రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన `కె.జి.ఎఫ్- చాప్టర్ 1` సంచలనాల గురించి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రఖ్యాత హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. సౌత్ లో బాహుబలి తర్వాత ఆ స్థాయి గుర్తింపు దక్కించుకున్న సిరీస్ ఇది. కన్నడలో 100 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం హిందీలో ఏకంగా45కోట్లు పైగా వసూలు చేయడం ఓ సంచలనం. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వసూళ్లు సాధించింది. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ ఘనవిజయం నేపథ్యంలో కె.జి.ఎఫ్ సీక్వెల్ పై భారీ అంచనాలేర్పడ్డాయి. పార్ట్ 2లో బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటించనున్నారు. `కెజిఎఫ్ చాప్టర్ 2 `చిత్రాన్ని నేడు బెంగళూరు కంఠీరవ స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో ఉదయం 9.30కు లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ తనయుడు.. `కెజిఎఫ్ 2` ఎగ్జిక్యూటివ్ నిర్మాత కైకాల రామారావు, చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్, కథానాయిక శ్రీనిధి శెట్టి తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తారు. అక్టోబర్ తో చిత్రీకరణ పూర్తవుతుంది. నవంబర్ నుంచి సీజీ వర్క్ సహా నిర్మాణానంతర పనులు పూర్తి చేస్తారు. 2020 వేసవి కానుకగా సినిమా రిలీజవుతుంది. చాప్టర్ 1లో నటించిన స్టార్లు అంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ స్టార్లు ఇందులో నటిస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సీక్వెల్ చిత్రాన్ని ప్రఖ్యాత హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనుంది. కెజిఎఫ్ చాప్టర్ 1 చిత్రాన్ని ఎంతో ప్రేమించి అభిమానించిన అభిమానులకు చాప్టర్ 2 డబుల్ ట్రీట్ ఇస్తుందని యశ్ తెలిపారు.