అంజలి ప్రధాన పాత్రలో నటించిన 'గీతాంజలి' విడుదలకు ముందు మహిళా ప్రాధాన్య చిత్రమే. విడుదల తరవాత పెద్ద విజయం సాధించింది. నవీన్ చంద్ర, స్వాతి నటించిన 'త్రిపుర' విడుదలకు ముందు చిన్న చిత్రమే. విడుదల తరవాత పెద్ద విజయం సాధించింది. కథ, కథనం, దర్శకత్వం, నటీనటుల అద్భుత ప్రదర్శన ఉన్న చిన్న చిత్రాలు భారీ విజయాలు సాదిస్తుండటంతో విడుదలకు ముందే శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు ఛానల్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల ఎన్నో చిత్రాలు అందుకు ఉదాహరణగా నిలిచాయి. తాజాగా 'విశ్వామిత్ర' శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానల్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది.
నందితా రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'విశ్వామిత్ర'. 'గీతాంజలి', 'త్రిపుర' వంటి హిట్ హారర్ థ్రిల్లర్స్ తర్వాత రాజకిరణ్ దర్శకత్వంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'సత్యం' రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రధారులు. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల సినిమా చూసిన ప్రముఖ ఛానల్ ప్రతినిధులు ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు.
రాజకిరణ్ మాట్లాడుతూ "వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది. న్యూజీలాండ్, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసిన ఈ కథ రాసుకున్నా. సృష్టిలో ఏది జరుగుతుందో... ఏది జరగదో!? చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. శాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ రేటు రావడం సంతోషంగా ఉంది. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం" అన్నారు.