ప్రొడక్షన్‌లో అఖిల్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. తమన్‌ తాతగారు ఘంటసాల బలరామయ్యగారు, ఎక్కడో నాన్నగారిని రైల్వేస్టేషన్‌లో చూసి ఆర్టిస్ట్‌గా పనికొస్తావని చెన్నైకు తీసుకెళ్లారు. తమన్‌ ఈ సినిమాకు పని చేయడం చూస్తుంటే ఓ సర్కిల్‌ పూర్తయినట్లుగా ఉంది. వెంకీ అట్లూరి, మా సినిమాలను చూసి ఇన్‌స్పైర్‌ అయ్యి ఇక్కడకు వచ్చాడని తెలిసింది. తొలిప్రేమ సినిమా  చూశాను. లవ్‌స్టోరీకి ఏ అంశాలు కావాలో వెంకీ బాగా తెలుసు. నవ్వించడం, ఏడిపించడం, ప్రేమించడం వెంకీకి  బాగా తెలుసు. పాటలు బావున్నాయి. కొన్ని సీన్స్‌ చూశాను. చాలా బావున్నాయి. సినిమా తప్పకుండా హిట్‌ అవుతుంది. మజ్ను టైటిల్‌ నాన్నగారి టైటిల్‌.. తర్వాత నా దగ్గరికి వచ్చింది. ఆ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో, ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''నాగార్జునగారిని నేను బాబాయ్‌ అని పిలిస్తే.. ఆయన నన్ను అబ్బాయ్‌ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఇక్కడకు గెస్ట్‌లా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలా వచ్చాను. ఇక్కడ కేవలం బాబాయ్‌, చైతు, అఖిలే కాకుండా సినిమాకు పనిచేసిన చాలా మంది నాకు చాలా కావాల్సిన వాళ్లు. ఆ వరుసలో ముందుగా బివిఎస్ఎన్‌ ప్రసాద్‌ గారు ఉంటారు. ఓ మంచి సినిమా తీయాలంటే నిర్మాతకు వ్యామోహం ఉంటే సరిపోదు. వ్యాపారం కూడా తెలిసి ఉండాలి. వ్యాపారం తెలిస్తే, ఓ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలి?. దాన్ని ఎలా మార్కెట్‌ చేయాలి? అది హిట్‌ అయిన తర్వాత మనం కూడా ఎలా డబ్బులు సంపాదించుకోవాలి? అనేది తెలుస్తుంది. వ్యామోహం ఉన్నప్పుడు ఈ సినిమాను ఎంత అద్భుతంగా తెరకెక్కించాలి. ప్రేక్షక దేవుళ్లకు అందించాలనేది తెలుస్తాయి. కాబట్టి నిర్మాతకు వ్యామోహం, వ్యాపారం రెండూ తెలియాలి. నేను ఈ బ్యానర్‌లో 'ఊసరవెళ్లి', 'నాన్నకు ప్రేమతో'  రెండు సినిమాలు చేశాను. 'ఊసరవెళ్లి' సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. 'నాన్నకు ప్రేమతో' నాకు బాగా దగ్గరైన సినిమా. ప్రసాద్‌గారిని చాలా దగ్గరగా గమనించాను. ఆయనకు వ్యాపారం తెలియదు. సినిమా అంటే ఆయనకు వ్యామోహం. అదే ఆయనలో గొప్ప లక్షణం. సంపాదించిన ప్రతి రూపాయిని తిరిగి చలనచిత్ర సీమకే అందించే గొప్ప నిర్మాత. అలాంటి నిర్మాత పది కాలాల పాటు సుఖంగా ఉండాలి. పది కాలాల పాటు మంచి చిత్రాలను మనకు అందిస్తూ సంతోషంగా ఉండాలి. 'ప్రసాద్‌గారు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండీ'.. అంటే. 'పర్లేదు బాబు.. ఇది కాకపోతే మరో సినిమా. నా జీవితం సినిమా ఇండస్ట్రీకే అంకితం' అని చెప్పిన వ్యక్తి ఆయన. ఇలాంటి నిర్మాత సుఖంగా పది కాలాల పాటు ఉండి మరిన్ని మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. "మిస్టర్‌ మజ్ను"అనే సినిమా ఆయన కెరీర్‌లో మైలురాయి కావాలి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్‌ ఉండేవాళ్లు. వాళ్ళలో వెంకీ ఒకడు. తను నాకొక నటుడిగా పరిచయం. తర్వాత రచయితగా పరిచయం. తర్వాత దర్శకుడిగా పరిచయమైయ్యాడు. నేను వెంకీకి కూడా చెప్పని మాట ఒకటుంది. తను నటుడిగా చేశాడు, రైటర్‌ అంటున్నాడు.. ఇప్పుడు దర్శకుడు అంటున్నాడు. నాకు తనలో చిన్న కన్‌ఫ్యూజన్‌ కనపడేది. తను రాణించకపోతే ఏం చేస్తాడు? అనే బెరుకు, భయం ఉండేది. అందుకు కారణం తను నాకు బాగా కావాల్సిన వ్యక్తి. సుదీర్ఘమైన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. ఎందరో ఎన్నో ప్రేమకథలు రాశారు... నటించారు. మళ్లీ ప్రేమకథ అంటున్నాడు. 'తొలిప్రేమ'అనే టైటిల్‌ను పెట్టుకున్నాడు. కొత్తగా ఏం చూపిస్తాడనే టెన్షన్ ఉండేది. తొలిప్రేమ చూసిన తర్వాత తనను చూసి గర్వపడ్డాను. ఆషామాషీ విషయం కాదు. ఫైట్స్‌ ,  డ్యాన్సులు పెట్టి కమర్షియల్‌ సినిమా చేయడం కంటే కేవలం కథా బలంతో, నటీనటుల బలంతో ఓ కథను తెరకెక్కించడం చాలా కష్టమైన పని. తొలి చిత్రంతో అది సాధించాడు. తను ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. వెంకీ జీవితంంలో ఎంతో సాధించాలి. సాధిస్తాడు. అయితే "మిస్టర్‌ మజ్ను"తన కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుంది. అలాగే 'బృందావనం' చేసే సమయం నుండి తమన్‌తో పరిచయం ఉండేది. తనతో ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేశాను. తన చుట్టూ చాలా నెగిటివిటీ ఏర్పడింది. అది చూసి నాకు చాలా బాధ కలిగేది. ఎందుకంటే తన పొటెన్షియల్‌ ఏంటో నాకు తెలుసు. 'దేవుడా! తనకు ఏదో ఒకరోజు ఓ అవకాశం రావాలి. తను కదంతొక్కుకుంటూ పైకి రావాలి' అని అనుకుంటున్న సమయంలో 'తొలిప్రేమ' సినిమా వచ్చింది. తర్వాత 'అరవింద సమేత'లో తనతో దగ్గరగా ఉండి పనిచేసినప్పుడు తమన్‌ ఇక వెనక్కి తిరిగి చూడడనిపించింది. అందుకు ఇప్పుడు" మిస్టర్‌ మజ్ను" మరో ఉదాహరణ. తమన్‌ ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌ అందించాడు. తను ఇంకా గొప్ప చిత్రాల్లో పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇక నా తమ్ముడు అఖిల్‌ గురించి చెప్పాలంటే.. ఓ నటుడికి ముఖ్యంగా కావాల్సిన ఆత్మ విమర్శ గుణం అఖిల్‌లో ఉన్నట్లు ఎవరికీ ఉండదు. ఆత్మ విమర్శ చేసుకోవాలంటే దమ్ముండాలి. ఎన్నోసార్లు తనని తాను ఆత్మ విమర్శ చేసుకుంటూ, తనని తాను మార్చుకుంటూ, తన పంథాని తాను మార్చుకుంటూ ఈ మజిలీకి చేరాడు. ఈ రోజు నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి 'అఖిల్‌ విల్‌ బికమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్‌ యాక్టర్స్'. నేను కూడా మీ అందరితో పాటు ఆరోజు కోసం వెయిట్‌ చేస్తుంటాను. ఆరోజు ఎంతో దూరంలో లేదు. దగ్గర్లోనే ఉంది. అది మిస్టర్‌ మజ్ను అనే చిత్రంతో తెలుస్తుంది. ఈ చిత్రం, అఖిల్‌ కెరీర్‌లో ఒక గొప్ప చిత్రంగా మిగలాలి అని ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బివిఎస్ఎన్‌ గారికి వెనుక ఉండే బాపినీడు, నా ఆప్తమిత్రుడు, నాకెంతో కావాల్సిన వ్యక్తి.  వాళ్ళ నాన్నకి వెనక తోడుగా ఉండేది మా బాపినీడే.   ఈ సినిమా అద్భుత చిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు'' అన్నారు.

Recent News