సంచలన దర్శకుడు వర్మ తెరకెక్కించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా ఇప్పటికే సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే . అయితే తాను నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాకుండా ఎవరూ ఆపలేరని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం, సెన్సార్ బోర్డు మినహా ఎవరూ సినిమాను ఆపలేరని అన్నారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని భావించి, సెన్సార్ బోర్డు అడ్డుకుంటే వారికి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తెలుగుదేశం వారు డిమాండ్ చేసినట్టుగా సినిమాను ఆపే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబుని విలన్ గా చూపిస్తున్నారని, ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.