అవినీతిపరుల గుండెల్లో గునపం దింపడమే లక్ష్యంగా సేనాపతి బరిలో దిగుతున్నాడు. అవినీతి కొమ్మపై నిర్మితమైన సంఘాన్ని కరెక్ట్ చేయడమే ధ్యేయంగా ఈసారి శంకర్ అస్త్రం సంధిస్తున్నాడు. . అలక్ష్యం.. అభద్రత.. నిర్లక్ష్యం... పేరు ఏదైనా సంఘంలో పేరుకుపోయిన తుప్పును వదిలించేందుకు కొత్త అస్త్రం సిద్ధం చేస్తున్నాడు. దీనికి పొలిటికల్ సబ్జెక్టును ఎంచుకుని థ్రిల్లర్ మోడ్ లో రక్తి కట్టించేందుకు శంకర్ శంకారావం పూరించాడు. జనవరి 18 నుంచి భారతీయుడు 2 సెట్స్ పైకి వెళుతోంది. తమిళంలో ఇండియన్ 2 - హిందీలో హిందూస్తాన్ 2 పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. 2.0 వరల్డ్ వైడ్ రిలీజ్ - ఘనవిజయం నేపథ్యంలో భారతీయుడు 2 చిత్రాన్ని అత్యంత భారీతనంతో నిర్మించేందుకు లైకా సంస్థ సన్నాహాలు చేస్తోంది. దాదాపు 500కోట్ల బడ్జెట్ వెచ్చించనున్నారని తెలుస్తోంది. తాజాగా శంకర్ టీమ్ నుంచి సంక్రాంతి కానుక అందింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. సేనాపతి లుక్ ని తాజాగా రివీల్ చేశారు.