సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ అగస్త్య మంజుతో కలిసి.. తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తప్ప అన్ని చోట్లా సినిమా విడుదలైంది. అయితే ఆంధ్రాలో విడుదల చేయనివ్వకపోవడంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా శుక్రవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు .. ఈ కార్యక్రమంలో వర్మ మాట్లాడుతూ ... ‘భారతదేశంలో ఒక సినిమాను కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే విడుదల చేయనివ్వకపోవడమనేది ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇది చరిత్రలోనే మొదటిసారి జరిగింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీయాలని నేను నిర్ణయించుకున్నప్పుడు రాకేశ్ రెడ్డి వైకాపా నాయకుడని నాకు తెలీదు. తెలిసినా సినిమా చేయకుండా ఉండేవాడిని కాను. ఎన్టీ రామారావు చివరి రోజుల్లో జరిగిన కథ అందరికీ తెలియాలి. ఏ విధంగా జరిగిందనేది తెలియాలి. కొందరు చేస్తున్న ఒత్తిళ్ల వల్ల సినిమాను ఏపీలో విడుదల కానివ్వలేదు. అలా చేస్తోందెవరో నాకు తెలుసు. కానీ, కోర్టు సినిమాను నిలిపివేయాలని తీర్పునిచ్చింది కాబట్టి ఒక పౌరుడిగా నేను న్యాయస్థానంతో ఏకీభవించాను. నేను, రాకేశ్, డిస్ట్రిబ్యూటర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నాం. మొత్తంగా ఇవాళ సినిమాకు వచ్చిన స్పందన బాగుందని చెప్పగలను. త్వరలో ఏపీలోనూ సినిమాను విడుదల చేయడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. నాకు సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి ఇబ్బందిలేదు అన్నారు. నిర్మాత రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈరోజు తెలుగు ప్రజలందరికీ శుభదినం. కానీ, ఏపీలో మాత్రం బ్లాక్డే. నిజాలను చూపిస్తారని భయపడి ఇలా సినిమాను రద్దు చేస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. దీనిపై మేం సుప్రీంకోర్టుకు వెళతాం. నిజమే ఎప్పటికైనా గెలిచేది. తప్పకుండా మాకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. నిర్మాతగా నేను నష్టపోయింది ఏమీ లేదు. నాకు వర్మ వెయ్యి కోట్ల విలువైన పేరును తెచ్చిపెట్టారు. ఓ మహనీయుడికి సంబంధించిన నిజాల గురించి ప్రేక్షకులకు తెలియ చెప్పాలనే ప్రయత్నం మాది అన్నారు.