90 ఎం ఎల్ ఇది చాలా తక్కువేనట 

09 Apr,2019

ఓవియా హెలెన్‌, అన్సన్‌ పాల్‌, మసూమ్‌ శంకర్‌ ప్రధాన పాత్రధారులుగా శింబు ప్రత్యేక పాత్రలో నటిస్తూ సంగీతం అందించిన చిత్రం '90 ఎంఎల్‌' (ఇది చాలా తక్కువ). అనితా ఉదీప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో విడుదలై ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని క్రిష్ణ కాకర్లమూడి నిర్మాణ సారథ్యంలో కరుణ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పటాన్‌ చాంద్‌ బాషా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇటీవల చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన సాయి వెంకట్‌ మాట్లాడుతూ, 'యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అని టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. మంచి టైమ్‌లో విడుదల చేయాలి. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'అయిదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ ఇది. అపార్ట్‌మెంట్‌కి కొత్తగా వచ్చిన అమ్మాయి, చాలా అందంగా, స్టయిల్‌గా ఉంటూ మంచి తనంతో అక్కడున్న వారందరినీ ఒక్కటిగా చేస్తుంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అందరు కలిసి మందు కొడతారు. అప్పుడు వారిలోని మరో వ్యక్తి బయటకు వస్తారు. మనసులో ఉన్న బాధని, సంతోషాన్ని పంచుకుంటారు. ఒకరి సమస్యల్ని అందరు కలిసి తీర్చుకుంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసి ఉంటారనేది కథ. కామెడీ డ్రామాగా సాగుతుంది. ఓవియా ప్రధాన పాత్ర పోషించారు. సినిమాలోని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. శింబు సంగీతం అందించడంతోపాటు మంచి ప్రత్యేక పాత్రలో మెస్మరైజ్‌ చేశారు. ఈ నెలలోనే విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం' అని నిర్మాత చాంద్‌ బాషా తెలిపారు. 'తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్కడ 16 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ మంచి బిజినెస్‌ అయ్యింది. తెలుగు ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా' అని రామకృష్ణ చెప్పారు.

Recent News